Viral fever:జ్వరాలతో జనం బెంబేలు..ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనం

by Jakkula Mamatha |   ( Updated:2024-08-25 15:19:36.0  )
Viral fever:జ్వరాలతో జనం బెంబేలు..ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనం
X

దిశ,జనగామ:వర్షాకాలం వెన్నంటే వ్యాధుల భయం పొంచి ఉంటుంది. ఇటీవల కురిసిన వర్షాలు, పారిశుధ్య లోపంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. జనగామ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్న ఓపీ (బయటి రోగుల) సంఖ్య అందుకు నిదర్శనంగా నిలుస్తుంది. జ్వరాలు, సీజనల్ వ్యాధులు ప్రబలుతుండడంతో ఆస్పత్రుల్లో క్రమేణా ఓపీల సంఖ్య పెరుగుతోంది. అధికారులు పారిశుధ్యంపై దృష్టి సారించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

పారిశుధ్యం అంతంతమాత్రమే..

జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షాలతో పారిశుధ్యం లోపిస్తోంది. ఎక్కడికక్కడ నీరు నిల్వ ఉండటంతో దోమలు, ఈగలకు ఆవాసాలుగా మారుతున్నాయి. దోమకాటుతో వచ్చే డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్ సమస్యలతోపాటు జ్వరం, దగ్గు, న్యుమోనియా, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలతో ఆస్పత్రికి వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. జనగామ ప్రభుత్వ ఆస్పత్రి రోగులతో కిక్కిరిసిపోతోంది. వాతావరణం చల్లబడడంతో వయోవృద్ధులు తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య (రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్)లను ఎదుర్కొంటున్నారు. గ్రామాలతోపాటు పట్టణాల్లో మురుగు కాలువలు, చెత్త కుప్పల పై దోమలు వాలడంతో వ్యాధులు ఈ ఏడాది మరింత ఎక్కువయ్యాయి. పెరుగుతున్న రోగుల సంఖ్య గత నెలతో పోల్చుకుంటే ఈనెల పెరిగింది. సీజనల్ వ్యాధులపై ముందస్తు అవగాహన కల్పించడంలో మున్సిపాలిటీ, పంచాయతీ కార్యాలయాల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మున్సిపాలిటీల్లో నిత్యం ఫాగింగ్ చేయడం, దోమల నివారణ చర్యలు తీసుకోవడం తదితర చర్యలకు ఉపక్రమించాల్సి ఉంది.

ఈసారి మరింత అధికం..

ఈ ఏడాది పెరిగిన కేసుల సంఖ్య

2020 2021 2022 2023 2024

డెంగీ 06 15 34 45 60

మలేరియా 06 07 07 08 04

జాగ్రత్తలు అవసరం..

డా ఏ.స్వప్న, స్త్రీల వైద్య నిపుణురాలు వర్షాకాలంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. పరిసరాల్లో దోమలు గుడ్లు పెట్టే ప్రాంతాలు లేకుండా చూసుకోవాలి. మురుగు కాల్వల్లో ఆయిల్ బాల్స్ వేయడం, చిన్నచిన్న పాత్రలు, పాత టైర్లు, కొబ్బరి బొండాల్లో నీరు నిల్వకుండా చూడాలి. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. సాధ్యమైనంత వరకు కాచి చల్లార్చి వడబోసిన నీటినే తాగాలి. చల్లని, ఈగలు వాలిన పదార్థాల జోలికి వెళ్లకూడదు. మూడు రోజులకు మించి జ్వరం ఉంటే వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలి. రక్త కణాలు తక్కువగా ఉంటే ఆస్పత్రిలో చేరాలి. లేదంటే మందులకు లొంగని (డ్రగ్ రెసిస్టెంట్) మలేరియా వచ్చే ప్రమాదం ఉంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.

చర్యలు తీసుకుంటున్నాం..

జిల్లా వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకుంటున్నాం. వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీజనల్ వ్యాధుల మందులు అందుబాటులో ఉంచాం. మున్సిపాలిటీలు, పంచాయితీల్లో నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో మందు స్ప్రే చేసి దోమల నివారణకు సిబ్బంది కృషి చేస్తున్నారు. పరిశుభ్రతపై అవగాహన కల్పించి వచ్చే వ్యాధులను నివారిస్తున్నాం. వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటు తగిన చర్యలు తీసుకున్నారు. - డాక్టర్ రవీంద్రగౌడ్, జిల్లా వైద్య అధికారి ఇన్చార్జి డీఎంహెచ్ఓ

జాగ్రత్తలు తీసుకుంటున్నాం..

జనగామ మున్సిపల్ పరిధిలో రోగాలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. దోమల బెడద పై ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యాంటీ లార్వా, బ్లీచింగ్ పౌడర్ ఫాగింగ్ చేయిస్తున్నాం. ఎక్కడ డెంగ్యూ కేసులు వచ్చాయో అక్కడ తిరిగి ఫాగింగ్ చేయిస్తున్నాం.

Advertisement

Next Story

Most Viewed