రైతు.. బ్యాంక్.. మధ్యలో దళారీలు

by Nagam Mallesh |
రైతు.. బ్యాంక్.. మధ్యలో దళారీలు
X

దిశ, కేసముద్రం : రైతులకు అందాల్సిన బ్యాంకు రుణాలపై దళారులు మోపయ్యారు. అడ్డదారుల్లో రైతుల రుణాలను అక్రమంగా దోచేయడానికి కాచుకు కూర్చున్నారు. రైతులకు అండగా నిలవాల్సిన బ్యాంకు అధికారులు కూడా దళారులకే వత్తాసు పలుకుతున్నారు. జిల్లాలోని ఈ ఒక్క మండలంలోనే ఈ తతంగం జరగడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. మహబూబాద్ జిల్లా కేసముద్రం మండల పరిధిలోని రైతుల నుంచి నయా దోపిడీ షురూ అయ్యింది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు రుణమాఫీ చేయగా.. వివిధ బ్యాంకులు.. అన్నదాతలకు కొత్త రుణాలను అందిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన దళారులు.. రైతుల లోన్ల దోపిడికి ఎత్తుగడ వేశారు. బ్యాంకులో రైతులు రుణాలు పొందాలంటే పలు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. పట్టా పాస్ బుక్, పహాని, వన్ బీ, ఆధార్, బ్యాంక్ అకౌంట్ మొదలు ఇతరత్రా పత్రాలను బ్యాంకులో అధికారులకు సమర్పించాలి.

వాటిని వెరిఫై చేసి రైతులకు లోన్లు ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులది. కానీ.. రైతులు ఈ పత్రాలు అన్ని సమర్పించినా... లోన్లు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. పత్రాలు సరిగ్గా లేవనే కారణాలను చూపుతూ.. అప్లికేషన్స్ రిజెక్ట్ చేస్తున్నారు. అదే దళారుల నుంచి పత్రాలు వెళ్తే మాత్రం బ్యాంకు అధికారులు లోన్లు మంజూరు చేస్తున్నారు. దీంతో.. రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ఒక్కో రైతు నుంచి రూ.15 నుంచి మొదలు..20వేల వరకు వసూళ్లు చేస్తున్నారని సమాచారం. ఈ కమిషన్‌లో దళారులకు, బ్యాంకు అధికారులకు పాలు ఉందని ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అందుకే దళారుల రూపానా వచ్చిన అప్లికేషన్స్‌నే బ్యాంకు అధికారులు అప్రూవల్ చేస్తున్నారు. ఈ వ్యవహరం కేసముద్రం పరిధిలోని అన్ని బ్యాంకుల్లో కొనసాగుతుందని తెలుస్తోంది. రైతులు బయటికి చెప్పలేక.. అటు బ్యాంకు అధికారులను ప్రశ్నించలేక.. వచ్చిందే చాలు అనుకొని కమిషన్లు అప్పజెప్తూ.. లోన్లు పొందుతున్నారు. ఇచ్చిన కమిషన్ లో బ్యాంక్ వారి వాటా ఎంత, దళారుల వాటా ఎంత అనే చర్చ మండల కేంద్రం లో తీవ్రంగా ఉంటుంది. పై అధికారులకు విషయం తెలిసిందా లేక తెలియదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు.. అన్నదాతలు ఈ కమిషన్ల దోపిడికి లబోదిబో మంటున్నారు. వచ్చే లోన్లో.. ఇలా కమిషన్లు దోపిడి చేయడం అన్యాయమని మండిపడుతున్నారు. రూ. 20వేలు నిర్ధాక్షిణ్యంగా కోల్పోవడమంటే.. దారుణం అంటున్నారు. ఆ నగదు.. కనీసం ఎరువులకు, కూలీల ఖర్చులకు వెళ్తాయని కానీ.. ఇలా దోపిడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే పై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు ప్రభుత్వము అని చెప్పుకొనే వారు మరి రైతులను ఎలా కాపడుతారో... మరియు అధికారులు స్పందించి చర్యలు చేపడతారా లేదా వేచి చూడాల్సిందే మరి.

Advertisement

Next Story

Most Viewed