- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాష్ట్ర గీతానికి తుది మెరుగులు.. ఆవిష్కరణ ముహూర్తం ఫిక్స్!
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పదేండ్లకు రాష్ట్ర గీతం ఉనికిలోకి వస్తోంది. కవి, వాగ్గేయకారుడు అందెశ్రీ కలం నుంచి రూపుదిద్దుకున్న ఈ గేయం దాదాపు ఒకటిన్నర నిమిషాల నిడివితో ఉండనున్నది. గతంలో జయ జయహే తెలంగాణ గేయానికి పలు మార్పులు చేసి రాష్ట్ర గీతంగా రూపొందించారు అందెశ్రీ. ఈ గేయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వినిపించగా, ఆయన సూచనల మేరకు మరికొన్ని మార్పులు జరగనున్నాయి. సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కంపోజింగ్ చేస్తున్న ఈ గేయం ఈ వారంలో ఫైనల్ కానున్నది. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి కంప్లీట్ కానున్నది. వచ్చే నెల 2న రాష్ట్ర అవతరణ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం గ్రాండ్‌గా నిర్వహించి అదే వేదిక మీద తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ చేతుల మీదుగానే దీన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు అందెశ్రీ రాసిన ఈ గేయంలో ఐదారు చరణాలు ఉన్నా అందులో రెండు మాత్రమే రాష్ట్ర గేయానికి అనుగుణంగా మార్చి ఒకటిన్నర నిమిషాల నిడివితో ఉండేలా మార్పులు చేర్పులు చేస్తున్నారు. గేయాన్ని ముఖ్యమంత్రికి వినిపించగా సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు కొన్ని సూచనలు చేసినట్లు తెలిసింది. రాష్ట్ర గేయాన్ని రూపొందించడంతో పాటు రాష్ట్ర చిహ్నం (లోగో)లోనూ తగిన మార్పులు చేస్తామని, తెలంగాణ తల్లి విగ్రహంలోనూ సవరణలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలోనే వ్యాఖ్యానించారు. దానికి తగినట్లుగా లోగో రూపకల్పనపై కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర గేయం దాదాపుగా కొలిక్కి వచ్చింది. ఈ వారంలోనే అది ఫైనల్ అవుతుందని సీఎం సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఈ వారం ఢిల్లీకి సీఎం, మంత్రుల బృందం..
రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియాగాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఘనంగా సన్మానించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు ఆహ్వానం పలకడానికి ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు ఈ వారమే ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రం ఏర్పడిన పదేండ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడమే కాకుండా అమరవీరుల కుటుంబాలను ఆహ్వానించాలని భావిస్తోంది.
కేసీఆర్ క్రెడిట్‌కు చెక్ పెట్టే వ్యూహం..
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా కేసీఆర్‌కు క్రెడిట్ అంటగట్టేలా గులాబీ నేతలు ప్రసంగాలు చేశారు. స్వయంగా కేసీఆర్ కూడా తన వల్లనే రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని చెప్పుకుంటున్నారు. చివరకు ఇది కేసీఆర్‌ను తెలంగాణ జాతిపితగా, రాష్ట్ర నిర్మాతగా కీర్తించడాన్ని కూడా కాంగ్రెస్ పలు సందర్భాల్లో తప్పుపట్టింది. అమరవీరుల త్యాగాలను తక్కువ చేయడమేనని వ్యాఖ్యానించింది. తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం కారణంగానే రాష్ట్రం ఏర్పాటైందని, రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి నష్టం కలుగుతుందని ముందే గ్రహించినా తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు మాట తప్పకుండా ఇచ్చారని వ్యాఖ్యానించింది. ఇప్పుడు సోనియాగాంధీని చీఫ్ గెస్టుగా ఆహ్వానించడం ద్వారా కేసీఆర్ క్రెడిట్‌కు చెక్ పెట్టవచ్చన్నది కాంగ్రెస్ భావన.
ఎలక్షన్ కమిషన్‌కు స్పెషల్ రిక్వెస్టు..
రాష్ట్ర అవతరణ వేడుకలు జూన్ 2న ఘనంగా జరపాలని నిర్ణయించినా లోక్‌సభ ఎలక్షన్ కోడ్ అప్పటికీ అమల్లో ఉండడంతో ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సాధారణ పరిపాలన శాఖ ద్వారా లేఖ రాసి పర్మిషన్ తెప్పించుకోవాలని భావిస్తోంది. సోనియాగాంధీని ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్లినప్పుడే ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను కలిసి వివరించి అనుమతి పొందాలని భావిస్తున్నది. ఎలాగూ తెలంగాణలో పోలింగ్ ముగియడంతో పాటు దేశవ్యాప్తంగానే చివరి దశ పోలింగ్ జూన్ 1న ముగుస్తున్నందున పొలిటికల్ ప్రభావం ఉండదనే అంశాన్ని కూడా ఆ లేఖలో ప్రస్తావించనున్నది. ఎగ్జిట్ పోల్స్ వెల్లడిపైనా ఆంక్షలు లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి మాత్రం అడ్డంకులు ఎందుకు ఉండాలన్న అంశాన్ని కూడా నొక్కిచెప్పనున్నట్లు సమాచారం.
పరేడ్ గ్రౌండ్.. లేదంటే ఎల్బీ స్టేడియం
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు దాదాపు పది వేల మందితో పాటు అమరవీరుల కుటుంబాలను కూడా ఆహ్వానిస్తున్నందున వేడుకలను పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. గ్రౌండ్ పర్మిషన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. పర్మిషన్ వస్తే అక్కడే నిర్వహిస్తామని.. లేదంటే ఎల్బీ స్టేడియంలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. ఒకవేళ కేంద్ర ఎలక్షన్ కమిషన్ నుంచి సానుకూల స్పందన రాకపోతే ప్రత్యామ్నాయంగా ఎలా నిర్వహించాలనే ప్లాన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.