కాంగ్రెస్ వైపు కారు నేత‌ల చూపు.. పంచాయ‌తీ స‌మ‌రంపైనా స‌మాలోచ‌న‌లు

by Aamani |   ( Updated:2024-01-03 14:22:00.0  )
కాంగ్రెస్ వైపు కారు నేత‌ల చూపు.. పంచాయ‌తీ స‌మ‌రంపైనా స‌మాలోచ‌న‌లు
X

దిశ,భూపాలపల్లి : భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో పొలిటిక‌ల్ సీన్ మారుతోంది. రాష్ట్రంలో, నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన నేప‌థ్యంలో కారు పార్టీలోని కొంత‌మంది లీడ‌ర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కండువా క‌ప్పుకుంటే పార్టీలో ప్రాధాన్యంతో పాటు స‌మీప భ‌విష్య‌త్‌లో నామినేటెడ్ ప‌ద‌వుల రేసులోనూ ఉండ‌వ‌చ్చ‌ని యోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గంలో చాలా బ‌లంగా ఉంద‌ని న‌మ్ముతున్న కొంత‌మంది కారు నేత‌లు స‌మీప భ‌విష్య‌త్‌లో స‌ర్పంచ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో హ‌స్తం వైపు వెళ్లేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. గ్రామ‌, మండ‌ల స్థాయిలోని నేత‌లు ఇప్ప‌టికే సానుకూల సంకేతాల‌ను పంపుతున్నారు. గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌రావు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించాక‌.. కొద్దిరోజులు స్త‌బ్ధుగా ఉన్న నేత‌లు క్ర‌మంగా ఆయ‌న‌కు ట‌చ్‌లోకి వెళ్తున్నారు. శాయంపేట‌, రేగొండ‌, చిట్యాల‌, భూపాల‌ప‌ల్లి టౌన్‌లోని కొంత‌మంది కీల‌క‌ బీఆర్ఎస్ నేత‌లు కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

రాజ‌కీయ మ‌నుగ‌డ‌ ఇబ్బంది లేకుండా హస్తం పార్టీలోకి చేరితే త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్‌కు ఎలాంటి ఢోకా ఉండ‌ద‌ని భావిస్తున్నారంట‌. అధికారంలో ఉన్న పార్టీలో కొన‌సాగ‌డ‌మే మేలంటూ యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. రాబోవు రోజుల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ, మునిసిపాలిటీ ఎన్నిక‌ల్లో రాజ‌కీయ అవ‌కాశాల‌ను అందిపుచ్చుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అనుకుంటున్నారు. అభివృద్ధి కోస‌మే అధికార పార్టీలోకి అనే నినాదంతో పార్టీ మారాల‌ని యోచిస్తున్నారంట‌. ఈనేప‌థ్యంలోనే శాయంప‌టే మండ‌లానికి చెందిన కొంత‌మంది బీఆర్ ఎస్ లీడ‌ర్లు ఎమ్మెల్యేకు స‌న్నిహితంగా ఉంటున్న లీడ‌ర్ల‌తో పార్టీలో చేరిక‌పై వ‌ర్త‌మానం పంపడం, ఆయ‌న దానికి సానుకూలంగా స్పందించ‌డం కూడా జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. ఈనేప‌థ్యంలో శాయంపేట మండ‌లంలోని కారు పార్టీకి చెందిన కొంత‌మంది లీడ‌ర్లు కాంగ్రెస్ కండువా క‌ప్పుకోవ‌డం లాంఛ‌న‌మేన‌ని తెలుస్తోంది.

మేం ఒప్పుకోం..!

కారు పార్టీ నేత‌లు కాంగ్రెస్‌లో వ‌చ్చే ప్ర‌య‌త్నాల‌పై ఆ పార్టీ నేత‌లు అంగీక‌రించ‌డం లేదు. బీఆర్ ఎస్ పార్టీలో ఉంటూ మ‌మ్మ‌ల్ని ముప్ప తిప్ప‌లు పెట్టిన నేత‌లే మ‌ళ్లీ క‌లిసి ప‌నిచేద్దామ‌ని వ‌స్తే ఎట్లా అంగీక‌రిస్తామంటూ నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నేత‌ల‌తో గ్రామ‌, మండ‌ల స్థాయి నేత‌లు సంవాదం కొన‌సాగిస్తున్నారు. అయితే ఎప్పుడో ఒక‌ప్పుడు చేరిక‌లను ఆహ్వానించ‌క త‌ప్ప‌ద‌ని కూడా కాంగ్రెస్‌లోని కీల‌క నేత‌లు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఈనేప‌థ్యంలో కారు పార్టీ నేత‌ల‌ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించ‌డం కూడా జ‌రుగుతుంద‌ని చెప్ప‌క‌నే చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ మార్పులు వేగంగా మారుతాయ‌న్న విశ్లేష‌ణ‌లు జ‌రుగుతున్నాయి.

Advertisement

Next Story