TSPSC లీకేజీ కేసు : నేడు హైకోర్టుకు సిట్ ​నివేదిక

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-11 03:08:44.0  )
TSPSC లీకేజీ కేసు : నేడు హైకోర్టుకు సిట్ ​నివేదిక
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్​అధికారులు మంగళవారం హైకోర్టుకు సీల్డ్​కవర్‌లో నివేదికను సమర్పించనున్నారు. నివేదికలో ఏయే అంశాలు ఉన్నాయనేది సస్పెన్స్‌గా మారింది. టీఎస్పీఎస్సీ బోర్డు నిర్వహించిన బిల్డింగ్​టౌన్​ప్లానింగ్​ఓవర్సీస్​పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం లీకైనట్టుగా అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో బోర్డు అసిస్టెంట్​సెక్రటరీ సత్యనారాయణ బేగంబజార్​పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ తేనెతుట్టె కదిపినట్లైంది.

సెంట్రల్​జోన్​టాస్క్​ఫోర్స్​అధికారులు, బేగంబజార్​పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దర్యాప్తులో ఏఈఈ సివిల్, జనరల్​స్టడీస్‌కు చెందిన ప్రశ్నపత్రాలు లీకైనట్లు స్పష్టమైంది. అసిస్టెంట్​సెక్రటరీ హోదాలో బోర్డు కార్యదర్శి అనితా రాంచంద్రన్​వద్ద సెక్రటరీగా పనిచేస్తున్న ప్రవీణ్, ఔట్​సోర్సింగ్‌పై డేటా ఎంట్రీ ఆపరేటర్‌ గా పనిచేస్తున్న రాజశేఖర్​రెడ్డితో కలిసి ఈ ప్రశ్నపత్రాలను అపహరించినట్టు తేలింది. దీంతో వీరిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా గ్రూప్-1 ప్రిలిమ్స్​ప్రశ్నపత్రాన్ని కాజేసినట్లు నిందితులు వెల్లడించారు.

బోర్డులోని కాన్ఫిడెన్షియల్​రూం ఇన్‌చార్జిగా పని చేస్తున్న శంకర్​లక్ష్మి డైరీ నుంచి కంప్యూటర్లకు సంబంధించిన పాస్​వర్డులు, ఐపీ అడ్రసులు చోరీ చేసిన ప్రవీణ్ రాజశేఖర్​రెడ్డి ఇచ్చాడు. వాటి సహాయంతో ఇద్దరూ కలిసి ప్రశ్నపత్రాలు అపహరించారు. ఏఈఈ సివిల్, జనరల్​నాలెడ్జ్​పేపర్లను తనకు మూడేళ్లుగా పరిచయం ఉన్న గురుకుల టీచర్​రేణుకకు అమ్మాడు. ఈ క్రమంలో పోలీసులు రేణుకను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వాటిని తన భర్త డాక్యానాయక్‌కు ఇచ్చినట్లు చెప్పింది. ఏఈఈ సివిల్, జనరల్​నాలెడ్జి ప్రశ్నపత్రాలను అమ్మిన రేణుక, డాక్యానాయక్ అతని బావమరిది రాజేశ్వర్​నాయక్, తిరుపతయ్యతోపాటు వీటిని కొన్న ఏడుగురిని అరెస్టు చేశారు.

గ్రూప్-1 ప్రిలిమ్స్​ప్రశ్నపత్రానికి సంబంధించి సిట్​అధికారులు నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో బోర్డు ఉద్యోగులైన ప్రవీణ్, షమీమ్, రమేశ్, సురేశ్​ఉన్నారు. వీరితోపాటు న్యూజిలాండ్‌లో ఉంటున్న రాజశేఖర్​రెడ్డి బావ ప్రశాంత్​రెడ్డి ఇక్కడికి వచ్చి పరీక్ష రాసినట్టుగా విచారణలో తెలిసినా ఇంకా నిర్ధారణ కాలేదు. విచారణకు రావాలని రెండుసార్లు నోటీసులిచ్చినా ప్రశాంత్​రెడ్డి రాలేదు. వందకు పైగా మార్కులు వచ్చిన అభ్యర్థులను విచారించగా వీరిలో ఏ ఒక్కరికి కూడా గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం అందలేదని అధికారులు నిర్ధారణకు వచ్చారు. డీఏవో ప్రశ్నపత్రం లీక్ కేసులో లౌకిక్‌తోపాటు ఆయన భార్య సుస్మితను అరెస్టు చేశారు. ప్రవీణ్ నుంచి రూ.6 లక్షలకు ప్రశ్నపత్రం కొన్నట్లు స్పష్టమైంది. అన్ని వివరాలను పొందుపరుస్తూ తయారు చేసిన నివేదికను సిట్​అధికారులు మంగళవారం హైకోర్టుకు సమర్పించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed