ఆధునిక హంగులతో చర్లపల్లి రైల్వే స్టేషన్

by Sridhar Babu |
ఆధునిక హంగులతో చర్లపల్లి రైల్వే స్టేషన్
X

దిశ, మేడ్చల్ బ్యూరో : మహానగర సిగలో చర్లపల్లి రైల్వే స్టేషన్ మణిహారమైంది. అత్యాధునిక హంగులు, సకల వసతులతో నిర్మించిన రైల్వే స్టేషన్ ఎయిర్ పోర్టును తలపిస్తోంది. త్వరలోనే రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుండడంతో పరిసర ప్రాంతాల్లో భూములకు భలే డిమాండ్ ఏర్పడింది. కాలుష్య రహిత, నివాసయోగ్య ప్రాంతం కావడంతో ఇక్కడ భూములను కొనుగోలు చేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఉప్పల్, కాప్రా, కీసర, ఘట్ కేసర్, బోడుప్పల్ తదితర ప్రాంతాల రూపు రేఖలు మారిపోనున్నాయి.

రూ. 430 కోట్లతో...

మహానగరంలో ప్రస్తుతం ఉన్న నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకు తోడు త్వరలో మరో భారీ రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. చర్లపల్లిలో రూ.430 కోట్ల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో రైల్వే టెర్మినల్ ను నిర్మించారు. ఈ టెర్మినల్ రాకతో నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ లపై ప్రయాణికుల ఒత్తిడి గణనీయంగా తగ్గిపోనుంది.

ఇక్కడి నుంచే ప్రయాణికులు నగరం నలు మూలలకు సులువుగా చేరుకునే వీలుంది. విమానాశ్రయాన్ని తలపించేలా సకల సౌకర్యాలతో నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే నడుస్తున్న రైళ్లకు అదనంగా కొత్తగా మరో 25 జతల రైళ్లు ఇక్కడి నుంచి పరుగులు తీయనున్నాయి. లక్షల్లో ప్రయాణికులు రాకపోకలు సాగించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నారు. ఈ రైల్వే స్టేషన్ రాకతో చర్లపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రగతి పరుగులు తీయనుంది.

మోడ్రన్ రైల్వే టెర్మినల్...

రెండు అంతస్తులతో సర్వం సిద్దమైన చర్లపల్లి స్టేషన్ వాస్తవానికి ఒక మోడ్రన్ టెర్మినల్ గా ఉంటుంది. ఇందులో 9 ఫ్లాట్ ఫాంలు, 9 లిప్టులు, 5 ఎస్కలేటర్లు, రెండు పుట్ ఓవర్ బ్రిడ్జిలు ఇప్పటికే సిద్దమయ్యాయి. ఇప్పటికే 5 ఫ్లాట్ ఫాంలు పనిచేస్తుండగా, కొత్తగా మరో 4 ఫ్లాట్ ఫాంలను అందుబాటులోకి తెస్తున్నారు. కొన్ని చిన్న చిన్న పనులు మినహా చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. రైల్వే స్టేషన్ కు లింకు రహదారులను త్వరిత గతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది. స్టేషన్ కు సులభంగా చేరుకున్నందుకు రోడ్డు విస్తరణ చేపట్టింది. ఆరు ఎక్స్ ప్రెస్ రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ అనుమతులు ఇచ్చింది. 12 రైళ్లు స్టేషన్ లో ఆగేందుకు బోర్డు అనుమతులు జారీ చేసింది.

ఎంఎంటీఎస్ తో అనుసంధానం..

చర్లపలి రైల్వే టెర్మినల్ లో ఎంఎంటీఎస్ రైళ్ల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. టెర్మినల్ రెండున్నర కిలో మీటర్ల దూరంలో హెచ్ బీ కాలనీ ఎంఎంటీఎస్ స్టేషన్ సిద్దమైంది. ఇక్కడి నుంచి త్వరలో యాదగిరి గుట్టకు ఎంఎంటీఎస్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు. ఇది వినియోగంలోకి వస్తే చర్లపల్లి నగరంలోని పలు ప్రాంతాలకు ఎంఎంటీఎస్ ద్వారా త్వరగా చేరుకునే వీలుంది.

భూములకు భలే డిమాండ్...

చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుండడంతో అందరి చూపు ఈశాన్య తూర్పు ప్రాంతంపై పడింది. కాప్రా శివార్లలోని భూముల ధరలకు రెక్కాలొచ్చాయి. పారిశ్రామిక వాడలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో ఈ ప్రాంతం ఇప్పటికే అభివృద్ది చెందింది. చర్లపల్లి, కుషాయిగూడ, మల్లాపూర్, నాచారం ప్రాంతాలు పారిశ్రామిక వాడలతో విస్తరించాయి. వందల సంఖ్యలో కాలనీలు ఏర్పడడంతో స్థలాలు దొరకడం కష్టమైపోయింది.

స్థలాలు ఖరీదు కావడంతో బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. షాపింగ్ మాల్స్, కళాశాలలు పుట్టుకువస్తున్నాయి. చర్లపల్లి స్టేషన్ కు పక్కనే మౌలాలి, హెచ్ బీ కాలనీ రైల్వే స్టేషన్లు ఉండడంతో ఈ ప్రాంతంలో అపార్ట్ మెంట్లకు భారీ డిమాండ్ ఉంది. ఏపీతో పాటు ఉత్తర, దక్షిణ రాష్ట్రాల ప్రజలే కాకుండా విదేశాల్లో ఉన్నవారు కూడా స్తిరాస్తులు కొనుగోలు చేస్తున్నట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారి పురుషోత్తం తెలియజేశారు.

Advertisement

Next Story