- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మాస్టర్ ప్లాన్‌కు ఆమోద ముద్ర..
దిశ, వరంగల్ బ్యూరో : వరంగల్ మాస్టర్ ప్లాన్-2041కి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వరంగల్ కొత్త మాస్టర్ ప్లాన్‌ను ఆమోదిస్తూ జీవో 202 జారీ చేసింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉంటున్న కుడా మాస్టర్ ప్లాన్‌కు ఎట్టకేలకు ఆమోద ముద్ర పడింది. ముసాయిదా మాస్టర్ ప్లాన్ పై 2018లో వరంగల్ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) అభ్యంతరాలు స్వీకరించింది. భూ వినియోగ, ఇతర జోన్ల పై సోమవారం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయనుంది. గ్రేటర్ వరంగల్‌తో పాటు 19 మండలాల పరిధిలోని 181 గ్రామాలు కుడా పరిధిలోకి రానున్నాయి. మొత్తంగా 1805 చదరపు కిలోమీటర్ల మేర విస్తరింపుతో నూతన మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం లభించింది. గత ఐదేళ్లుగా నానుతున్న విజన్-2041 వరంగల్ నూతన బృహత్ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్)కు ఎట్టకేలకు రేవంత్ సర్కార్‌లో మోక్షం లభించింది. ఈ నెల 19న సీఎం రేవంత్‌రెడ్డి మాస్టర్ ప్లాన్ పై అధికారిక ప్రకటన చేస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేస్తుందని సమాచారం. ఇప్పటి వరకు వరంగల్ మహానగరానికి మాస్టర్ ప్లాన్ లేదు. గత రెండు, మూడేళ్లుగా కేవలం మెమో ఆధారంగా లే అవుట్లు, భవన నిర్మాణ అనుమతులను గ్రేటర్ వరంగల్, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ జారీ చేస్తోంది.
ఇక పై పక్కా ప్లానింగ్...
2021లో రూపొందించిన తుది ప్లాన్‌కు కొన్ని మార్పులను చేర్పులను చేసి 2041 మాస్టర్ ప్లాన్‌ను తయారు చేశారు. 2041 వరకు ఈ ప్లాన్ అమలులో ఉంటుంది. ఆ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా ఆయా జిల్లాల్లో పరిశ్రమలు, గృహ నిర్మాణాలకు అనుమతులు ఇస్తారు. రహదారులు నిర్మిస్తారు. ఎవరి భూములకైనా మాస్టర్ ప్లాన్ ప్రకారమే అనుమతులు ఇవాల్సి ఉంటుంది. దానిని ఉల్లంఘించడానికి వీల్లేదు. భవిష్యత్తులో జనాభా పెరుగుదల ఉంటుందని అధికారులు అంచనా వేస్తూ మాస్టర్ ప్లాన్‌కు రూపకల్పన చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల వినియోగం, వివిధ ప్రాంతాల్లో మౌలిక వసతులు, రైలు, రోడ్ నెట్‌వర్క్, రహదారుల విస్తరణ, నీటి వనరుల పరిరక్షణ, సద్వినియోగం తదితర అంశాలను స్పష్టం చేయబడ్డాయి. ఇండస్ట్రియల్ కారిడార్, విద్యారంగం, పర్యాటక, వ్యవసాయా చారిత పరిశ్రమలు తదితర రంగాలకు స్థలాలను గుర్తించారు.
అనుమతులకు మార్గం సుగమం..
కొత్త మాస్టర్‌ప్లాన్ ఆమోదం పొందిన నేపథ్యంలో వరంగల్ నగరంలో పెద్ద ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చేందుకు మార్గం సుగమమైందనే చెప్పాలి. కొత్త మాస్టర్ ప్లాన్‌లో 13 భూ వినియోగ జోన్లు ఉంటాయి. ఈ మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందిన నేపథ్యంలో నగరాల్లో భవన నిర్మాణాలకు అడ్డంకులు తప్పనున్నాయి. దాంతో పాటుగా నగరం చుట్టూ రీజనల్, ఔటర్, ఇన్నర్, కనెక్టెడ్ రోడ్ల నిర్మాణం జరుగనుంది. చెరువులు, నాలాల పునరుద్ధరణ వేగవంతం చేస్తారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పడుతుంది. దీంతో వరంగల్ నగరంతో పాటుగా చుట్టూ ఉన్న 19 మండలాలు, 181 గ్రామాలకు మహర్దశ పట్టనుంది. గణనీయమైన అభివృద్ధి చోటు చేసుకుంటుంది. భూముల ధరలకు రెక్కలు రానున్నాయి.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి..!
2019లో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అప్పటి మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో గ్రేటర్ వరంగల్, జిల్లా ప్రజాప్రతినిధులతో మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్‌పై సమీక్ష చేశారు. కొద్దిరోజులకు ముసాయిదా పై సంతకం కూడా చేశారు. ఇక మాస్టర్ ప్లాన్ అమల్లోకి వచ్చేసినట్లేనని నాటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు కేటీఆర్, కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు సైతం నిర్వహించారు. మాస్టర్‌ప్లాన్ ఫైల్ పై సీఎం సంతకం చేయడం, గెజిట్ విడుదల చేయడమే తరువాయి అనుకున్నారంతా. అయితే వాస్తవంలో మాత్రం అదేమీ జరగలేదు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దనే ఫైల్ పెండింగ్ ఉండిపోయింది. అయితే తాజాగా మాస్టర్ ప్లాన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది.
మూడు నెలల క్రితం జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మీటింగ్‌లో కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రక్రియంతా కూడా పూర్తి కావడంతో తుది ఫైల్ సీఎం ఆమోదానికి ఆయన టేబుల్ మీదకు చేరుకుంది. ఈనేపథ్యంలో పూర్తి అధ్యయనం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా కొత్త మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం తెలిపారు. కుడా మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం జరిగేందుకు చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, అధికారులు విశేషంగా కృషి చేశారు. కుడా మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం లభించిన నేపథ్యంలో పలు కీలక ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం తెరమీదకు తీసుకు వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.