- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్తగూడెంకు కార్పొరేషన్ హోదా…
దిశ, కొత్తగూడెం రూరల్: విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఉపయోగపడే గ్రంథాలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని హౌసింగ్ బోర్డ్ పరిధిలోని నంద తండా నుంచి వికలాంగులకు కాలనీ వరకు బీటీ రోడ్డు పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేయడంతో పాటు మున్సిపల్ పరిధిలోని రైటర్ బస్తి ఏరియాలో కొత్తగా నిర్మాణం పూర్తి చేసుకున్న గ్రంథాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన జిల్లా కావడంతో అభివృద్ధికి ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని విజ్ఞానాన్ని పెంపొందించే వేదికలుగా ఉన్న గ్రంథాలయాలను బలోపేతం చేస్తామన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో కూడా గ్రంధాలయాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత సమాజంలో చదువు ఎంతో ముఖ్యమని దీనిని దృష్టిలో పెట్టుకొని గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులను కల్పించనున్నామన్నారు. విద్యకు అవసరమయ్యే ఫర్నిచర్ ఇతర వసతులను కూడా కల్పిస్తామని పేర్కొన్నారు. వైద్యం అభివృద్ధికి కూడా వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సౌకర్యం కొరకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రులను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
విమానాశ్రయం కొరకు పట్టుదలతో ఉన్నాం..
కొత్తగూడెం జిల్లా కేంద్రానికి విమానాశ్రయ ఏర్పాటు కొరకు పట్టుదలతో ఉన్నట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. ఇప్పటికే విమానాశ్రయం ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేశామన్నారు. ఆదిలాబాద్ వరంగల్ కొత్తగూడెం విమానాశ్రయాల ఏర్పాటు కొరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఎయిర్పోర్ట్లు వస్తే జిల్లాలు అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలుస్తాయన్నారు. పాండురంగాపురం మీదుగా భద్రాచలం వరకు రైల్వే లైన్ సౌకర్యాలకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైల్వే లైన్ కొరకు గతంలో సర్వే కూడా పూర్తయిందన్నారు. రైల్వే లైన్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయితే సారపాకలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం వ్యవసాయం అభివృద్ధి జరగాలంటే ఆయిల్ ఫామ్ పంటల పై రైతులు దృష్టి పెట్టాలన్నారు. పత్తి మిరప ఇతర పంటలతో రైతులకు ఇబ్బందికరంగా ఉందన్నారు. పామ్ ఆయిల్ పంటలు సాగు చేస్తే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు. ఆయిల్ ఫామ్ పంటల పై రైతులు దృష్టి సారిస్తే కొత్తగూడెం టౌన్ సమీపంలో ఉన్న గరిమెళ్ళ పాడు నర్సరీ ఆవరణలో ఆయిల్ ఫామ్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.
ఇంజనీరింగ్ కాలేజీ రూపురేఖలు మారుస్తాం..
కొత్తగూడెం టౌన్ పాల్వంచ మధ్యలో ఉన్న కాకతీయ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలను పూర్తిస్థాయిలో అప్ గ్రేడ్ చేసి అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థిని విద్యార్థులకు అవసరమయ్యే కొత్త కొత్త కోర్తులను ఈ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశ పెట్టబోతున్నట్లు చెప్పారు. ఈ కాలేజీలో గతంలో ఎంతో మంది చదివి ఉన్నత పదవులలో ఉన్నారని దీనిని దృష్టిలో పెట్టుకొని ఇంజనీరింగ్ కాలేజీని పూర్తిస్థాయిలో రూపురేఖలు మారుస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు స్పష్టం చేశారు.
కొత్తగూడెంను కార్పొరేషన్ చేస్తా...
కొత్తగూడెం జిల్లాను కార్పొరేషన్ ను ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు స్పష్టం చేశారు. కార్పొరేషన్ గా ఏర్పడితే భద్రాద్రి జిల్లా మరింత అభివృద్ధి పథంలో ముందుకు పోతుందన్నారు. ముఖ్యంగా వ్యాపార రంగం అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్పొరేషన్ అయితే ఎస్పీ కార్యాలయం కూడా కమిషనరేట్ కార్యాలయంగా మారుతుందన్నారు. దీంతో పోలీస్ వ్యవస్థ మరింత బలపడుతుందన్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కృషి వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రశాంతంగా ఉందన్నారు. జిల్లా సరిహద్దులో నక్సల్స్ ప్రభావం ఉన్న దృష్ట్యా స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం వల్ల ఎలాంటి సమస్య లేదన్నారు.
మత్తు పదార్థాల రవాణా నివారణకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. కొత్తగూడెం పాల్వంచ బైపాస్ రోడ్ల ఏర్పడితో పాటు నాలుగు లైన్ల రోడ్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన జిల్లా కావడంతో అభివృద్ధికి ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డిఆర్డిఏ విద్యా చందన, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, సొసైటీ సభ్యులు మండే వీర హనుమంతరావు, కొత్వాల శ్రీనివాసరావు ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.