కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసించండి.. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సింగారపు రమేష్

by Javid Pasha |
కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసించండి.. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సింగారపు రమేష్
X

దిశ, దేవరుప్పుల: గత తొమ్మిది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్ని తరగతుల ప్రజానీకం యొక్క ఆశల్ని నిరాశలు చేసిందని, దేశ సంపదనంతా కార్పొరేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నదని, నిరసించే ప్రజలను మతం పేరుతో చీల్చుతున్నదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జనగామ జిల్లా అధ్యక్షులు సింగారపు రమేష్ అన్నారు. ఆదివారం దేవరుప్పుల మండల కేంద్రంలో రెడ్డిరాజుల నారాయణ, బస్వ రామచంద్రo అధ్యక్షతన జరిగిన ప్రజాసంఘాల మండల స్థాయి సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తోట్లు పొడిచే తన విధానంలో భాగంగా కేటాయింపులను బడ్జెట్లో అతి ఘోరంగా తగ్గించి వేశారని, రైతులు పండించే పంటలకు మద్దతు ధరను గ్యారంటీ చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

అనేక దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను లేకుండా చేస్తున్నదని విమర్శించారు.అంబానీ ఆదానీ లాంటి వాళ్లకు లక్షల కోట్ల విలువ చేసే దేశ సంపదను కట్టబెడుతున్నారని అన్నారు. సంవత్సరంలో రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి పేద వాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తానని వాగ్దానం చేసిన ప్రభుత్వం దాన్ని మరిచిపోయిందని అన్నారు. ఈ విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కార్మిక కర్షక సంఘాలతో నిర్వహించనున్న మహాధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, ఉప్పలయ్య, ప్రణయ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story