NDA: కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. మైనింగ్ లీజులు రద్దు?

by Ramesh Goud |
NDA: కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. మైనింగ్ లీజులు రద్దు?
X

దిశ ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో పలు ప్రముఖ సిమెంట్ కంపెనీల మైనింగ్ లీజులు రద్దు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. మై హోం గ్రూపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. రాష్ట్రంలో సిమెంట్ రాయి నిక్షేపాలున్న పల్నాడు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పలు ప్రముఖ సిమెంట్ కంపెనీలు వేల ఎకరాల భూములను సేకరించాయి. రైతుల వద్ద నుంచి కూడా భూములు సేకరించాయి. కొన్ని కంపెనీలు ఫ్యాక్టరీలు నిర్మించగా మరికొన్ని మాత్రం లీజులు పొంది ఫ్యాక్టరీలు కట్టకుండా కాలక్షేపం చేస్తున్నాయి. అలాంటి వాటిలో మై హోం గ్రూప్ కూడా ఉంది.

వైసీపీ హయాంలో లెక్కలేనితనం..

మై హోం గ్రూప్ పల్నాడు జిల్లాలోని గామాలపాడు, అనంతపురం, మరికొన్ని ఇతర ప్రాంతాలలో ఫ్యాక్టరీలు నిర్మిస్తామని భూములు సేకరించి ఇప్పటివరకు కట్టలేదు. ఈ గ్రూప్ తెలంగాణాలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఓ ప్రముఖ టీవీ చానల్ ను కొనుగోలు చేసి వైసీపీకి బాకా ఊదింది. చంద్ర బాబు, లోకేష్ లపై వ్యక్తిత్వ హననానికి పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్‌ను పొగుడుకోండి.. మమ్మల్ని టార్గెట్ చేసి కించపరచవద్దని టీడీపీ నేతలు పలుమార్లు ఛానల్ అధినేతలను కోరినా లెక్కచేయలేదు.

ప్రాధేయపడినా పట్టించుకోని సీఎం?

గతేడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. జగన్ పాలనలో తమను ఇబ్బంది పెట్టిన వారిపై దృష్టి సారించడంతో మై హోం గ్రూప్ అధినేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రసన్నం చేసుకునే పనిలో పడినట్లు తెలిసింది. వారు ఎన్ని వివరణలు ఇచ్చినా చంద్రబాబు తన మనసులో మాట చెప్పకుండా దాటవేశారని అధికార వర్గాల సమాచారం. మై హోం గ్రూప్ లీజులను ఇప్పటికే రద్దు చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది.

మై హోం నిర్వాకం ఇతర కంపెనీలకు శాపం..

భూములు తీసుకొని ఫ్యాక్టరీలు కట్టని సంస్థల లీజులు రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని సంస్థలకు చెందిన భూముల వివరాలు, మైనింగ్ లీజుల వివరాలను ప్రభుత్వ పెద్దలు తెప్పించుకొని సమీక్షించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా పల్నాడు జిల్లాలో 2013 భూసేకరణ చట్టానికి ముందే మై హోం, అంబుజా, సంఘీ, ఇమామి, సరస్వతి, రాజపుష్ప, మరికొన్ని సంస్థలు భూసేకరణ జరిపాయి. మై హోం గ్రూప్ దెబ్బకు లీజులు పొందిన అన్ని సిమెంట్ కంపెనీల్లో లీజు రద్దు భయం ఏర్పడింది.

Advertisement

Next Story

Most Viewed