'ముందస్తు' ఎన్నికల ఏర్పాట్లు షురూ!

by Nagaya |   ( Updated:2023-01-21 02:16:40.0  )
ముందస్తు ఎన్నికల ఏర్పాట్లు షురూ!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముందస్తు ఎన్నికలు వస్తాయా రావా అనే సందేహాలు ఎలా ఉన్నా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం మాత్రం కార్యాచరణ మొదలుపెట్టింది. కాంగ్రెస్, బీజేపీ లాంటి విపక్ష పార్టీలన్నీ ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాతో ఎక్సర్‌సైజ్ మొదలుపెట్టాయి. ఎప్పుడొచ్చినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు ఉండదని, షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని అధికార పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఏ పార్టీ అభిప్రాయాలు ఎలా ఉన్నా సీఈఓ ఆఫీస్ మాత్రం ఇంటెర్నల్‌గా కసరత్తు మొదలుపెట్టింది. మెషినరీని, సిబ్బందిని సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టింది. వచ్చే నెల నుంచి ఎన్నికల ప్రిపరేషన్ యాక్టివిటీస్‌ను ముమ్మరం చేయనున్నది.

ఇప్పటికే రాష్ట్రం దగ్గర తగినంత సంఖ్యలో ఈవీఎంలు ఉన్నట్లు వెల్లడించిన ఓ అధికారి వచ్చే నెలలో ఢిల్లీలోని ఎన్నికల సంఘం నుంచి వీవీ ప్యాట్‌లు వస్తాయని పేర్కొన్నారు. అవి రాగానే ఫిజికల్ వెరిఫికేషన్ చేసి చెకింగ్ ప్రక్రియను కూడా పూర్తిచేస్తామన్నారు. ప్రస్తుతం సీఈఓ ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బంది సరిపోరని, అదనంగా ఔట్‌సోర్సింగ్ లేదా కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకోవాల్సి ఉంటుందని వివరించారు. డాటా ఎంట్రీ ఆపరేటర్ మొదలు వివిధ స్థాయిల్లో మ్యాన్ పవర్ అవసరమవుతుందన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం రెవెన్యూ సిబ్బందిని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాశామని, ఎలక్షన్స్ నిర్వహణలో అనుభవం ఉన్నవారిని కేటాయించాల్సింగా స్పెషల్ రిక్వెస్టు పంపించినట్లు తెలిపారు.

సాధారణంగా ఎన్నికలు జరగడానికి ఒక ఏడాది కాలం ముందు నుంచే కసరత్తు మొదలవుతుందని, అందులో ఫస్ట్ స్టెప్‌గా ఓటర్ల జాబితాను రిలీజ్ చేసినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెవెన్యూ సిబ్బంది అందుబాటులోకి వచ్చిన వెంటనే ట్రెయినింగ్ షెడ్యూలు ఖరారు చేస్తామన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి దాదాపు ఇరవై లక్షల మంది ఓటర్లు పెరిగారు. అప్పుడు 2.80 కోట్ల మంది ఓటర్లకు 32,184 పోలింగ్ బూత్‌ల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే ఈసారి అదనంగా ఓటర్లు చేరినందున సుమారు 1500 మేర పోలింగ్ బూత్‌లు పెరగనున్నాయి. దీనికి తోడు ఎన్నికల నిర్వహణకు వినియోగించే సిబ్బందికి ప్రస్తుతం ఉన్న బుద్ధ భవన్ సరిపోయేలా లేనందున మరో చోట తగిన భవనాన్ని ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సీఈఓ ఆఫీస్ రిక్వెస్టు చేసింది.

ఎన్నికల సంవత్సరం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం కొత్త బడ్జెట్‌లో ప్రత్యేకంగా కొంత కేటాయింపు చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి చివర్లో బడ్జెట్ సమర్పించడానికి కసరత్తు ముమ్మరమైంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఈఓ ఆఫీస్ కొత్తగా కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, మెమొరీ కోసం విడి హార్డ్ డిస్కులు, కాపీయింగ్ మెషీన్లను సమకూర్చుకోవడంపై ఫోకస్ పెట్టింది. రెండు మూడు వారాల్లో వాటిని సమకూర్చుకుని అవసరమైన అదనపు సిబ్బందిని సైతం ఎన్నికలు పూర్తయ్యే వరకు నియమించుకోవాలనుకుంటున్నది. ఫిబ్రవరి మొదటివారంకల్లా మెషినరీ సమకూరితే ఓటర్ల జాబితాకు అనుగుణంగా నియోజకవర్గాలవారీ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలనుకుంటున్నది.

రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి చివరి వారంలోనే ఉండొచ్చని అంచనా. ఈ సెషన్ పూర్తయిన తర్వాత అటు ముందస్తుపై సందేహాలు తొలగిపోవడంతో పాటు ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కూడా వేగవంతమవుతుంది. సీఈఓ ఆఫీసు తరఫున ప్రాథమిక స్థాయిలో ఏర్పాట్లు పూర్తయితే ఆ తర్వాత ప్రభుత్వంవైపు నుంచి, కేంద్ర ఎన్నికల సంఘం గైడెన్సుకు అనుగుణంగా మరింత స్పీడ్ అవుతుంది.

Also Read...

50 సీట్లపై గురి..! కాంగ్రెస్ స్కెచ్ ఫలించేనా..?

Advertisement

Next Story

Most Viewed