చనిపోతున్న మనుషులు, మూగజీవాలు.. ఉద్యమానికి సిద్ధమవుతున్న గిరిజనులు

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-21 02:43:10.0  )
చనిపోతున్న మనుషులు, మూగజీవాలు.. ఉద్యమానికి సిద్ధమవుతున్న గిరిజనులు
X

దిశ, ఖమ్మం బ్యూరో: అనుమతి తీసుకున్నది ఒక్క దానికి.. నడపుతున్నవి మాత్రం తొమ్మిది.. ఇదీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగ్గూడెం క్వారీలో జరుగుతున్న అసలు దందా. అటువైపు వెళ్లే అధికారులు వారు లేక.. పట్టించుకునే వారు లేక.. క్వారీ యజమాని ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లుగా నడుస్తున్నది. ‘దిశ’ నిర్వహించిన గ్రౌండ్ రిపోర్టులోనూ ఇదే వెల్లడైంది. కనీసం ఎన్ని క్వారీలకు అనుమతి ఉన్నదో కూడా అధికారుల వద్ద లెక్క లేదు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తొమ్మిది క్వారీలు నడుస్తున్నా.. ఎన్నింటికి అనుమతులు ఉన్నాయో కూడా రికార్డులు లేవు. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అధికారులను అడిగితే అదంతా తమ పైస్థాయి అధికారులకే తెలుసు అంటూ సమాధానాలు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు. అంతేగాకుండా.. ఈ క్వారీ నుంచి ప్రభుత్వానికి సుమారుగా రూ.300 కోట్లు బకాయిలు ఉన్నట్లుగానూ తెలుస్తున్నది. ఈ క్వారీతో ప్రజలు సైతం ఇబ్బందులు పడుతుండడంతో ఇప్పుడు ఇక్కడి గిరిజన ప్రజలంతా ఉద్యమానికి సిద్ధం అవుతున్నట్లుగా సమాచారం.

అటు వెళ్లాలంటేనే భయం..

అనధికారికంగా క్వారీ నిర్వహణ జరుగుతున్నా.. అనమతులు లేకుండా ప్రభుత్వ, ఫారెస్టు భూముల్లో మైనింగ్ నిర్వహిస్తున్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనింగ్, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. భారీ ఎత్తున అక్రమాలకు నెలవుగా మారిన తోగ్గూడెం క్వారీవైపు అధికారులు వెళ్లాలంటే జంకుతున్నట్లు తెలుస్తున్నది. అధికార పలుకుబడితో, డబ్బు కట్టలతో ఇటు రాజకీయ నాయకులను, అటు అధికారులను మేనేజ్ చేస్తున్నట్లు నిర్వాహకుడే స్వయంగా చెప్పడం గమనార్హం. అందరూ తన చెప్పుచేతల్లోనే ఉన్నారని, తనను ఏమీ చేయలేరనే ధీమాతో వ్యాపారాన్ని అంతకంతకూ విస్తరించుకుంటూ ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు సవాల్‌గా మారాడు. మరోవైపు క్వారీ నిర్వహణ కారణంగా ఇప్పటికే కొందరి ప్రాణాలు పోగా.. మూగజీవాలు కూడా మరణిస్తున్నాయి. మరోవైపు ప్రభావిత గ్రామాల ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండ్లు, గోడలు బీటలు వారుతున్నాయి. ఎప్పుడు కూలిపోతాయే తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. వివిధ శాఖల అధికారులు మాత్రం ఎప్పటిలాగే అలసత్వం వహిస్తున్నారు. మైనింగ్ శాఖతోపాటు ఫారెస్ట్, రెవెన్యూ, పోలీసు శాఖలు క్వారీ నిర్వాహకులకు సహకరిస్తూ అసలు విషయాన్ని బయటకు రానివ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అన్ని శాఖలు ఒకేసారి తనిఖీలు నిర్వహిస్తే భారీ అక్రమాలు వెలుగుచూస్తాయని స్థానికులు అంటున్నారు. వందల కోట్లలో అక్రమ మైనింగ్ రూపంలో ప్రజాధనం లూటీ అవుతున్నా చర్యలకు వెనుకాడటం విస్తుగొలుపుతున్నది.

ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు..

తోగ్గూడెం అక్రమ మైనింగ్‌పై ఇప్పటికే గిరిజన సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు ఐటీడీఏ పీఓకు, కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎటువంటి ఉపయోగం లేదు. జిల్లా అధికారులు ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తూ, అక్రమ క్వారీల నిర్వాహకులకు అండగా నిలుస్తున్నారు. దీంతో వందల కోట్ల విలువైన కంకర, రాయి అక్రమంగా రాష్ట్రాలు దాటి తరలిపోతోంది. గ్రామపంచాయతీకి రాయల్టీ కూడా కట్టకుండా అక్రమార్కులు కంకరను సరిహద్దులు దాటిస్తున్నారు. కలెక్టర్, ఐటీడీఏ పీవో, రాష్ట్ర మైనింగ్, ఫారెస్ట్, రెవెన్యూ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటే తప్ప ఈ అక్రమ మైనింగ్‌‌కు అడ్డుపడే అవకాశమే లేదని వారు అంటున్నారు. ఇక.. గిరిజన సంఘాలు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఉద్యమాలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి.

ఈడీ, ఐటీ శాఖకు ఫిర్యాదు చేస్తాం: పోనిశెట్టి వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి

కొన్ని సంవత్సరాలుగా ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంపై నేనూ పోరాటం చేస్తున్నా. అక్రమ మైనింగ్ నిర్వాహకులు అన్ని చట్టాలను అతిక్రమించి వందల కోట్లు సంపాదించారు. వీరిపై ఇప్పటికే రూ.300కోట్లు జరిమానా పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వానికి జరిమానా కట్టకుండానే క్వారీలను తవ్వుకుంటున్నారు. ఇందులో అధికారులకు భాగస్వామ్యం ఉంది. త్వరలో కేంద్ర సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు, ఐటీ సంస్థకు ఫిర్యాదు చేస్తా. అక్రమ మైనింగ్ నిర్వహకులతో పాటు, ఈ అంశంపై అలసత్వం వహిస్తున్న అధికారులపై కూడా ఫిర్యాదు చేస్తాను.

Advertisement

Next Story