అభివృద్ధి చేస్తుంటే అడ్డుకున్నదెవరు : అజ్మీరా ప్రహల్లాద్

by Aamani |   ( Updated:2023-11-13 09:49:22.0  )
అభివృద్ధి చేస్తుంటే అడ్డుకున్నదెవరు :  అజ్మీరా ప్రహల్లాద్
X

దిశ, మంగపేట : ములుగు నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేస్తుంటే అడ్డుకున్నదెవరో ఆ పార్టీ మంత్రులు, నియోజకవర్గ ఇంచార్జ్ మంత్రులు, ఎంపీ ప్రజలకు చెప్పాలని బీజేపీ అభ్యర్థి అజ్మీరా ప్రహల్లాద్ అన్నారు. సోమవారం మండల పర్యటనలో భాగంగా మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంబించి విలేకర్లతో మాట్లాడారు. గడచిన తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు నాటి దివంగత మంత్రి చందూలాల్ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప మరే పని చేయలేదని విమర్శించారు. ములుగు ఎమ్మెల్యే పదవి తప్ప మంత్రులు, ఎంపి, స్థానిక సంస్థలలో జడ్పీటీసీ, సొసైటీ చైర్మన్లు మొదలు కొని వార్డు నెంబర్ ల వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా అభివృద్ధి ఎందుకు కాలేదో ఎవరు అడ్డుకున్నారో ప్రజలకు వివరించాలన్నారు. చేసిన అభివృద్ధి సైతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన నిధులతో గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్డు, డ్రైనేజీలు, పల్లె ప్రకృతి వనాలు, హరితహారం, క్రీడా ప్రాంగణాలు, వైకుంఠదామాలు నిర్మించి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని ప్రజలకు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం తమ నిధులతో ములుగు నియోజకవర్గంలో ఎక్కడా రూపాయి పని చేయలేదని ఎమ్మెల్యే లేదన్న సాకుతో ప్రజలను మభ్యపెట్టి అభివృద్ధి నిరోదకులుగా మారారని దుయ్యబట్టారు. మంగపేట మండలం లో అధికార బీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు కృత్రిమంగా సృష్టించిన ఎస్టీ నాన్ ఎస్టీ సమస్యతో మండలంలోని గిరిజనేతరులు కోర్టు తీర్పులు, ఎల్టీఆర్ నోటీసులతో సతమతమవుతున్నారని వారికి బతుకు భద్రత లేక ఇబ్బందులు పడుతున్నారని వారికి అండగా నేనుంటానని ప్రహల్లాద్ భరోసా ఇచ్చారు. సంవత్సరాల తరబడి ఇక్కడ జీవిస్తున్న గిరిజనేతరులు ఈ ప్రాంత ఎమ్మెల్యేలుగా లంబాడా గిరిజనులు ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వారికి లేవని ప్రస్తుతం ఈ సమస్యలను సృష్టంచేది ఎవరో ప్రజలు అర్థం చేసుకోవాలని ప్రహల్లాద్ అన్నారు. గిరిజనేతరుల సమస్యను తన సమస్యగా తీసుకొని వారికి అండగా ఉంటానని ములుగు ఎమ్మెల్యే బరిలో ఉన్న తనను బీజేపీ అభ్యర్థిగా గెలిపించాలని కోరారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడి బిల్ట్ కర్మాగారం పున: ప్రారంభిచడంపై, గోదావరి కోతకు గురవుతున్న ప్రాంతంలో కరకట్ట నిర్మాణం గురించి, వరదల సమయంలో ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యల పరిష్కారానికి భరోసా ఇవ్వకుండా ఊకదంపుడు హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని వారు గ్రామాల్లో ప్రచారానికి వచ్చినప్పుడు ఈ సమస్యలపై ఆయా ప్రాంతాల ప్రజలు నిలదీయాలని ప్రహల్లాద్ పిలుపునిచ్చారు. తనను నమ్మి గెలిపిస్తే అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు లోడె శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు సామ మోహన్ రెడ్డి, గాజుల కృష్ణ, ఎరంగారి విరన్ కుమార్, పగిడిపల్లి చంద్రం, బట్ట చందర్ రావు, ఆళ్ల రాణి, లింగమ్మ, ప్రశాంత్, దంతనపల్లి పురుషోత్తం, ధీ కొండ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story