Ex minister Srinivas Goud : కులగణన అధికారం కేంద్రానిదే : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Y. Venkata Narasimha Reddy |
Ex minister Srinivas Goud : కులగణన అధికారం కేంద్రానిదే : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, వెబ్ డెస్క్ : కులగణన(caste census) చేసే అధికారం కేంద్ర ప్రభుత్వాని(Central Govt)కే ఉందని, కేంద్రం తక్షణమే కుల గణన చేపట్టాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former minister Srinivas Goud) డిమాండ్ చేశారు. ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆరెఎస్ఎస్, బీజేపీలు కూడా ఓబీసీలకు అన్యాయం జరిగిందంటున్నాయని, ఇన్నేళ్ళుగా ఆ రెండు పార్టీలు, వారి కూటములే దేశాన్ని పాలించాయని, మరి ఓబీసీలకు ఆ పార్టీలు ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నించారు. బ్రిటీష్ కాలంలో కుల గణన జరిగిందని, నాటి నుంచి జనాభా లెక్కలు మినహా ఓబీసీల లెక్కల సేకరణ చేయలేదన్నారు. ఓబీసీ లెక్కలు బయటపడితే మాకు అధికారం దూరమవుతదన్న భయానికి ఆ జాతీయ పార్టీలు గురైనందునా కులగణనపై వెనుకంజ వేశాయన్నారు. 65 శాతం ఉన్న ఓబీసీల కులగణన ఎంతో తెలియదన్నారు. బీహార్, మహారాష్ట్ర ఓబీసీ కులగణన చేస్తామంటే కేంద్రం ఒప్పుకోలేదని, బీహార్ లో 63.1 శాతం ఓబీసీలు ఉన్నట్లుగా కులగణనలో తేలిందన్నారు.

దేశంలో అన్ని వర్గాల లెక్కలు ఉండాల్సిందేనని, కులగణన చేసే అధికారం రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఓబీసీలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేంద్రంతో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిందని, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని, బీసీ డిక్లరేషన్ వలనే బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల విషయంలో ఏదో సాకుతో తప్పించుకునే ప్రయత్నం చేయవద్దన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణనపై ముందుకు వెళ్ళాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జన గణన, కుల గణనలను మహిళా రిజర్వేషన్ అమలుకు ముందే పూర్తి చేసి చట్ట సభలలో కూడా ఓబీసీ లెక్కల మేరకు రిజర్వేషన్ కల్పించాలన్నారు. సామాజిక, రాజకీయ సమానతకు , ఆర్ధిక అసమానతల నిర్మూలనకు కుల గణన అవసరమన్నారు.

Advertisement

Next Story