ఆ మూడు స్థానాలపై వీడిన ఉత్కంఠ.. ప్రకటనకు ముందే నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు

by Shiva |   ( Updated:2024-04-23 14:57:13.0  )
ఆ మూడు స్థానాలపై వీడిన ఉత్కంఠ.. ప్రకటనకు ముందే నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ పెండింగ్ స్థానాలపై ఉత్కంఠ వీడింది. ఈ మేరకు అధిష్టానం అధికారికంగా ప్రకటన చేయకముందే అనూహ్యంగా కీలక నేతలు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ ఇప్పటి వరకు 14 స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించింది. అయితే, కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం ఎంపీ అభ్యర్థులపై అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రకటనకు ముందే ఆ మూడు స్థానాల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు కీలక నేతలు ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత వెలిచాల రాజేందర్ నామినేషన్ సమర్పించారు. అదేవిధంగా ఖమ్మం నుంచి పొంగులేటి వియ్యంకుడు రామసహాయం రఘురామి రెడ్డి, హైదరాబాద్ నుంచి సమీర్ ఉల్లాఖాన్‌‌ను తమ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, అందులో ఎవరికి ఏఐసీసీ ట్విస్ట్ ఇస్తుందో.. ఎవరికి బీఫాంలు ఇస్తుందో తేలాల్సి ఉంది.

హాట్ సీటు ఖమ్మం..

ఖమ్మం ఎంపీ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అక్కడ క్లీన్ స్వీప్ చేయడంతో ఎవరు ఎంపీగా పోటీ చేసినా.. గెలుపు పక్కా అనే ధీమా అందరిలోనూ వ్యక్తం అవుతోంది. దీంతో ఆ సీటు హాట్ సీటుగా మారింది. దీంతో ఆ టికెట్ ఎలాగైనా తమ వారికే ఇప్పించుకోవాల‌ని జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన భార్య నందిని కోసం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు ప్రసాద్‌రెడ్డి కోసం, మ‌రో మంత్రి తుమ్మల నాగేశ్వర‌ రావు త‌న కుమారుడి కోసం ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. అయితే, ముగ్గురు మంత్రుల‌లో ఎవరికి సీటు ఇచ్చినా.. అంతర్గతంగా పార్టీ ప్రయోజనాలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. దీంతో ఖమ్మం అభ్యర్థి విషయంలో ప్రత్యామ్నాయ అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తోంది.

Advertisement

Next Story