న్యాయవ్యవస్థను దూషించిన MP రఘునందన్‌ రావు.. నోటీసులు జారీచేసిన హైకోర్టు

by Gantepaka Srikanth |
న్యాయవ్యవస్థను దూషించిన MP రఘునందన్‌ రావు.. నోటీసులు జారీచేసిన హైకోర్టు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మెదక్ ఎంపీ రఘునందన్‌రావుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు... ఆయనపై కోర్టు ధిక్కరణ కేసును నమోదు చేయనున్నట్లు హెచ్చరించింది. ఎన్ కన్వెన్షన్ భవనాన్ని హైడ్రా కూల్చివేసిన సందర్భంగా దాని అధినేత సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన హౌజ్ మోషన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించడం, కూల్చివేతపై స్టే ఉత్తర్వులను జారీ చేయడంపై కామెంట్లు చేసినందుకు హైకోర్టు ఈ చర్యలు తీసుకున్నది. ఈ వ్యాఖ్యలపై హైకోర్టు న్యాయమూర్తి ఒకరు చీఫ్ జస్టిస్‌కు రాసిన లేఖను చీఫ్ జస్టిస్ బెంచ్ సుమోటో కోర్టు ధిక్కరణ పిటిషన్‌గా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నది. ఎంపీ రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థకు కళంకం తెచ్చేవిగా ఉన్నాయని, వ్యవస్థనే అగౌరవ పరిచేలా ఉన్నాయని న్యాయమూర్తి ఆ ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యల కారణంగా జ్యుడిషియరీ ప్రతిష్ఠ మసకబారుతుందన్న ఆందోళనను ఆ లేఖలో వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదును సుమోటో కోర్టు ధిక్కరణ పిటిషన్‌గా ఎందుకు పరిగణనలోకి తీసుకోరాదో వివరణ ఇవ్వాలంటూ రఘునందన్‌రావుకు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరథే, జస్టిస్ శ్రీనివాసరావులతో కూడిన బెంచ్ నోటీసులు జారీచేసింది.

గత నెలలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ భవనాలను హైడ్రా కూల్చివేస్తున్న సమయంలోనే దాని అధినేత అక్కినేని నాగార్జున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్టే ఉత్తర్వులు మంజూరు చేయాలని కోరారు. దీన్ని హైకోర్టు రిజిస్ట్రీ హౌజ్ మోషన్ పిటిషన్‌గా విచారణకు స్వీకరించింది. కూల్చివేత పనులపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి బెంచ్ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను తప్పుపట్టిన ఎంపీ రఘునందన్ రావు... గత నెల 24న మీడియా సమావేశంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. స్టే ఉత్తర్వులు జారీ చేయడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించారు. ఎన్ కన్వెన్షన్ భవనాన్ని కూల్చివేయాలంటూ 2014లోనే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, ఇప్పుడు అదే హైకోర్టు కూల్చివేత పనులపై స్టే ఎలా విధిస్తుందని ప్రశ్నించారు. హౌజ్ మోషన్ పిటిషన్‌పై రిజిస్ట్రీ అత్యుత్సాహం చూపిందని, జ్యుడిషియల్ వ్యవస్థ విరుద్ధమైన ఉత్తర్వులు ఇచ్చిందని వ్యాఖ్యానించారు. జడ్జీలు ఇంత హడావిడి పడి నిర్ణయాలు తీసుకోవాల్సింది కాదని అన్నారు.

కనీసమైన పరిశీలన లేకుండానే, గతంలోని ఆదేశాలను పరిగణనలోకి తీసుకోకుండానే, పరిస్థితులను సరిగ్గా గమనంలోకి తీసుకోకుండానే న్యాయమూర్తి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదని ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. కోర్టు రిజిస్ట్రీ పనితీరు, సమర్ధతపైనే అనుమానాలున్నాయని, చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకుని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఒక పాత్రికేయుడు ప్రశ్నించినప్పటికీ ఎంపీ రఘునందన్‌రావు మాత్రం... తనకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉన్నదని, తాను చేసిన వ్యాఖ్యలేవీ న్యాయ వ్యవస్థను అగౌరవపరిచేవి కావని, కానీ న్యాయమూర్తులు చట్టాల గురించి మరింత లోతుగా అర్థం చేసుకోవాలన్న భావనతోనే ఈ వ్యాఖ్యలు చేశానంటూ సమర్ధించుకున్నారని ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో హైకోర్టు జడ్జి పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను, గౌరవాన్నే ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్నించినందున ప్రజలకు ఆ వ్యవస్థ పట్ల ఉన్న గౌరవం మసకబారే ప్రమాదమున్నదని పేర్కొన్నారు.

న్యాయమూర్తి రాసిన లేఖలోని అంశాలను పరిగణనలోకి తీసుకున్న చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం సుమోటోగా కోర్టు ధిక్కరణ పిటిషన్‌గా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఎంపీకి నోటీసులు జారీచేసింది.

Advertisement

Next Story

Most Viewed