తక్షణమే 30% ఐఆర్ ప్రకటించాలి.. టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ షౌకత్ అలీ డిమాండ్

by Javid Pasha |
తక్షణమే 30% ఐఆర్ ప్రకటించాలి..  టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ షౌకత్ అలీ  డిమాండ్
X

దిశ , తెలంగాణ బ్యూరో : పదకొండవ వేతన సంఘం గడువు జూన్ నెలతో ముగిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దానిపై నిమ్మకు నీరెత్తినట్లు వ్వవహారించడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (టీఎస్పీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ షౌకత్ అలీ తీవ్రంగా ఖండించారు. గురువారం ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన టీఎస్పీటీఏ రాష్ట్ర సభ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తన ఉదాసీనతను విడనాడి, తక్షణమే 30% ఇంటీరియం రిలీఫ్ ను జులై నెలనుంచి అమలైయ్యే విధంగా మంజూరు చేయాలని, మూడు నెలల కాల వ్యవధి తో నివేదిక సమర్పించేలా పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కట్టుబట్టలతో విడిపోయిన పక్క రాష్ట్రంలో పన్నెండో వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ, ఆత్మగౌరవం కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో దాని ఊసే లేకుండా వేతన సవరణ సంఘం ఏర్పాటుపై ప్రభుత్వం నోరు మెదపకపోవడంలో మర్మమేమిటని అయన ప్రశ్నించారు.

ప్రతి ఐదు సంవత్సరాల తరువాత వేతన సవరణ సంఘం ఏర్పాటు పరిపాలన పరంగా జరిగే రొటీన్ ప్రక్రియ అని, కానీ దానిపై సంఘాలు నోరెత్తే వరకు ప్రభుత్వం ఉలుకు పలుకూ లేకుండా ఉండటం సమంజసం కాదన్నారు . తెలంగాణ పౌరుషం, ఆత్మగౌరవం అంటే సొంత రాష్ట్రంలో బానిసలై ఉండడమేనా అని ఆయన ప్రశ్నించారు. ఉపాధ్యాయ బదిలీలు ఆలస్యం అవుతున్నందున, ఎటువంటి వివాదం లేని పదోన్నతుల ప్రక్రియ ను వెంటనే ప్రారంభించాలని ఆయన కోరారు. 2003 డీఎస్సీ ద్వారా ఎంపిక కాబడిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు,ఉపాధ్యాయులు, కార్మికుల సహనాన్ని పరీక్షించడం ద్వారా గతంలో ప్రభుత్వాలు తగు మూల్యం చెల్లించాల్సి వచ్చిందని, ఒకసారి చరిత్ర ను తెలుసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

Advertisement

Next Story

Most Viewed