Bhatti Vikramarka:పిల్లలపై పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది: డిప్యూటీ సీఎం

by Jakkula Mamatha |
Bhatti Vikramarka:పిల్లలపై పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది: డిప్యూటీ సీఎం
X

దిశ, తెలంగాణ బ్యూరో: పిల్లలపై పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని, డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. వచ్చే ఏడాదికి సంబంధించి బడ్జెట్ అంచనాలు, అవసరాల ప్రతిపాదనలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులతో బుధవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం ఛాంబర్ లో బడ్జెట్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో ఫ్రీ బడ్జెట్ కు సంబంధించి పలు అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు రాష్ట్రంలో కోట్లాది మంది జీవితాలతో ముడిపడి ఉన్నాయన్నారు.

ఈ శాఖల ద్వారా మెరుగైన సేవలు రాష్ట్ర ప్రజలకు అందాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నతనంలోనే మంచి పోషక ఆహారాన్ని అందించడం ద్వారా వారికి ఉజ్వలమైన భవిష్యత్తును ప్రసాదించే అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం తెలిపారు. పిల్లల పై పెట్టే పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడంతో పాటు, ఎన్నో మార్పులను తీసుకొస్తుందని, నవతరాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.జువైనల్ హోమ్స్ లోని పిల్లల మానసిక పరిపక్వతకు క్రీడలు దోహదం చేస్తాయని,రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నుంచి స్పోర్ట్స్ కిడ్స్ అందిస్తామని డిప్యూటీ సీఎం అధికారులకు తెలిపారు.

స్పోర్ట్స్ కిట్స్ అందజేయాల్సిందిగా క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డికి సూచించారు. శిశు విహార్ లోని ప్రస్తుతం ఉన్న శిశువుల సంఖ్య వారికి అందుతున్న సౌకర్యాలు, వైద్య సదుపాయాలను మంత్రులు అడిగి తెలుసుకున్నారు.గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉన్న మహిళా ప్రాంగణాల పరిస్థితి పైన డిప్యూటీ సీఎం, మంత్రి సీతక్క ఆరా తీశారు. ప్రస్తుతం అవి నిరుపయోగంగా ఉన్నట్టు అధికారులు తెలియజేయడంతో వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేంద్రాల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులకు పెద్ద వ్యాపారాలు చేసుకునేందుకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాలని సూచించారు.

దివ్యాంగులకు స్వల్పకాలిక శిక్షణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాన్స్ జెండర్ ల సేవలను ప్రస్తుతం హైదరాబాద్ ట్రాఫిక్ కూడళ్లలో వినియోగిస్తున్నామని, ఈ ప్రయోగం విజయవంతం అయితే జిల్లా, మండల కేంద్రాల్లో వారి సేవలను వినియోగిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. ట్రాన్స్ జెండర్ క్లినిక్ సెంటర్లు దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే అందుబాటులో ఉన్నాయని మంత్రులు వివరించారు. కేంద్ర సౌజన్యంతో కొనసాగుతున్న పథకాలు, నిధుల విడుదల, భవిష్యత్తులో ఈ పథకాలకు సంబంధించిన ప్రణాళికల పై చర్చించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed