Delhi: బండి సంజయ్ విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూల స్పందన

by Gantepaka Srikanth |
Delhi: బండి సంజయ్ విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూల స్పందన
X

దిశ, వెబ్‌డెస్క్: పీవీ నర్సింహారావు(PV Narasimha Rao) జన్మించిన ‘వంగర’లో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. దీంతోపాటు సిరిసిల్ల జిల్లాలోనూ నవోదయ విద్యాలయాన్ని(Navodaya Vidyalayam) ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) మంగళవారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌(Dharmendra Pradhan)ను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణలో కొత్తగా 18 జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అయితే అందులో హనుమకొండ జిల్లా అంశం ప్రస్తావన లేదు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ఈ విషయాన్ని బండి సంజయ్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన బండి సంజయ్ సిద్దిపేటలోని హుస్నాబాద్ నియోజకవర్గం వంగరలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు తెలంగాణలోని ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాన్న ఏర్పాటు చేయాలని, అందులో భాగంగా సిరిసిల్ల జిల్లాలోనూ నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. బండి సంజయ్ వినతి పట్ల సానుకూలంగా స్పందించిన ధర్మేంద్ర ప్రదాన్ తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story