పట్టించుకోరేం..పది రోజులుగా రాకపోకలు బంద్

by Jakkula Mamatha |
పట్టించుకోరేం..పది రోజులుగా రాకపోకలు బంద్
X

దిశ, మిర్యాలగూడ టౌన్:బంగాళ ఖాతంలో వాయుగుండం వలన వర్షాలతో వరదలు..వరదలకు కోతలకు గురైన రోడ్డు వెరసి బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వేల సంఖ్యలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ఆర్ అండ్ బి అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకునే వారు కరువైయ్యారు. ఇది మూడు నియోజకవర్గాలను కలుపుతూ ఉన్న ప్రధాన రహదారి అయిన మిర్యాలగూడ భీమారం మీదుగా సూర్యాపేట వెళ్లే రోడ్డు పరిస్థితి.

వరదలు తగ్గిన నడవని బస్సులు..

వరదలు తగ్గుముఖం పట్టి వారం రోజులు అవుతున్న ఇంకా బస్సులను నడపడం లేదు. సూర్యాపేట నుంచి భీమారం మీదుగా మిర్యాలగూడ కు తక్కువ దూరం ..తక్కువ ప్రయాణ సమయం కావడంతో ఈ రూట్లో ఎక్కువ మంది ప్రయాణం చేస్తారు. రోజుకు సూర్యాపేట డిపో నుంచి సుమారు 24 ట్రిప్పుల బస్సులు తిరుగుతుంటాయి. అంతేకాకుండా ప్రభుత్వం ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో రోజుకు రూ.1 లక్ష ఆదాయం కూడా వస్తుంది. అయితే అధిక వర్షాల వలన వేములపల్లి మండలమ లక్ష్మి దేవి గూడెం, కేతేపల్లి మండలం బీమారం వద్ద మూసీ ప్రవాహం ఆగస్టు 1 నుంచి నేటి వరకు బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనివల్ల సూర్యాపేట డిపోకు ఆర్థికంగా నష్టం జరుగుతుంది. దీనికి తోడు బస్సుల సౌకర్యం నిలిచిపోవడంతో వేములపల్లి ,కేతేపల్లి ,సూర్యాపేట మండలం లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దెబ్బతిన్న డైవర్షన్ రోడ్డు..

బీమారం మిర్యాలగూడ రోడ్డులో వేములపల్లి మండలం గోదాం బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా సంబంధిత నిర్మాణ కాంట్రాక్టర్ డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేశారు. ఆ ప్రదేశంలో రోడ్డు బలహీనంగా ఏర్పాటు చేయడంతో వాహనాలు దిగబడి వాహనాలకు ఇబ్బంది కలుగుతుంది. ఆదివారం ఎరువుల లోడ్ తో వెళ్తున్న లారీ దిగబడి ఉదయం నుంచి సాయంత్రం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. ఒక్క ఫోర్ వీలర్ వాహనం వేళ్లే అంతలోనే రోడ్డు ఏర్పాటు చేశారని వాహనదారులు కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల సూర్యాపేట డిపో నుంచి బస్సులను నడుపుటలో డిపో అధికారులు జాప్యం చేస్తున్నారు. దీని ఫలితంగా పది రోజుల నుంచి బస్సుల రాకపోకలు నిలిపి వేశారు. ఈ డైవర్షన్ రోడ్డు వద్ద తాగునీటి పైపులైన్లు కూడా లీకేజీ నీరు నిల్వ ఉండి రోడ్డు దెబ్బతిన్నది. దీనిని తక్షణమే సంబంధిత అధికారులు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చొరవ తీసుకొని డైవర్షన్ రోడ్డు బాగు చేయించి బస్సుల రాకపోకలు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story