‘పది’ పరీక్ష కేంద్రంలో నిబంధనలు ఉల్లంఘించిన సిట్టింగ్ స్క్వాడ్..

by Kalyani |
‘పది’ పరీక్ష కేంద్రంలో నిబంధనలు ఉల్లంఘించిన సిట్టింగ్ స్క్వాడ్..
X

దిశ, జడ్చర్ల: పరీక్షల సమయాల్లో ప్రశ్నాపత్రాలు లీకేజీల వ్యవహారం విద్యావ్యవస్థకు సవాలుగా మారుతుంటే.. సంబంధిత పరీక్ష నిర్వహణ సిబ్బంది, అధికారులు సైతం పొరపాట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జడ్చర్ల మండలంలోని కావేరమ్మపేట పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారం హిందీ పరీక్ష నిర్వహించారు. కాగా పరీక్షా కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్ గా లక్ష్మీనారాయణ విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం పరీక్షా కేంద్రాన్ని పరిశీలించడానికి జిల్లా విద్యాధికారి డీఈఓ యాదయ్య కావేరమ్మ పేట పాఠశాలకు వచ్చారు. కాగా ఆ సమయంలో సిట్టింగ్ స్క్వాడ్ వద్ద సెల్ ఫోన్ ఉండడాన్ని డీఈవో గుర్తించారు.పరీక్షా కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్ గా వ్యవహరిస్తున్న జడ్చర్ల తహసీల్దార్ లక్ష్మీనారాయణ వద్ద సెల్ ఫోన్ ఉండడంతో పాటుగా ఫోన్ ఆన్ లో ఉండడంతో డీఈఓ యాదయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ తహసీల్దార్ ను మందలించారు.

ఈ ఘటనపై డీఈఓ యాదయ్యను వివరణ కోరగా జడ్చర్ల కావేరమ్మ పేట ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షా కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్ గా విధులు నిర్వహిస్తున్న జడ్చర్ల తహసీల్దార్ లక్ష్మీనారాయణ ఫోన్ వాడుతున్న విషయం వాస్తవమేనని, తాను సందర్శనకు వెళ్లిన సమయంలో ఆ విషయం తన దృష్టికి రావడంతో తహసీల్దార్ ను మందలించానని ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కు, జిల్లా ఉన్నత అధికారుల శాఖకు ఫిర్యాదు చేసినట్లు డీఈవో తెలిపారు. సోమవారం ప్రారంభమైన పదో తరగతి తెలుగు పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతుండగా, జడ్చర్ల పట్టణంలో పరీక్షా కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్ ఫోన్ వాడడంపై చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story