- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిండుకుండలా ప్రాజెక్టు.. ఎండుతున్న పంటలు! మరమ్మతులకు నోచుకోని బొగ్గులవాగు మధ్యతరహా ప్రాజెక్టు
దిశ, మల్హర్: సమృద్ధిగా వర్షాలు పడి చెరువులు, కుంటలు నిండు కుండలా మారాయి. చెరువులు, ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరి మత్తళ్లు దుమికాయి. ‘చెరువు నిండా నీరే సాకిరేవు పనికిరావు’ అనే చందంగా మల్హర్ మండలంలో పరిస్థితి. మండలంలోని ఎడ్లపల్లి అటవీ పరిధిలో నిర్మించిన బొగ్గుల ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. కానీ ప్రాజెక్టు కింద ఆయకట్టు మాత్రం సాగునీరు అందక చివరి వరి పొలాలు ఎండిపోతుండడంతో అన్నదాతలు గుండెలు బాదుకుంటున్నారు. మండలంలోని వల్లెంకుంట, కొయ్యుర్, కొండంపేట గ్రామాలకు చెందిన రైతుల చివరి ఆయకట్టు పంట పొలాలకు సాగునీరు అందించే కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. శభాష్ నగర్ ఆయకట్టు రైతులకు కూడా సాగునీరు సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు రైతులు వాపోయారు. కాలువల్లో పూడిక నిండిపోయి, చెట్లు మొలిచి దెబ్బ తినడంతో ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీరు కాలువ ద్వారా పారకం సాగడం లేదు. దీంతో ఆయకట్టు పొలాలకు సాగునీరు అందక వర్షాకాలంలో కూడా పంట పొలాలు ఎండిపోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వల్లెంకుంట గ్రామానికి చెందిన పసుల పోశయ్య, గడ్డం రమేష్, చిన్న మల్లయ్య తో పాటు పలువురు రైతులు వాపోతున్నారు. నెర్రలు బారి ఎండిపోయిన వరి పొలాలను చూసిన అన్నదాతలు తల్లడిల్లిపోతున్నారు. ఇరిగేషన్ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఆరుగాలం శ్రమించి వేసిన వరి పంటకు నీటి తడి ఇచ్చేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు.
ఏళ్లుగా మరమ్మతుకు నోచుకోని వైనం..
బొగ్గులవాగు ప్రాజెక్టు నిర్మించి దాదాపుగా 48 సంవత్సరాలు అవుతున్నా మరమ్మతుకు నోచుకోవడం లేదు. కాలువలు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ఆశించిన ప్రయోజనం కలగడం లేదు. శిథిలావస్థకు చేరిన కాలువలను పురద్ధరించకపోవడం అధికారుల అలసత్వానికి అద్దం పడుతోంది. కాలువల నిర్వహణ లేక అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతీయేడు చివరి ఆయకట్టుకు నీరందక పంటలు ఎండిపోతున్నాయి. ప్రాజెక్టు కింద దాదాపుగా 5 వేల పైచిలుకు ఎకరాల ఆయకట్టుకు సాగవుతోంది. కాలువలకు మరమ్మతులు లేక ప్రస్తుతం 2 వేల పైచిలుకు ఎకరాలకు కూడా సరిగా నీరందడంలేదని పలువురు రైతులు వాపోతున్నారు. కొన్ని చోట్ల భారీ వర్షాలకు కోతకు గురై గండ్లు పడ్డ కాల్వలను రైతులు సొంత ఖర్చులతో బాగు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పెద్ద కాలువల నుంచి పిల్ల కాలువల వరకు సాగు నీరందించాల్సిన అధికారులు చేతులెత్తేశారు. దీంతో అధికారుల పర్యవేక్షణ లేక ప్రధాన, పిల్ల కాల్వలు కనుమరుగయ్యాయి. ఎక్కడి వారు అక్కడే కబ్జా చేశారు. దీంతో చివరి ఆకట్టు వరకు నీరందంక పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
డిస్ట్రిబ్యూటర్ల నిర్లక్ష్యం.. రైతుల పాలిట శాపం..
ప్రాజెక్టు నుంచి నీటిని ఆయకట్టు చేర్చడంలో పంపిణీ వ్యవస్థ డిస్ట్రిబ్యూటరిది ముఖ్యపాత్ర. చివరి ఆయకట్టు వరకు నీరందించాల్సిన ఈ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. వారి నిర్లక్ష్యంతో చివరి ఆయకట్టు రైతులకు నీరందండం లేదు. 1976 లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో నిర్మించిన మధ్యతర ప్రాజెక్టు బొగ్గుల వాగు డీ1, 2, 3 ప్రధాన కాల్వలు, మోరీలు అక్కడక్కడ శిథిలావస్థకు చేరాయి. నిర్మించిన సీసీ కాల్వలు పగలడంతో నిండిన పూడికతో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదు. ధ్వంసమైన ప్రాజెక్టు ప్రధాన, పిల్ల కాల్వలు, తూము మరమ్మతు చేయడానికి మంజూరు ప్రక్రియ లేకుండానే అత్యవసర పనులను పూర్తి చేయించాలనేది ఈ విభాగం ముఖ్య ఉద్దేశం. డీఈఈ స్థాయిలో రూ.2 లక్షలు, ఈఈ స్థాయిలో రూ.5 లక్షలు, ఎస్ఈ స్థాయిలో రూ.25 లక్షల వరకు ప్రభుత్వ మంజూరుతో సంబంధం లేకుండానే ఖర్చు చేయవచ్చు. కానీ గతంలో చేసిన ఖర్చుల నిధులు మంజూరు కాలేదనే షాక్ తో అధికారులు చేతులెత్తేసి ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.
కాలువలు ఇలా.. సాగునీరు పారేదెలా?
ప్రాజెక్టు కాలువలు మరమ్మతు చేయడం లేదు. ఆయాకట్టుకు పూర్తిగా నీరందడం లేదు. వర్షాలు బాగా పడ్డాయి. ప్రాజెక్టు నిండింది. రెండు పంటలు పండుతాయని అనుకున్నాం. కానీ ఒక్క పంటకే నీరందని పరిస్థితి. వరి పొలాలు ఎండిపోతున్నాయి. సన్న చిన్న కారు రైతులు చెరువు నీరు పైనే ఆధారపడ్డాం. కాల్వలు ఇలా ఉంటే మాకు సాగునీరు పారకం ఎలా.? అధికారులు స్పందించి కాలువలు బాగు చేసి ఆదుకోవాలి.
–రైతు గడ్డం రాజయ్య, వల్లెంకుంట గ్రామం