దేవుడా దారి చూపండి.. మగ దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం..

by Kalyani |
దేవుడా దారి చూపండి.. మగ దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం..
X

దిశ, డోర్నకల్: ఏడాది క్రితం కొడుకుని కోల్పోయిన ఆ తండ్రి కుటుంబాన్ని పోషించడానికి నానా కష్టాలు పడ్డాడు. మృతి చెందిన కొడుకు యొక్క ఇద్దరు భార్యలు, వారికి పుట్టిన ముగ్గురు ఆడపిల్లలు, ఇంటి ముసలవ్వను సాదడానికి పెద్ద దిక్కుగా మారి క్షణం తీరిక లేకుండా రెక్కలను నమ్ముకుని పోషించాడు. కాగా ఆదివారం డోర్నకల్ మండల పరిధి గొల్లగూడెం శివారు ఉయ్యాలవాడలోని వారి స్వగృహంలో ఆ ఇంటి పెద్దదిక్కుగా ఉన్న పగిడిపాల బిక్షమయ్య గుండెపోటుతో మరణించాడు. ఇన్నాళ్లు కుటుంబాన్ని పోషించిన పెద్దదిక్కు చనిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ఆ ఆరుగురు మహిళలు దేవుడా దారి చూపండి అంటూ గుండెలవిసేలా చేసిన ఆర్తనాదాలు అక్కడున్న వారి హృదయాలను కలిచివేశాయి. అందరితో కలివిడిగా ఉండే బిక్షమయ్య మరణించాడన్నా వార్త తెలిసి మానుకోట జిల్లా నోపా గౌరవ సలహాదారులు, స్వతంత్ర సమరయోధులు రాపర్తి యాదగిరి ఇతర నాయకులతో కలిసి బిక్షమయ్య మృతదేహానికి పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. గాయకుడు వెంకట్రావు పాడిన పాట అందరిని కంటతడి పెట్టించింది. కేసీఆర్ ప్రభుత్వం మగ దిక్కును కోల్పోయిన ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా పలువురు విజ్ఞప్తి చేశారు.


Advertisement

Next Story