మంత్రులు వస్తే కాని చెక్కులు ఇవ్వరా : ఎమ్మెల్యే మాధవరం..

by Sumithra |
మంత్రులు వస్తే కాని చెక్కులు ఇవ్వరా : ఎమ్మెల్యే మాధవరం..
X

దిశ, కూకట్​పల్లి : కూకట్​పల్లి నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్​ చెక్కులు అందజేయకుండా అధికారులు అలసత్వం వహిస్తున్నారని, సంక్షేమ పథకాలకు అధికార పార్టీ రాజకీయ గ్రహణం పట్టిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. కూకట్​పల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ కూకట్​పల్లిలో మంత్రి వస్తే తప్ప లబ్దిదారులకు చెక్కులు ఇవ్వడం లేదని, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అధికార పార్టీ నాయకుల గ్రహణం పట్టి పీడిస్తుందని ఆరోపించారు. కూకట్​పల్లి నియోజకవర్గం పరిధిలోని కూకట్​పల్లి, బాలానగర్​ మండల కార్యాలయాలకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్​ చెక్కులు వచ్చి రోజులు గడుస్తున్నా మంత్రి సమయం ఇవ్వడం లేదు, మంత్రి అపాయింట్​మెంట్​ పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారని అన్నారు.

నియోజకవర్గం పరిధికి చెందిన 534 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్​ చెక్కులు తహశీల్దార్​ కార్యాలయానికి చేరి నెలలు గడుస్తున్న పంపిణి చేయక పోవడంతో లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చెక్కులు పంపిణీ చేయమని ఇప్పటికే జిల్లా కలెక్టర్​, ఆర్​డీవో, తహశీల్దార్​లను కోరిన జిల్లా ఇన్​చార్జి మంత్రి సమయం ఇవ్వడం లేదని దాటవేస్తున్నారని అన్నారు. పేద ప్రజలు ఎంతో కష్టపడి అప్పులు చేసి తమ బిడ్డల పెండ్లిలు చేసుకున్న వారు చెక్కుల కోసం పడిగాపులు గాస్తున్నా అధికారులు నిర్లక్ష్యం వహించడం సిగ్గుచేటని అన్నారు. గతంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో పేదింటి ఆడబిడ్డల కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్​ పథకాన్ని ప్రవేశ పెట్టి ప్రజలను ఆదుకున్నారని గుర్తు చేశారు. కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలు, రాజకీయాలకు తావు లేకుండా గడిచిన పదేండ్లలో ప్రభుత్వ పథకాలు అందరికి అందించిన ఘనత బీఆర్​ఎస్​ ప్రభుత్వానిదేనని అన్నారు.

కూకట్​పల్లి నియోజకవర్గంలో గత పదేండ్లు కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని సైతం పండుగల నిర్వహించడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీఆర్​ఎస్​ ఇస్తున్న దానికి అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వకపోగా ఉన్న చెక్కులు కూడా లబ్దిదారులు అందించకుండా రాజకీయం చేస్తున్నారని అన్నారు. గత కొన్ని నెలలుగా నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది, సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్​ ప్రభుత్వం విఫలం అయిందని ఆరోపించారు. లబ్దిదారులు ఆన్​లైన్​లో చెక్ చేసుకుంటే చెక్కులు ఎమ్మెల్యే వద్ద పెండింగ్​లో ఉన్నాయని ఊపిస్తుండటంతో లబ్దిదారులు ఎమ్మెల్యే కార్యాలయం చుట్టు తిరుగుతున్నారని అన్నారు. మంగళవారం 11 గంటల వరకు చెక్కులు పంపిణి చేయకపోతే తహశీల్దార్​ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. లబ్దిదారులకు చెక్కులు అందించే వరకు బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి పంపిణీ చేసే వరకు ఉద్యమం చేస్తామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed