అలంకార ప్రాయంగా అభివృద్ధి పనులు.. బ‌య‌ట‌ప‌డుతున్న లోపాలు

by Disha News Desk |
అలంకార ప్రాయంగా అభివృద్ధి పనులు.. బ‌య‌ట‌ప‌డుతున్న లోపాలు
X

దిశ‌ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : మేడారం అభివృద్ధి ప‌నులు అలంకార‌ ప్రాయంగా మారుతున్నాయా..? అంటే భ‌క్తుల నుంచి అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. జంప‌న్న‌ వాగుపై ఏర్పాటు చేసిన బ్యాట‌రీ ఆఫ్ ట్యాప్స్ ఏర్పాటు చేసినా వాటిలో చాలావాటికి ఇంకా క‌నెక్ష‌న్ ఇవ్వ‌లేదు. దీంతో మ‌హిళా భ‌క్తులు వాగులోకి వెంట తెచ్చుకున్న పాత్ర‌ల‌తో స్నానం చేస్తున్నారు. స‌రైన లోతు లేక‌పోవ‌డంతో జంప‌న్న‌వాగులో మూడు మున‌క‌లు తీసి రావాల‌న్న భ‌క్తుల కోరిక కూడా నెర‌వేర‌డం లేదు.

ఇదిలా ఉంటే 6000ల‌కు పైగా ఏర్పాటు చేసిన మ‌రుగుదొడ్ల‌కు నీటి సౌక‌ర్యం ఇంకా ప్రారంభించ‌లేదు. సామూహిక మ‌రుగుదొడ్ల వ‌ద్ద ఏర్పాటు చేసిన నీటి తొట్టిలు ఖాళీగా క‌నిపిస్తున్నాయి. భ‌క్తులు అక్క‌డికి వ‌చ్చి తిరిగి వెళ్తున్నారు. ఇదేమ‌ని శానిటేష‌న్ సిబ్బందిని 'దిశ' ఆరా తీయ‌గా.. వాటిని ఇంకా ప్రారంభించ‌లేద‌ని చెప్పటం గ‌మ‌నార్హం. అధికారులు మాత్రం అదేం లేదు.. ఎప్పుడో అందుబాటులోకి వ‌చ్చాయ‌ని పేర్కొంటున్నారు. వాస్త‌వానికి తాత్క‌లిక మ‌రుగుదొడ్ల వ‌ద్ద ఏర్పాటు చేసిన తొట్టిల్లో నీటిని డంప్ చేసేందుకు ఏర్పాట్లు చేసిన‌ట్లు చెబుతున్నారు.

ఆయా ప్రాంతంలోని రైతుల బావుల నుంచి గాని, వాగులో నుంచి గాని ఎప్ప‌టిక‌ప్పుడు నీటిని మ‌రుగుదొడ్ల వ‌ద్ద‌కు ట్యాంక‌ర్ల ద్వారా నీటిని చేర్చాల్సి ఉంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా ఆ ప్ర‌క్రియే మొద‌లు కాలేదు. జాత‌ర‌లో విధులు నిర్వ‌హిస్తున్న సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన వ‌స‌తి గ‌దుల్లో విద్యుత్ సౌక‌ర్యం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. హెల్త్ సిబ్బంది బ‌స చేస్తున్న హాల్‌లో కొత్త‌గా బ‌ల్బుల‌ను, ఫ్యాన్ల‌ను అమ‌ర్చినా విద్యుత్ క‌నెక్ష‌న్లు ఇవ్వ‌లేదు. అలాగే మీడియా సిబ్బంది అవ‌స‌రాల‌కు అందుబాటులోకి తేవాల్సిన హాల్ శుక్ర‌వారం లాక్ వేసే ఉండ‌టం గ‌మ‌నార్హం.

Advertisement

Next Story

Most Viewed