Sanjay raut: బ్యాలెట్ పేపర్లతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

by vinod kumar |
Sanjay raut: బ్యాలెట్ పేపర్లతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బ్యాలెట్ పేపర్లతో మహారాష్ట్రలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ (Sanjay raut) డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. సోమవారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఈవీఎం (EVM)లు పనిచేయకపోవడంపై పలు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ‘ఈవీఎంలకు సంబంధించి దాదాపు 450 కంప్లెయింట్స్ అందాయి. పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఈ సమస్యలపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈ ఎన్నికలు న్యాయబద్ధంగా జరిగాయని ఎలా చెప్పగలం? అందుకే ఫలితాలను పక్కనబెట్టి బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి’ అని వ్యాఖ్యానించారు. పలు ఈవీఎంలలో వ్యత్యాసాలు గుర్తించారని, కానీ అభ్యంతరాలను అంగీకరించడానికి ఎన్నికల అధికారులు నిరాకరించారన్నారు.

ఎన్నికల్లో కొంత మంది అభ్యర్థులు లక్షా 50వేల మెజారిటీతో గెలుపొందారని, వారంతా విప్లవాత్మక మార్పులు ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. పార్టీలు మారిన నాయకులు కూడా ఎమ్మెల్యేలు అయ్యారని, ఇది అనుమానాలను రేకెత్తిస్తోందని నొక్కి చెప్పారు. మొదటిసారి శరద్ పవార్ (Sharad pawar) వంటి సీనియర్ నాయకుడు సైతం ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేశారని, దీనిని విస్మరించలేమని తెలిపారు. ఎంవీఏలో అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ వైఫల్యం ఉమ్మడిగా ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed