TG Govt.:పండుగ పూట విద్యార్థులకు గుడ్ న్యూస్.. యూనిఫామ్స్ బాధ్యత ‘టెస్కో’కు

by Shiva |
TG Govt.:పండుగ పూట విద్యార్థులకు గుడ్ న్యూస్.. యూనిఫామ్స్ బాధ్యత ‘టెస్కో’కు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు యూనిఫామ్స్ రెడీ అయ్యేలా విద్యాశాఖ ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే క్లాత్ సరఫరా చేయాలని టెస్కోకు బాధ్యత అప్పగించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల్లో సుమారు 21 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి రెండు జతల యూనిఫామ్ కుట్టాలంటే 1.05 కోట్ల మీటర్ల వస్త్రం అవసరమవుతుంది. దీంతో సిరిసిల్లలోని చేనేత సహకార సొసైటీలకు 65 లక్షల మీటర్లు, టెక్స్ టైల్ పార్క్ లో పనిచేసే వారికి 40 లక్షల మీటర్ల క్లాత్ తయారు చేసి ఇవ్వాలని టెస్కో ఆర్డర్ ఇచ్చింది.

వస్త్ర నాణ్యత, మన్నిక విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. మొదటి జత క్లాత్ మార్చిలో, రెండో జత క్లాత్ ను మే రెండో వారంలోగా సప్లయ్ చేయాల్సి ఉన్నది. దీంతో నేతన్నలతో అదనపు సమయాల్లో పని చేయించైనా అనుకున్న టైం కంటే ముందుగానే క్లాత్ ను అందించేలా టెస్కో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు టెస్కో ద్వారానే వస్త్రాలను కొనుగోలు చేయాలని గతంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదేశించారు. 2025-26 విద్యా సంవత్సరానికి అవసరమయ్యే వస్త్ర ఇండెంట్ ను టెస్కో కు ముందుగానే ఇవ్వాలని సూతించారు. నేత కార్మికులకు నూలు కొనుగోలు, వస్త్ర ఉత్పత్తి, టెస్కో వారికి డయింగ్, ప్రాసెసింగ్ కు మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతున్న నేపథ్యంలో.. ఆరు నెలల ముందే టెస్కోకు ఇండెంట్ సమర్పిస్తే.. సకాలంలో సప్లయ్ చేయడానికి వీలవుతుందని చెప్పారు. ఆ ప్రకారమే విద్యాశాఖ టెండర్ల ప్రక్రియ వేగంగా పూర్తి చేసి టెస్కోకు పనులను అప్పగించింది.

రెండు నెలలు.. కుట్టు పనులు

టెస్కో నుంచి క్లాత్ రాగానే కుట్టు పనులను సైతం చేపట్టేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. 21 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల స్కూల్ యూనిఫాంలు అందించాలంటే టైలర్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. గతంలో స్థానిక టైలర్లకు పనులు అప్పజెప్పగా, 2023-24 విద్యా సంవత్సరానికి యూనిఫాం కుట్టే బాధ్యతలను మహిళా సహకార సంఘాలకు అప్పగించారు. కాగా, ఈసారి పాఠశాల విద్యా శాఖ ఈ పనులను ఎవ్వరికి అప్పగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే గతంలో మహిళా సంఘాలకు ఈ పనులు అప్పజెప్పడంతో 30 వేల మహిళా సంఘాలకు ఉపాధి లభించింది.

Next Story

Most Viewed