సోయి లేని ఏఈ…వరంగల్‌ నగరంలో నీటి సరఫరాపై నిర్లక్ష్యం

by Kalyani |
సోయి లేని ఏఈ…వరంగల్‌ నగరంలో నీటి సరఫరాపై నిర్లక్ష్యం
X

దిశ, వరంగల్‌ టౌన్ : ప్రజా సమస్యల పరిష్కారంపై వరంగల్‌ మహానగర పాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం సోమవారం నాటి గ్రీవెన్స్‌సెల్‌ వేదికగా తేటతెల్లమైంది. అధికారుల తీరుపై కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే ఆగ్రహం వెలిబుచ్చడం బల్దియా పరిపాలన దుస్థితికి అద్దం పడుతోంది.

నీటి సమస్యలపై అలసత్వం

ఎప్పటిలాగే సోమవారం కూడా గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ హాలులో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు వినతులు వెల్లువెత్తాయి. వివిధ సమస్యలు పరిష్కరించాలంటూ 63 అర్జీలు గ్రీవెన్స్‌కు అందాయి. ముఖ్యంగా వీటిలో ఓ వికలాంగుడు రెండేళ్లుగా బోరు రిపేరు కోసం ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోకపోవడం గ్రీవెన్స్‌ ఫిర్యాదులపై అధికారుల అలసత్వాన్ని ఎత్తి చూపుతోంది. వరంగల్‌ నగరంలోని 18వ డివిజన్‌ చెన్నారెడ్డికాలనీలో 34వ నంబర్‌ గల బోరింగ్‌ రిపేరుకు వచ్చింది. దీనిపై స్థానికుడు జన్ను మాణిక్యం అనే వికలాంగుడు మున్సిపల్‌ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు గ్రీవెన్స్‌సెల్‌ దృష్టికి తీసుకొచ్చాడు.

రెండేళ్లుగా బోరింగ్‌ను రిపేరు చేయడం లేదని విన్నవించాడు. పలుమార్లు ఏఈ కృష్ణమూర్తికి ఫోన్‌ చేసినా కనీసం ఫోన్‌ కూడా తీయడం లేదని ఆవేదన చెందాడు. ఇప్పటికైనా బోరింగ్‌ రిపేరు చేయాలని కోరుతూ ఏఈ కృష్ణమూర్తికే వినతిపత్రం సమర్పించడం గమనార్హం. ఇదిలా ఉండగా, నగరంలో నీటి సమస్యపై మొత్తం నాలుగు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే అధికారులపై సీరియస్‌ అయ్యారు. నిధులు లేవా? అంటూ నిలదీశారు. మరోసారి నీటి సరఫరాపై ఫిర్యాదులు రాకూడదని అధికారులను ఆదేశించారు.

తీరొక్క సమస్య..

వివిధ రకాల సమస్యలపై ప్రజలు గ్రీవెన్స్‌సెల్‌ను ఆశ్రయించారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని, శానిటేషన్‌ నిర్వహణ సక్రమంగా లేదని, నీటి సరఫరా లేదని, గొర్రెకుంట గరీబ్‌నగర్‌లో మిషన్‌ భగీరథ పైపులైను దెబ్బతిన్నదని... తదితర సమస్యలపై వినతులు అందించారు. ఆయా విభాగాల వారీగా.. ఇంజినీరింగ్‌ విభాగానికి 17, హెల్త్‌ అండ్‌ శానిటేషన్‌ 6, పన్నుల విభాగం 4, టౌన్‌ ప్లానింగ్‌ 31, మంచినీటి సరఫరా 4, ఎలక్ట్రికల్‌ విభాగంనకు ఒక దరఖాస్తు వచ్చాయి. గ్రీవెన్స్‌సెల్‌కు అదనపు కమిషనర్‌ జోనా, ఎస్‌ఈ ప్రవీణ్‌ చంద్ర, సీఎంహెచ్‌వో డాక్టర్ రాజారెడ్డి, డీఎఫ్‌వో శంకర్‌ లింగం, ఇన్‌చార్జ్‌ సీపీ రవీంద్ర డి రాడేకర్‌, డిప్యూటీ కమిషనర్లు కృష్ణారెడ్డి, హెచ్‌వో రమేశ్‌, ఎంహెచ్‌వో డాక్టర్ రాజేశ్‌ తదితరులు హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed