భూ స‌ర్వే జాడేది.. జ‌లాశ‌యాల్లో అక్రమాలు తేల్చేదెప్పుడు ?

by Sumithra |
భూ స‌ర్వే జాడేది.. జ‌లాశ‌యాల్లో అక్రమాలు తేల్చేదెప్పుడు ?
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ పరిధిలోని జ‌లాశ‌యాల ప‌రిర‌క్షణ‌కు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చ‌ర్యలు.. అధికారుల ఉదాసీన‌త‌తో అప‌హాస్యం పాల‌వుతున్నాయి. త్రిన‌గ‌రి ప‌రిధిలోని సుమారు 200 పై చిలుకు జ‌లాశ‌యాల‌ను ప‌రిర‌క్షించేందుకు జీడబ్ల్యూఎంసీ, రెవెన్యూ, ఇరిగేష‌న్ శాఖ‌ల అధికారుల‌తో జాయింట్ స‌ర్వేకు వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండ అధికారులు ఆదేశించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి సూచ‌న‌ల‌తో చెరువుల ప‌రిర‌క్షణల‌కు పూనుకున్న యంత్రాంగం దాన్ని మ‌ధ్యలోనే వ‌దిలేయ‌డం గ‌మ‌నార్హం. సంబంధిత జ‌లాశ‌యాల‌ను ఎఫ్‌టీఎల్, బ‌ఫ‌ర్ జోన్లను నిర్ధారిస్తూ. అక్రమాల‌ను తేల్చాల్సి ఉంది. గ‌తేడాది మే నెల చివ‌ర‌లో జాయింట్ స‌ర్వేను ప్రారంభించిన బృందాలు ప‌క్షం రోజుల త‌ర్వాత నుంచి క్రమంగా క్షేత్రస్థాయి ప‌ర్యట‌న‌ల‌కు దూర‌మ‌వుతూ వ‌చ్చాయి. ఇప్పటి వ‌ర‌కు చేసిన స‌ర్వే వివ‌రాల‌ను కూడా క‌లెక్టర్లకు నివేదిక‌ల రూపంలో అంద‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఆక్రమణలను అడ్డుకోవాల్సిన గ్రేటర్ వరంగల్, రెవెన్యూ, నీటి పారుదలశాఖ అధికారులు స‌ర్వే చేయ‌కుండా జాప్యం చేయ‌డం పై అనుమానాలు వ్యక్తమ‌వుతున్నాయి.

ఏడు నెల‌లైనా ఏది ఫ‌లితం..?

రెవెన్యూ, ఇరిగేష‌న్ అధికారులు వెల్లడిస్తున్న వివ‌రాల ప్రకారం.. గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ పరిధిలో 190 జ‌లాశ‌యాలున్నాయి. రికార్డుల ప్రకారం వీటి విస్తీర్ణం 4,990 ఎక‌రాల‌కు ఉంటుంద‌ని స‌మాచారం. అయితే ఈ జ‌లాశ‌యాల్లో వంద‌లాది ఎక‌రాలు ఇప్పుడు అన్యాక్రాంతం కావ‌డం గ‌మ‌నార్హం. ఆక్రమ‌ణ‌ల నిగ్గు తేల్చడం, అక్రమ నిర్మాణాలను గుర్తించ‌డం, ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్ల గుర్తింపు చేసి హ‌ద్దులు ఏర్పాటు చేసే ల‌క్ష్యంతో నగర పరిధిలోని చెరువుల భూ విస్తీర్ణం పై జాయింట్ స‌ర్వే చేప‌ట్టారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, జీడ‌బ్ల్యూఎంసీ అధికారుల భాగ‌స్వామ్యంతో డ్రోన్ల సహాయంతో చెరువుల స‌మ‌గ్ర స‌ర్వేకు పూనుకున్నారు. స‌ర్వే నిర్వహ‌ణ‌కు టెండ‌ర్లు సైతం పిలిచిన‌ట్లు స‌మాచారం. అయితే ప్రాథ‌మిక క‌స‌ర‌త్తును ప్రారంభించి దాదాపు ప‌క్షం రోజులు క్షేత్రస్థాయిలో ప‌ర్యటించిన అధికారులు ఎందుక‌నో ఈ కార్యక్రమాన్ని క్రమంగా అట‌కెక్కించారు. రాష్ట్ర ప్రభుత్వం 2018 లో 14 మంది సభ్యులతో కూడిన లేక్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. చిన్న వడ్డేపల్లి, భద్రకాళి, బొందివాగు నాలా, కోట చెరువు, వడ్డేపల్లి సరస్సు వంటి చెరువులను గుర్తించి జియో ట్యాగింగ్ చేసి 2022లో ఆక్రమణలను అరికట్టేందుకు బఫర్‌జోన్‌ ఏర్పాటు చేయాలని భావించినా అది కూడా జరగలేదు. ఇప్పుడు జాయింట్ స‌ర్వే కూడా అట‌కెక్కడం గ‌మ‌నార్హం.

వంద‌ల ఎక‌రాలు అన్యాక్రాంతం..

ఆక్రమణదారుల‌ను గుర్తిస్తున్నా క‌బ్జాకు య‌త్నిస్తున్నవారి పై, క‌బ్జా చేశార‌ని నిర్ధార‌ణ చేసుకున్నవారి పై ఎలాంటి చ‌ర్యలు ఉండ‌టం లేదు. టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూ, ఇరిగేష‌న్ శాఖ‌ల మధ్య సమన్వయం ఉండ‌డం లేదు. నిర్మాణాలను ఆరంభ సమయంలోని గుర్తించి అడ్డుకోవాల్సిన అధికారులు ఫిర్యాదులు చేసినా అటుగా వెళ్లడం లేదు. చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం పరిధిని నిర్ధేశించ‌కుండా జాప్యం చేస్తుండ‌టం క‌బ్జాల పెరుగుద‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఫ‌లితంగా జీడ‌బ్ల్యూఎంసీ ప‌రిధిలో చెరువులు, కుంటల ప‌రిస్థితి ఇప్పుడు ప్రమాదంలో ప‌డింది. వ‌రంగ‌ల్ ప‌ట్టణంలో పెద్ద చెరువులుగా ఉన్న భద్రకాళి, వడ్డేపల్లి, కోట చెరువు, బంధం, ఉర్సు చెరువు, దేశాయిపేట చిన్న వడ్డేపల్లి, న్యూ శాయంపేట కోటి చెరువు, గొర్రెకుంట, కట్టమల్లన్న, హసన్‌పర్తి, కడిపికొండ, భట్టుపల్లి చెరువులు ఆక్రమ‌ణ‌కు గుర‌వుతున్నాయి. ఆయా చెరువుల్లో వంద‌ల నిర్మాణాలు వెలిశాయి.

Advertisement

Next Story

Most Viewed