రెండ్రోజుల్లో హాజరుకావాలి.. జితేందర్ రెడ్డి పీఏకు నోటీసులు

by GSrikanth |
రెండ్రోజుల్లో హాజరుకావాలి.. జితేందర్ రెడ్డి పీఏకు నోటీసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి శ్రీనివాసగౌడ్‌పై హత్యా యత్నానికి సంబంధించిన కేసులో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడికి తెలంగాణ పోలీసులు నోటీసు జారీ చేశారు. రెండు రోజుల వ్యవధిలో పేట్ బషీరాబాద్ పోలీసుల ఎదుట హాజరుకావాలని గురువారం జారీ చేసిన ఆ నోటీసులో ఇన్‌స్పెక్టర్ రమేశ్ పేర్కొన్నారు. గత నెల 25వ తేదీన ఫారూక్ అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని, దీనికి సంబంధించి కొద్దిమంది నిందితులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. నిందితుల నుంచి వచ్చిన వివరాల మేరకు ఈ కేసుకు సంబంధించిన పలు అంశాలను ప్రశ్నించాల్సి ఉన్నదని జితేందర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు జితేందర్ రాజ్‌కు జారీ చేసిన ఆ నోటీసులో ఇన్‌స్పెక్టర్ రమేశ్ పేర్కొన్నారు.

దీనికి స్పందించిన జితేందర్ రాజ్, ప్రస్తుతం తన భార్య ఆరోగ్యం సరిగా లేదని, ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై వైద్య చికిత్స పొందుతున్నందున హైదరాబాద్ రావడానికి కొంత సమయం పడుతుందని, అందుకు అనుమతించాలని కోరారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్న సమయంలో హైదరాబాద్‌కు వస్తానని పేర్కొన్నారు. పేట్‌బషీరాబాద్ పోలీసులు నమోదు కేసుకు సంబంధించి తన దగ్గర ఎలాంటి వివరాలు లేవని, ఆ కేసు పూర్వాపరాలు కూడా తనకు తెలియవని, ఎఫ్ఐఆర్ ప్రతిని పంపిస్తే దానికి అనుగుణంగా తనకు తెలిసిన అంశాలను చెప్పడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని ఆ రిప్లైలో జితేందర్ రాజ్ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా ఢిల్లీలోని సౌత్ ఎవెన్యూ, చాణక్యపురి పోలీసులు తెలంగాణ డీజీపీకి లేఖ రాసినట్లు తెలిసింది. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తెలంగాణ పోలీసులు నలుగురు వ్యక్తులను అపహరించుకుపోవడాన్ని ఢిల్లీ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలకు విరుద్ధంగా నలుగురినీ తీసుకెళ్ళడాన్ని ఆ లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. ఢిల్లీ పోలీసులు తెలంగాణ డీజీపీకి లేఖ రాసిన అంశాన్ని ధృవీకరించలేదు. రాష్ట్రపతి భవన్‌కు 500 మీటర్ల దూరంలో అపహరణ జరగడాన్ని ఢిల్లీ పోలీసులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Advertisement

Next Story