ఇదేం లెక్క..! మ‌ట్టి, మొరం త‌వ్వకాల్లో అక్రమాల చిట్టా

by Shiva |
ఇదేం లెక్క..! మ‌ట్టి, మొరం త‌వ్వకాల్లో అక్రమాల చిట్టా
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో/మ‌రిపెడ: మ‌హ‌బూబాబాద్ జిల్లాలో జ‌రుగుతున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ కాంట్రాక్టు సంస్థ శ్రీ ఇన్ఫ్రా సంస్థ కొండ‌ల‌ను, చెరువుల్లో మ‌ట్టి, మొరంల‌ను కొల్లగొట్టింది. అక్రమాల‌కు మైనింగ్‌, ఇరిగేష‌న్ అధికారులు అండ‌గా నిలుస్తుండ‌టంతో స‌ద‌రు సంస్థ అడ్డగోలుగా వ్యవ‌హ‌రిస్తోంది. ఎన్‌హెచ్ వ‌ర్క్‌ను త్వరిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని ఒత్తిడి త‌మమై ఉంద‌నే నెపంతో కొంత‌మంది జిల్లా ఉన్నతాధికారులు సైతం.. ఈ అక్రమాల‌ను చూసీ చూడ‌న‌ట్లుగా వ్యవ‌హ‌రిస్తున్నట్లు స‌మాచారం. మాతో పెట్టుకోవ‌ద్దు.. మీకేం ప్రాబ్లం అంటూ స‌ద‌రు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు కొంత మంది అధికారుల‌ను సైతం బెదిరింపుల‌కు పాల్పడుతున్నట్లు స‌మాచారం. తిలాపాపం త‌లా పిడికెడు అన్నచందంగా మ‌ట్టి త‌వ్వకాల అక్రమాల వెనుక రెవెన్యూ, పంచాయ‌తీరాజ్‌, మైనింగ్‌, ఇరిగేష‌న్ అధికారుల హ‌స్తాలు ఉన్నట్లుగా ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

లెక్క తీయ‌రేం.. కొల‌త‌లు వేయ‌రేం..!

ఇరిగేష‌న్ శాఖ జారీ చేసిన అనుమ‌తులకు మించి చెరువుల్లో త‌వ్వకాలు జ‌రిగిన‌ట్లుగా ఆయా గ్రామ‌స్తుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మ‌త్స్యకారుల సంఘాల నేత‌ల‌ ఆందోళ‌న‌ల‌కు సైతం దిగారు. దిశ అక్రమాల‌ను క‌ళ్లకు క‌డుతూ సాక్ష్యాధారాల‌తో స‌హా, అధికారులిచ్చిన ప‌ర్మిష‌న్ల లెక్కలతో అధికారుల వివ‌ర‌ణ‌ల‌తో ఎప్పటిక‌ప్పుడు క‌థ‌నాలు ప్రచురిస్తూ వ‌చ్చింది. అయితే అక్రమాల గురించి చెవిటి వాడి ముందు శంఖం ఊదినా ఫ‌లితం లేద‌న్నట్లుగా ఉంది. అక్రమాల‌పై గ్రామ‌స్తుల ఫిర్యాదులు, ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నా అధికారుల‌కు ప‌ట్ట‌డం లేదు. క్షేత్రస్థాయిలో ప‌ర్యటించేందుకు అధికారుల కాళ్లు క‌ద‌ల‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అక్రమాల‌పై నిగ్గు తేల్చేందుకు అనేక గ్రామాల రైతులు, సంఘాల‌ నాయ‌కులు ఫిర్యాదులు చేసినా అధికారులు త‌వ్వకాల‌కు అనుమ‌తిచ్చిన ప్రాంతాల్లో ప‌ర్యటించ‌డం లేదు. అత్యాధునిక‌మైన సాంకేతిక అందుబాటులో ఉన్న నేప‌థ్యంలో అక్రమాల నిగ్గు తేల్చేందుకు అవ‌కాశం ఉన్నా ఉద్దేశ పూర్వక‌మైన నిర్లక్ష్యాన్ని కొన‌సాగిస్తున్నారు. కొల‌త‌లు నిర్వహించ‌కుండా అనుమ‌తుల‌కు మించి ప‌దిరెట్లు అధికంగా త‌వ్వకాలు సాగించిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కాంట్రాక్టు సంస్థకు ల‌బ్ధి చేకూర్చే విధంగా వ్యవ‌హ‌రిస్తుండ‌టం అనుమానాల‌కు తావిస్తోంది.

ప్రభుత్వానికి రాయ‌ల్టీ ఎగ‌వేత‌?

