Ukraine : రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులు ప్రయోగించొచ్చు.. ఉక్రెయిన్‌కు అనుమతిచ్చిన అమెరికా!

by vinod kumar |
Ukraine : రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులు ప్రయోగించొచ్చు.. ఉక్రెయిన్‌కు అనుమతిచ్చిన అమెరికా!
X

దిశ, నేషనల్ బ్యూరో: సుమారు 33 నెలలుగా రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukrein) యుద్ధం భీకరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వార్ ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా(America) ఉక్రెయిన్‌కు మద్దతివ్వడంతో పాటు భారీగా ఆయుధాలను(Weapons) అందిస్తోంది. కానీ యూఎస్ సరఫరా చేసే ఆయుధాలపై పలు ఆంక్షలు విధించింది. తాము సరఫరా చేసిన వెపన్స్‌ను కేవలం ఉక్రెయిన్‌లోనే ఉపయోగించాలని, రష్యా దాడులను అడ్డుకునేందుకు మాత్రమే వాటిని వినియోగించాలని నిబంధనలు ఉన్నాయి. అంతేగాక సుధీర్ఘ శ్రేణి క్షిపణులను ప్రయోగించేందుకు సైతం అనుమతివ్వలేదు. అయితే తాజాగా యూఎస్ అధ్యక్షుడు బైడెన్ (Byden) కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా భూభాగంపై దీర్ఘ శ్రేణి క్షిపణులను(Long range missiles) ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు అనుమతిచ్చినట్టు తెలుస్తోంది. గతంలో విధించిన ఆంక్షలను ఎత్తివేసినట్టు పలు కథనాలు వెల్లడించాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికా సరఫరా చేసిన క్షిపణులను ఉపయోగించేందుకు ఉక్రెయిన్‌ను అనుమతించడం ఇదే తొలిసారి. బైడెన్ నిర్ణయంతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పూర్తిగా మారిపోతుందని పలువురు భావిస్తున్నారు.

రష్యా సైనిక లక్ష్యాలను ఛేదించడానికి ఉక్రెయిన్ మిలిటరీకి యూఎస్ ఆయుధాలను ఉపయోగించేందుకు పర్మిషన్ ఇవ్వాలని, లాంగ్ రేంజ్ క్షిపణులను సైతం ప్రయోగించేందుకు అనుమతించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) పశ్చిమ దేశాలను కొంత కాలంగా విజ్ఞప్తి చేస్తున్నారు. దీర్ఘ శ్రేణి క్షిపణులపై బ్యాన్ ఉండటం వల్ల రష్యా దాడులను అడ్డుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే బైడెన్ నిషేధం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ డిసిషన్‌తో ఉక్రెయిన్‌కు మంచి అవకాశం దొరికినట్టు అయింది. దీంతో త్వరలోనే 306 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉన్న రాకెట్‌లను ఉపయోగించి రష్యాపై దాడి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా, బైడెన్ పదవీ కాలం కేవలం రెండు నెలలు మాత్రమే ఉంది. ఆ తర్వాత ఇటీవల ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే యూఎస్ తీసుకున్న తాజా నిర్ణయాన్ని ఆయన కొనసాగిస్తారా లేదా వెనక్కి తీసుకుంటారా అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు బైడెన్ డిసిషన్‌తో యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని, యుద్ధం రూపురేఖలే మారిపోనున్నాయని యూఎస్ సీనియర్ అధికారులు చెబుతున్నారు.

Advertisement

Next Story