Uttam: వచ్చే నెలలో రేషన్ కార్డులకు అప్లికేషన్లు.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |
Uttam: వచ్చే నెలలో రేషన్ కార్డులకు అప్లికేషన్లు.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే నెలలో రేషన్ కార్డులకు అప్లికేషన్లు తీసుకుంటామని, తదుపరి కేబినెట్ భేటీలో ప్రమాణాలు ఫైనలైజ్ చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు విడివిడిగా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి, దాని యొక్క విధివిధానాలను ఫైనలైజ్ చేయాలని చెప్పినట్లు తెలిపారు. ఇప్పటికీ మూడు మీటింగ్ లు జరిగాయని, నాలుగో మీటింగ్ తర్వాత తుది నిర్ణయానికి వస్తామని, వచ్చే నెలలోనే రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం అప్లికేషన్లు తీసుకుంటామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ వ్యాప్తంగా 91 లక్షల కార్డులు ఉండేవని, తెలంగాణ ఏర్పడ్డాక కొన్ని కొత్త కార్డులు జారీ చేయడం, కొన్ని తీసేయడం సహా మొత్తం 89 లక్షల 96 వేల కార్డులు మిగిలాయని అన్నారు.

ఇప్పుడు మొత్తం బైఫరికేషన్ చేసి కొత్త కార్డులు ఇవ్వాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. రేషన్ కార్డు రేషన్ కి, హెల్త్ కార్డ్ హెల్త్ కి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రేషన్ కార్డులు జారీ చేసేందుకు కొన్ని విదివిధానాలు ఉన్నాయని, రేషన్ కార్డు కోసం ఆదాయ పరిమితి గ్రామాల్లో లక్షా 50 వేల లోపు పట్టణాల్లో అయితే 2 లక్షలు మించకుండా ఉన్నవారు అర్హులని, అలాగే భూమి విషయానికి వస్తే వెట్ ల్యాండ్ అయితే 3.5 ఎకరాల లోపు, డ్రై ల్యాండ్ అయితే 7.5 ఎకరాల లోపు ఉండాలని ఉందని, ఈ ప్రమాణాలను ఇలాగే కొనసాగించాలా లేక మర్చాలా అనే దానిపై చర్చిస్తున్నామని తెలిపారు. దీనికోసం ఇతర రాష్ట్రాల ప్రమాణాలను కూడా అధ్యయనం చేస్తున్నామని, తదుపరి జరగబోయే మీటింగ్ లో ప్రమాణాలపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story