మ‌హ‌బూబాబాద్ జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ రహ‌దారి నిర్మాణంలో భాగంగా కేసముద్రం మండలంలోని కోర్ కొండపల్లి, కోమటిపల్లి, చిన్న ముప్పారం, ఆలేరు, పర్వతగిరి, మీదుగా మాధవపురం, అయ్యగారిపల్లి మోదుగుల గూడెం, డోర్నకల్ మండలంలోని తాళ్ల సంకిసా వరకు మట్టి వర్క్ నడుస్తోంది. ఆయా ప్రాంతాల్లో వివిధ ద‌శ‌ల్లో ప‌నులు కొన‌సాగుతున్నాయి. మైనింగ్‌, ఇరిగేష‌న్ శాఖ‌ల నుంచి మ‌ట్టి, గ్రావెల్ త‌వ్వకాల‌కు సుమారు ల‌క్ష యాబైవేలు పైచిలుకు క్యూబిక్ మీట‌ర్లకు అనుమ‌తులు పొందిన కాంట్రాక్టు సంస్థ ఏకంగా ప‌దిరెట్లు అధికంగా త‌వ్వకాలు సాగించిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దాదాపు కోట్ల రూపాయాల రాయ‌ల్టీని ప్రభుత్వానికి ద‌క్కకుండా కొంత‌మంది అధికారుల జేబుల్లోకి భారీగానే న‌గ‌దు చేరిన‌ట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు మ‌హ‌బూబాబాద్‌లో జ‌రుగుతున్న అక్రమ మైనింగ్‌పై దృష్టి పెడితే.. కాంట్రాక్టు సంస్థ అక్రమాలు, అధికారుల లీల‌లు వెలుగులోకి రావ‌డం ఖాయ‌మ‌ని ప్రజా సంఘాల నేత‌లు పేర్కొంటున్నాయి. అక్రమాల‌కు పాల్పడిన సంస్థపై పెనాల్టీ విధించాల‌ని ఆయా గ్రామ‌స్తులు డిమాండ్ చేస్తున్నారు.

పరిమితులు ఇవే..

మైనింగ్ నుంచి మహబూబాబాద్ మండలం మాధవపురం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 306/B/1/3లో 1.180 హెక్టార్లకు 14,000 మెట్రిక్ టన్నులు తవ్వకాలకు గాను జూన్ 7 నుంచి జులై 26 2024 పర్మిషన్ ఉంది. అలాగే అదే మాధవపురం గ్రామంలోని సర్వే నెంబర్లు 307/A/1/4,303/A/3/5,306/P 0.950 హెక్టార్లకు 15.600 మెట్రిక్ టన్నులకు గాను 29 మే నుంచి 02 జులై 2024 వరకు పర్మిషన్ కలదు. కేసముద్రం మండలం కల్వల సర్వే నెంబర్ 610/Pలో 9000 మెట్రిక్ టన్నులకు గాను పూర్తి స్థాయిలో తవ్వకాలు పూర్తయ్యాయి అంటే మొత్తంగా 38,600 మెట్రిక్ టన్నులు పని పూర్తయినట్టు మిగత కోమటిపల్లి లో సర్వే నెంబర్ 311/P లో 2.830 హెక్టార్లకు 22,500 మెట్రిక్ టన్నులకు గాను 29 జూన్ నుండి 12 ఆగష్టు 2024 వరకు అలాగే నేరడా 546/P, 548/Pలో 2.000 హెక్టార్లకు 10,000 మెట్రిక్ టన్నులకు గాను 01 జూలై నుండి 09 ఆగష్టు 2024 వరకు నరసింహుల గూడెం 172/1/Pలో 1.450 హెక్టార్లలో 20,000 మెట్రిక్ టన్నులకు గాను 15 జూలై నుంచి 28 ఆగష్టు 2024 వరకు అయ్యగారి పల్లి 231/Pలో 0.400 హెక్టార్ల 12000 మెట్రిక్ టన్నులకు గాను 19 జులై నుండి 27 ఆగస్టు 2024 వరకు వావిలాల 283/Pలో 0.390 హెక్టార్లలో 23,400 మెట్రిక్ టన్నులకు 19 జూలై నుంచి 06 సెప్టెంబర్ 2024 వరకు ఈ గ్రామాల్లో అనుమతులు ఇచ్చారు ప్రస్తుతం మట్టి వర్క్ నడుస్తుంది.

ఇరిగేషన్ నుంచి

చిన్నగూడూరు మండల కేంద్రంలోని శక్తి చెరువు 19,600 క్యూబిక్, కురవి మండలం అయ్యగారిపల్లిలోని ఎర్రకుంట నుంచి 5000 క్యూబిక్ మీటర్లు తవ్వకాలు పూర్తయినప్పటికీ అదే మండలంలోని కందికొండ గ్రామంలోని 5000 క్యూబిక్ మీటర్ల గాను నాగులకుంట నుంచి కొంతమేర మాత్రమే మట్టి తవ్వకాలు జరిగినట్టు అధికారులు చెప్పుకొస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని మాధవపురంలోని తుమ్మలకుంట, కొమ్ముల కుంటల నుంచి 5000 క్యూబిక్ మీటర్ల కు గాను పరిమితులు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.అలాగే కోమటిపల్లి పెద్ద చెరువు, ఇనుగుర్తి కేకర్లకుంట, చిన్న ముప్పారం పెద్ద చెరువు, కోమటిపల్లి ముర్ల కుంటల నుంచి 5 వేల క్యూబిక్ మీటర్ల చొప్పున చిన్న గూడూరు తుమ్మలచెరువు నుంచి 2,500 క్యూబిక్ మీటర్ల చొప్పున పర్మిషన్ల కోసం అప్లై చేసుకున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story