బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

by Sridhar Babu |
బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
X

దిశ, గార్ల : మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్​ కేకన్ మంగళవారం గార్ల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది విధులను పరిశీలించారు. మొదటగా గార్ల స్టేషన్ పరిసరాలను పూర్తిగా పరిశీలించి సిబ్బంది పరిశుభ్రతపై మరింత శ్రద్దను వహించాలని సూచించారు. వివిధ కేసులలో సీజ్ చేయబడిన వాహనాలు, ఇతర ప్రాపర్టీ ని వీలైనంత త్వరగా తొలగించి పోలీస్ స్టేషన్ ఆవరణ, పరిసరాలను ఆహ్లాదకరంగా మార్చాలని అన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్ ను, స్టేషన్ లో ఉన్న పెండింగ్ కేసుల వివరాలను, సిబ్బంది విధుల వివరాలను పరిశీలించారు.

ప్రతి ఒక్కరూ 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ విధులను నిర్వర్తించాలని సూచించారు. స్టేషన్​కు వచ్చే బాధితుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తూ న్యాయం చేకూర్చే విధంగా విధులను నిర్వర్తించాలని సూచించారు. రికార్డులను, కేసులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఎటువంటి పెండెన్సీ లేకుండా చూసుకోవాలని సూచించారు. స్టేషన్ సిబ్బంది డయల్ 100 పై ప్రత్యేక దృష్టి సారిస్తూ సంఘటన స్థలాలకు వీలైనంత త్వరగా చేరుకుని సమస్యను పరిష్కరించాలని సూచించారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాల

బారిన పడకుండా గ్రామాలను సందర్శిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అదే విధంగా సైబర్ క్రైమ్ పై ప్రత్యేక దృష్టిసారిస్తూ బాధితుల నష్ట పరిహారాన్ని త్వరగా వచ్చే విధంగా కృషి చేయాలని సూచించారు. అనంతరం స్టేషన్ సిబ్బందితో మాట్లాడి వారి విధులు గురించి అడిగి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతి రావు, గార్ల బయ్యారం సీఐ రవి, డీ.సీ.ఆర్.బీ సీఐ సత్యనారాయణ, ఎస్.ఐ జీనత్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story