Civils students death: ఢిల్లీలో తెలంగాణ విద్యార్థిని మృతి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

by Ramesh N |   ( Updated:2024-07-28 13:48:39.0  )
Civils students death: ఢిల్లీలో తెలంగాణ విద్యార్థిని మృతి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌ సెల్లార్‌లో వరద నీళ్లు నిండి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశమంతా చర్చనీయాంశమైంది. తెలంగాణకు చెందిన యువతి తానియా సోని (25) ముగ్గురిలో ఒకరు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన చేశారు. ఢిల్లీలోని ఐఎఎస్ కోచింగ్ అకాడమీలో జరిగిన దుర్ఘటనపై తెలంగాణ రెసిడెంట్ కమిషనర్‌తో మాట్లాడటం జరిగిందన్నారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు అభ్యర్థులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. సింగరేణిలో మేనేజర్‌గా పని చేస్తున్న బీహార్ వాసి విజయ్ కమార్ కుమార్తె తానియా సోని కూడా మృతి చెందిన వారిలో ఉన్నారని వెల్లడించారు. విజయ్ కుమార్‌తో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కావాల్సిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా రెసిడెంట్ కమిషనర్‌ను ఆదేశించడం జరిగిందన్నారు.

కాగా, సెంట్రల్‌ ఢిల్లీలోని ఓల్డ్‌ రాజిందర్‌ నగర్‌లోగల రావుస్‌ సివిల్‌ సర్వీస్‌ కోచింగ్‌ సెంటర్‌ సెల్లార్‌లోకి శనివారం సాయంత్రం భారీగా నీరు చేరింది. దాంతో సెల్లార్‌లోని లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులు నీటీలో చిక్కుకుపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది హుటాహుటిన వెళ్లి రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టి.. 30 మంది విద్యార్థులను రక్షించారు. కానీ ముగ్గురు విద్యార్థులు మరణించారు. మరోవైపు, వారి ప్రాణాలు పోవడానికి కోచింగ్‌ సెంటర్‌ యాజమాన్యం అని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌ అధికారులు కారణమని.. వారిపైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు నిరసనకు దిగారు.

Advertisement

Next Story