RG Kar Hospital Case: టీఎంసీ యువనేతను గంటలపాటు ప్రశ్నించిన అధికారులు

by Shamantha N |
RG Kar Hospital Case: టీఎంసీ యువనేతను గంటలపాటు ప్రశ్నించిన అధికారులు
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్ కతా డాక్టర్‌ హత్యాచారం కేసులో టీఎంసీ యువనేత ఆశిష్ పాండేని సీబీఐ అధికారులు విచారించారు. ఆర్జీకర్ మెడికల్ కాలేజీ సిబ్బందిగా ఉన్న ఆశిష్ పాండేని గురువారం అర్ధరాత్రి వరకు అధికారులు ప్రశ్నించారు. సీబీఐ సీజీఓ కాంప్లెక్స్ కార్యాలయంలో కొన్ని గంటలపాటు ప్రశ్నించారని.. ఆశిష్ పాండే వెల్లడించారు. "పలువురు వ్యక్తుల కాల్ లిస్టుల్లో పాండే ఫోన్ నంబర్ ని గుర్తించాం. ట్రైనీ డాక్టర్ మృతదేహం లభ్యమైన రోజు పాండే సాల్ట్ లేక్‌లోని ఒక హోటల్‌లో తన స్నేహితురాలితో కలిసి చెక్ ఇన్ చేశాడు. ట్రైనీ డాక్టర్ హత్య జరిగిన రోజు అతని కార్యకలాపాలను నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నాము." అని సీబీఐ అధికారి తెలిపారు. కాగా.. పాండే బుకింగ్‌లు, చెల్లింపుల వివరాల కోసం హోటల్ అధికారులను కూడా సీబీఐ ప్రశ్నించింది. హోటల్ గదిని పాండే యాప్ ద్వారా బుక్ చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. ఆగస్ట్ 9 మధ్యాహ్నం చెక్ ఇన్ చేసి మరుసటి రోజు ఉదయమే వెళ్లిపోయాడని గుర్తించారు. అతను అక్కడ బస చేయడానికి ఉన్న ఉద్దేశం ఏంటో తెల్సుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు.

హత్యాచారానికి నిరసనగా ఆందోళనలు

ఇకపోతే, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వైద్యురాలిపై హత్యాచారానికి నిరసనగా వారంతా 41 రోజులుగా విధులను బహిష్కరిస్తూ డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. కాగా..తమ డిమాండ్లలో అధిక శాతానికి పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం ఆమోదం తెలపడంతో శనివారం నుంచి పాక్షికంగా విధులకు హాజరుకావాలని జూనియర్‌ వైద్యులు నిర్ణయించారు.

Advertisement

Next Story

Most Viewed