ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కీలక విజ్ఞప్తి

by Gantepaka Srikanth |
ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కీలక విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల‌కు సంబంధించి ఆర్థిక శాఖ‌లోని ఈ-కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లుల‌ను వెంట‌నే మంజూరు చేయాల‌ని ప్రభుత్వాన్ని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ క‌మిటీ(టీఈజేఏసీ) కోరింది. ఈ మేర‌కు జేఏసీ చైర్మన్ వి.ల‌చ్చిరెడ్డి నేతృత్వంలో ప్రతినిధుల బృందం గురువారం ముఖ్యమంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డిని క‌లిసి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించింది. 2022-23 ఆర్థిక సంవ‌త్సరం నుంచి ఈ-కుబేర్ వ‌ద్ద ఉద్యోగులు, ఉపాధ్యాయుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని ఆయ‌న దృష్టికి తీసుకెళ్లారు. వేత‌న బిల్లులు మిన‌హా మిగ‌తా బిల్లులు ట్రెజ‌రీ, అకౌంట్స్ కార్యాల‌యాల ఆమోదం ల‌భించిన‌ప్పటికీ ఈ-కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. రూ.10 ల‌క్షల లోపు ఉన్న జీపీఎఫ్, లీవ్ సాల‌రీ, స‌రెండ‌ర్ లీవ్, స‌ప్లెమెంట‌రీ, ఏరియ‌ర్లు, మెడిక‌ల్ రీయింబ‌ర్స్‌మెంట్, అద్దె వాహ‌న చార్జీలు, ఎన్నిక‌ల సంబంధిత బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు.

పెండింగ్ బిల్లుల కార‌ణంగా ఉద్యోగ‌, ఉపాధ్యాయులు ఆర్థికంగా ఇబ్బంది ప‌డుతున్నార‌న్నారు. తెలంగాణ రెవెన్యూ స‌ర్వీసెస్ అసోసియేష‌న్‌(టీజీఆర్ఎస్ఏ) నూత‌న అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి, ప్రధాన కార్యద‌ర్శి బిక్షంలు కూడా జేఏసీ చైర్మన్ వి.ల‌చ్చిరెడ్డి ఆధ్వర్యంలో వేం న‌రేంద‌ర్ రెడ్డిని మ‌ర్యాద‌పూర్వకంగా క‌లిశారు. రెవెన్యూ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు మంజూరు చేయించాల‌ని కోరారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల‌ స‌మ‌స్యపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విష‌యాన్ని తీసుకెళ్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ క‌లెక్టర్స్ అసోసియేష‌న్ ప్రధాన కార్యద‌ర్శి రామకృష్ణ, తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్‌(టీజీటీఏ) అధ్యక్షుడు ఎస్‌.రాములు, ప్రధాన కార్యద‌ర్శి ర‌మేశ్ పాక‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story