దర్జాగా ఇసుక అక్రమ రవాణా.. చోద్యం చూస్తున్న అధికారులు

by Aamani |
దర్జాగా ఇసుక అక్రమ రవాణా.. చోద్యం చూస్తున్న అధికారులు
X

దిశ, మల్హర్: మండలంలోని మల్లారం అటవీ ప్రాంతం మానేరు నది నుండి దర్జాగా ఇసుక అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. దట్టమైన అడవిలో అక్రమ రవాణా మార్గం ఏర్పాటు చేసుకొని దర్జాగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న అధికారులు చోద్యంపై పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. మల్లారం నుంచి కొయ్యూర్ వెళ్లే ప్రధాన రహదారి ప్రక్క నుంచి అటవీ లోకి వెళ్లేందుకు రోడ్డును జేసీబీ సాయంతో చదును చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ట్రాక్టర్ల రవాణా కోసం అక్రమంగా అడవిలో రోడ్డు ఏర్పాటు చేసి గుట్టుచప్పుడు కాకుండా ఇసుక అక్రమ రవాణా కోసం మానేరు వద్దకు ట్రాక్టర్ వెళ్లేందుకు అటవీ మార్గంలో అక్కడక్కడ చెట్లను తొలగించి రోడ్డును చదును చేశారు. ప్రధాన రహదారికి కూతవేటు దూరంలోనే అటవీలో ఇసుకను నిల్వ చేసేందుకు స్థలాన్ని ట్రాక్టర్ల సాయంతో చిన్న చితక చెట్లను తొలగించి చదును చేశారు.

మానేరు నది నుంచి రాత్రి సమయంలో ఇసుకను తరలించి కుప్పలుగా పోసి నిలువచేసిన ఇసుకను జేసీబీ సాయంతో లారీలల్లో లోడ్ చేసి పంపిస్తున్నారు. ఈ దందా గత ఐదు రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తూ కాసులు కురిపించుకుంటున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ఇసుక లారీలను తరలించినట్లు సమాచారం. హైదరాబాద్ పట్టణంలో భవనాల కట్టడాలకు ఉన్న ఇసుక డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని కొంత మంది అక్రమ రవాణాకు పాల్పడి ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్నట్లు తెలిసింది. మల్లారం టీజీ ఎమ్ డి సి ఇసుక క్వారీ నుంచి లారీలు ఇసుక తరలిస్తున్న నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణాకు ఎలాంటి అడ్డంకులు ఉండవు అనే కోణంతో అక్రమార్కులు అక్రమంగా తరలించే ఇసుక లారీలు క్వారీ నుంచి తరలించే ఇసుక లారీలతో కలిసి పోతాయని అక్రమార్కులు అక్రమ తెర లేపారు.

అక్రమంగా తరలించే ఒక్కో లారీకి రూ 50 వేల పైచిలుకు అక్రమ సంపాదనకు తెగబడ్డారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా అటవిలో అక్రమ రవాణా ఏర్పాటు చేసి ఇసుక తరలిస్తున్న ఏమి పట్టకుండా వ్యవహరిస్తున్న అధికారులపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయం పై కొయ్యూరు ఫారెస్ట్ రేంజర్ గండ్ర రాజేశ్వరరావు ను వివరణ కోరగా విషయం తమ దృష్టికి వచ్చిందని, నిఘా వేసినట్లు తెలుపుతూ ఇసుక తరలించిన, అటవీలో అక్రమంగా రోడ్డు చేసిన ప్రాంతాన్ని పరిశీలించినట్లు రేంజర్ తెలిపారు. అటవీలో ఇలాంటి కార్యకలాపాలు చేపడితే చట్టరీత్యా చర్యలు చేపడతామని, ఎంతటి వారైనా సరే అటవీ చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ ఈ ఘటనపై విచారణ చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story