BREAKING : అస్సాం బొగ్గు గనిలో 9 మంది కార్మికులు జలసమాధి?

by Sathputhe Rajesh |   ( Updated:2025-01-06 18:31:48.0  )
BREAKING : అస్సాం బొగ్గు గనిలో 9 మంది కార్మికులు జలసమాధి?
X

దిశ, నేషనల్ బ్యూరో : బొగ్గు గనిలో 9 మంది కార్మికులు జలసమాధి కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన అస్సాం డిమా హసావ్ హిల్ జిల్లాలోని ఉమ్రాన్‌గ్సో ప్రాంతంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. 300 ఫీట్ల లోతున్న మైనింగ్ ఏరియాలో 100 ఫీట్ల వరకు నీరు ప్రవేశించినట్లు తెలుస్తోంది. అయితే వరదల్లో మైనర్లు సైతం ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. మారుమూల ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదం వద్దకు జిల్లా కేంద్రం నుంచి చేరుకోవడానికి ఏడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ సిమంతా దాస్ స్పందించారు. ‘ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం నాలుగు నుంచి ఆరుగురు కార్మికులు కోల్‌మైన్ లోపల వరదల్లో చిక్కుకున్నారు. వరదలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అస్సాం బొగ్గు గనుల శాఖ పరిస్థితిని సమీక్షిస్తోంది. రెస్క్యూ ఆపరేషన్‌ను సమీక్షించడానికి ఒక అధికారిని పంపాలని ఉన్నతాధికారులను కోరాం. ఎస్‌డీఆర్ఎఫ్ రెస్క్యూ ఆపరేషన్‌‌లో నిమగ్నమై ఉంది. అవసరమైతే ఎన్‌డీఆర్ఎఫ్ సహాయాన్ని కోరతాం.’ అని కలెక్టర్ అన్నారు.

వారంతా క్షేమంగా రావాలని ప్రార్థిస్తున్నా.. : సీఎం హిమంత బిశ్వ శర్మ

గనిలో కార్మికులు చిక్కుకున్న ఘటనపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘కార్మికులు బొగ్గు గనిలో చిక్కుకున్న ఘటన ఘటన దిగ్భ్రాంతిని గురి చేసింది. డీసీ, ఎస్పీ, నా సహచరుడు కౌశిక్ రాయ్(అస్సాం మంత్రి) వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గనిలో చిక్కుకున్న వారంతా క్షేమంగా తిరిగి రావాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా..’ అని సీఎం పోస్ట్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌కు సహకరించాలని ఆర్మీని కోరామన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఘటనా స్థలానికి బయలుదేరినట్లు సీఎం తెలిపారు. గనిలో చిక్కుకున్న 9 మంది కార్మికుల వివరాలను సీఎం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed