మాజీ MP వివేక్ రాజీనామాపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-11-01 14:15:13.0  )
మాజీ MP వివేక్ రాజీనామాపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీజేపీ వీడిపోతే తమకు వచ్చే నష్టమేమీ లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. వివేక్ తయారుచేసిన మేనిఫెస్టోపై చర్చలు జరుగుతున్నాయని, మార్పులు, చేర్పులు ఉంటాయని ఆయన వెల్లడించారు. ఢిల్లీలో బుధవారం బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు చేరిక అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

బీజేపీది క్యాడర్ బేస్డ్ పార్టీ అని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం పార్టీని వదిలిపోయారని ఆయన విమర్శలు చేశారు. రాష్ట్రంలో అనేక రకాల అవినీతి ఆరోపణలు ఉన్న, మాఫియా వ్యవస్థలను పెంచి పోషిస్తున్న వారికి కేసీఆర్ టికెట్స్ ఇచ్చారని, అదే ఎలాంటి ఆరోపణలు లేని, నిజాయితీగా పనిచేస్తున్న గిరిజన బిడ్డలకు ఇవ్వలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

మిగిలిపోయిన 66 మంది అభ్యర్థుల ఎంపికపై చర్చ జరుగుతోందని కిషన్ రెడ్డి తెలిపారు. నవంబర్ 3వ తేదీ నుంచి ప్రచారం ఉధృతంగా చేస్తామన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీపై పూర్తి వ్యతిరేకత ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే కర్ణాటకలో మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ గురించి అక్కడి రైతులు స్వయంగా తెలంగాణకు వచ్చి చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.

కర్ణాటకలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ‘తెలంగాణ ఎలక్షన్ టాక్స్’ పేరిట వసూళ్లకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. చెన్నై సహా వివిధ మార్గాల ద్వారా డబ్బులు తెలంగాణకు పంపిస్తున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఎలా దోపిడీ చేస్తుందో స్పష్టంగా కనిపిస్తోందని ఆయన వెల్లడించారు. జనసేనతో సీట్ల సర్దుబాటుపై చర్చ జరుగుతోందని, త్వరలోనే క్లారిటీ వస్తుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed