కలెక్టర్లకు, ఐఏఎస్ లకు ఐఐఎం పాఠాలు.. పరిశీలిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

by Ramesh Goud |
కలెక్టర్లకు, ఐఏఎస్ లకు ఐఐఎం పాఠాలు.. పరిశీలిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా సాధికారత కోసం పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరిన్ని వ్యాపారాల్లోకి మహిళలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం పలు కీలక అంశాలపై దృష్టి సారించింది. ముఖ్యంగా, జిల్లా కలెక్టర్లు, ఐఏఎస్ అధికారుల సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మహిళా శక్తిని మరింత బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటుంది. అదేవిధంగా, మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ కార్యక్రమం ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెట్టనుంది.

ఈ నేపథ్యంలో మహిళల కోసం కొత్త వ్యాపారాల ఏర్పాటు, మహిళలను మోటివేట్ చేయడం, మహిళలకు మార్కెటింగ్ మెలుకువలు నేర్పాలంటే.. మొదట జిల్లా అధికారులకు ఆ దిశలో ట్రైనింగ్ అవసరమని భావించింది. అందుకే ఐఐఎం కోల్‌కతాలో విడతల వారీగా ఐఏఎస్ లకు శిక్షణ ఇప్పించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తొంది. ఒక్కో బ్యాచ్ కు కనీసం ఐదు రోజులపాటు ఐఐఎం కోల్‌కతాలో శిక్షణ ఇవ్వనుంది. తద్వారా అధికారుల్లో నూతన ఉత్సాహం నిండి, వినూత్న ఆలోచనలతో పనిచేయడం ద్వారా మహిళా సాధికారత, వ్యాపారాలు, ఇందిరా మహిళా శక్తి పథకం మరింత పటిష్టంగా అమలవుతోందని భావిస్తోంది. అంతేకాకుండా ఈ శిక్షణ ద్వారా అధికారులు మరింత డైనమిక్ గా పనిచేస్తారనే భావనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది.

ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద ఇప్పటికీ 20 రకాల వ్యాపారాల్లోకి మహిళలు అరంగ్రేటం చేశారు. ఆర్టీసీ అద్దె బస్సులు, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల ఏర్పాటు, రైస్ మిల్లులు, గోదాముల నిర్వహణ వంటి ఎన్నో వ్యాపారాల్లోకి మహిళా సంఘాలు నిర్వహిస్తున్నాయి. ఇక్రిసాట్ సౌజన్యంతో మహిళా సంఘాలచే వచ్చే మూడేళ్లలో 2500 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేలా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ కార్యక్రమం అమలు కోసం అవసరమైన ఫైల్‌ను గ్రామీణాభివృద్ధి సంస్థ (సెర్ప్) సిద్ధం చేసింది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో శిక్షణ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు బాధ్యతలు ఇక్రిసాట్ కి అప్పగించే ఏర్పాటు చేస్తోంది.

Next Story