- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆక్రమణలకు అడ్డుకట్ట పడేనా..? చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలం!
దిశప్రతినిధి, నిజామాబాద్: ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేయడమే పనిగా పెట్టకున్నారు. చెరువులు, వాగులు, శిఖం, ప్రభుత్వ భూములే కాకుండా నాలాలు సైతం యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. మురుగు నీరు పారే కాలువలు, వరద నీరు పారే వాగులు కావేవీ కబ్జాలకు అనర్హమని కబ్జారాయుళ్లు అంటున్నారు. నగరంలో నాలాలు, వాగులను చెరబట్టి కబ్జాలు చేస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు. కళ్లముందే కబ్జా బాగోతం కనిపిస్తున్నా యంత్రాంగానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత ప్రభుత్వ శాఖలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు వస్తే తప్ప స్పందించకూడదని ఆలోచనతో ఉన్న కొంతమంది అధికారుల ఉదాసీనత కారణంగా విలువైన భూములు కబ్జాలకు గురవుతున్నాయి. ప్రకృతి విపత్తులకు కూడా కారణం అయ్యే అవకాశాలను కల్పిస్తున్నాయి. నగరానికి దూరంగా రహస్య ప్రదేశంలో కబ్జాలు జరుగుతున్నాయని అధికారుల దృష్టికి రాలేదేమో అనుకునే అవకాశముంది. కానీ, కబ్జాలను బహిరంగంగానే జరుగుతున్నా, కళ్లకు కట్టినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా పట్టించుకోకపోవడం వెనుక ఏదైనా మతలబు ఉందేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇరిగేషన్ కు సంబంధించిన భూముల వివరాలు అడిగితే కూడా అధికారుల ఇవ్వకుండా దాటవేస్తున్నారు. ఏదో కారణాలు చెప్పి వివరాలివ్వకుండా తప్పించుకోవడమే తప్ప ఎలాంటి సమాచారాన్ని ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. తమ శాఖకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చేందుకు ఇంతలా ఎందుకు సంకోచిస్తున్నారో, ఎందుకు తప్పించుకునే ధోరణితో వ్యవహరిస్తున్నారో అర్థం కాని పరిస్థితులున్నాయి. కబ్జాలపై వివరణ కోరితే.. తమ దృష్టికి రాలేదని, ఒక వేళ ఎవరైనా కంప్లయింట్ చేస్తే తప్పకుండా స్పందిస్తామని చెప్పి చేతులు దులుపుకోవడం ఇరిగేషన్ శాఖకు అలవాటుగా మారిందనే విమర్శలున్నాయి. అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా కబ్జారాయుళ్ల ఆటలు సాగుతున్నాయనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
పులాంగ్ వాగు పొడవునా కబ్జాలే.. బోర్గాం వాగుపై కూడా..
నగరంలోని ప్రధానమైన ఫులాంగ్ వాగుతో పాటు, బోర్గాం వాగు పొడవునా అనేక కబ్జాలు జరిగాయి. కొందరు వాగుల భూములను కబ్జాచేసి తాము కబ్జాచేసిన ప్రాంతమంతా అడ్డుగోడలు కట్టుకోగా, మరి కొందరు పక్కా నిర్మాణాలు జరుపుకున్నారు. ఎంతో వెడల్పుగా ఉన్న ఫులాంగ్ వాగు కబ్జాల కారణంగా చాలా చోట్ల పిల్లవాగులాగా మారింది. మరి కొన్ని చోట్ల మరింతగా కుచించుకు పోయింది. బోర్గాం వాగు పొడవునా కూడా కబ్జాలు కొనసాగుతున్నాయి. స్థానికులను అవి పట్టా భూములుగా నమ్మించి చేస్తున్న భూకబ్జా భాగోతాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అధికారంలో ఉన్న పార్టీలోకి చేరి, అధికారులకు ఎప్పటికప్పుడు ముడుపులు ముట్టజెపుతూ మేనేజ్ చేసుకుంటున్నారు. భవిష్యత్తులో వాగులో వరద ఉధృతంగా వచ్చినా తట్టుకుని ప్రవాహాన్ని మళ్లించేలా వాగు మధ్యలో చాలా లోతునుంచి తవ్వి సలాకా, సిమెంటుతో వెడల్పాటి ఎత్తయిన గోడను చాలా బలంగా కట్టారు. దీంతో ఎంత ఉధృతంగా వరద వచ్చినా వరద నీటితో కబ్జా స్థలాల్లో నిర్మించిన కట్టడాలకు ఎలాంటి ఢోకా లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నిజామాబాద్ బైసాస్ రోడ్డులో ఫులాంగ్ వాగుపై ఉన్న ఓ వంతెన సమీపంలో పెద్ద యెత్తున వాగును కబ్జాచేసి ఆపార్ట్మెంట్లు నిర్మించారు. ఫులాంగ్ వాగును కబ్జాచేసి వాగు మధ్యలో సిమెంట్ గోడలు నిర్మించి కబ్జాలు చేసినా సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదో అంతుచిక్కని ప్రశ్న. కబ్జా స్థలాల్లో భవనాల నిర్మాణాలు, బహుళ అంతస్థుల నిర్మాణాలకు అధికార యంత్రాంగం ఏ ఆధారాలను చూసి, ఏ ధృవీకరణ పత్రాలను చూసి అనుమతులిచ్చారో బయట పెట్టాల్సిన అవసరం అధికార యంత్రాంగం పై ఉంది.
కబ్జా సరే.. నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు..
నాలాలు, వాగులు భూముల కబ్జా చేసిన కబ్జా రాయుళ్లు తప్పయితే కబ్జా స్థలంలో నిర్మాణాలకు అధికారిక అనుమతులిచ్చిన అధికారులు చేసిన పనిని ఏమనాలో తెలపాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. కబ్జారాయుళ్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో పాటు, కబ్జాలకు సహకరించిన వారిపై, కబ్జా స్థలాల్లో నిర్మాణాలకు పర్మీషన్ లు ఇచ్చి అక్రమ కబ్జాలో నిర్మాణాలను అధికారికం చేసిన అధికారులను కూడా తప్పుపట్టి చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.