కోయపోచగూడా సాగు భూములకు హక్కు పత్రాలివ్వాలి

by Javid Pasha |
కోయపోచగూడా సాగు భూములకు హక్కు పత్రాలివ్వాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కోయపోచగూడ గ్రామ ఆదివాసీ నాయకపోడ్‌ పేదల సాగులో ఉన్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆదివారం సీపీఎం రాష్ట్ర కమిటీ నేతలు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు లేఖ రాశారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి నాగయ్య, పి ఆశయ్య మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. దండేపల్లి మండలం కోయ పోచగూడెంలో 52 నాయకపోడ్‌ ఆదివాసీ కుటుంబాలు మాకులపేట శివారులో 150 ఎకరాల విస్తీర్ణం గల భూమిని 2002 నుంచి సాగు చేస్తున్నారని తెలిపారు. ఆ భూమిని సాగు చేయకూడదని ఫారెస్ట్‌ అధికారులు పోలీసులతో కలిసి గ్రామంపై దాడి చేసి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు.

మహిళలని కూడా చూడకుండా 12మందిపై అక్రమ కేసులు పెట్టి ఆదిలాబాద్‌ జైలులో వేశారని చెప్పారు. జైలు నుంచి విడుదలై తిరిగి అదే భూమిని సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పోడు భూముల సర్వే చేసి హక్కు పత్రాలు పంపిణీ చేస్తామని సర్వే పనులు ప్రారంభించిందన్నారు. ఆ సర్వేలో ఈ గ్రామాన్ని చేర్చలేదన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ, ఇక్కడే నివసిస్తున్న గిరిజనులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారని వివరించారు. గ్రామ శివారు భూస్వాములు ఈ భూమిని గిరిజనులకు దక్కకుండా తాము స్వాధీనం చేసుకోవాలని అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. పేదల సాగులో ఉన్న భూములను సర్వే చేయించి, పట్టాలిప్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.


Advertisement

Next Story

Most Viewed