T Congress: డీసీసీ అధ్యక్షుల ఎంపికకు కసరత్తు..! స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీపై ఫోకస్

by Shiva |
T Congress: డీసీసీ అధ్యక్షుల ఎంపికకు కసరత్తు..! స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీపై ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్‌‌ పార్టీలో కసరత్తు జరుగుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బలమైన వ్యక్తులను డీసీసీ ప్రెసిడెంట్‌లుగా ఎంపిక చేయాలని ప్లాన్ చేస్తున్నది. ప్రజలతో సత్సంబంధాలు కలిగి, నాయకులందరినీ సమన్వయం చేయగలిగే వ్యక్తులను సెలక్ట్ చేయాలని పార్టీ ఆలోచిస్తున్నది. అంతేగాక ఆర్థికంగానూ బలంగా ఉండేవాళ్లను ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే రెండు రోజుల నుంచి కొత్త డీసీసీ అధ్యక్షుల ఎంపికపై పార్టీలో చర్చ మొదలైంది.

ప్రజాప్రతినిధుల అభిప్రాయాల సేకరణ షురూ

కొత్త డీసీసీ అధ్యక్షుల ఎంపికపై రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాల సేకరణను మొదలుపెట్టారు. అంతేగాక క్షేత్రస్థాయి నేతల ఒపీనియన్లను కూడా వేర్వేరుగా సేకరించనున్నారు. గతంలో గాంధీభవన్‌కు కొన్ని రిఫరల్స్ వచ్చాయి. వివిధ నేతల సిఫారసు ద్వారా డీసీసీ పోస్టులకు అభ్యర్థనలు పెట్టుకున్నారు. వీటన్నింటినీ పరిశీలించి సమర్థవంతమైన లీడర్లను ఎంపిక చేయాలని పార్టీ స్టడీ చేస్తున్నది. మరోవైపు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొందరు డీసీసీ ప్రెసిడెంట్‌లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో ఆయా జిల్లాల్లో పార్టీ అధ్యక్షుడి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి కొన్ని జిల్లాల్లో లాంగ్ స్టాండింగ్‌గా అధ్యక్షులుగా పనిచేస్తున్న వాళ్లూ ఉన్నారు. దీంతో కొత్త అధ్యక్షులను నియమించాలని పార్టీ భావిస్తున్నది. పీసీసీ కార్యవర్గం ప్రకటన తర్వాత కొత్త డీసీసీలను వెల్లడించే అవకాశం ఉన్నదని ఓ నాయకుడు తెలిపారు. సంక్రాంతి‌లోపే పీసీసీ కొత్త కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు తదితర పార్టీ పదవుల అనౌన్స్ చేసేందుకు పార్టీ ప్రయత్నం చేస్తున్నదని వివరించారు.

డెడికేటెడ్‌గా పనిచేసే వారికి చాన్స్

కాంగ్రెస్ పవర్‌లో ఉన్నందున ఇప్పుడు పార్టీ, ప్రభుత్వ యాక్టివిటీస్‌ను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే నాయకులను ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్‌లు, ప్రోగ్రామ్‌లను పార్టీ ద్వారా జనాల్లోకి విస్తృతంగా వెళ్లేలా జిల్లా అధ్యక్షులు పనిచేయాల్సి ఉంటుంది. అంతేగాక మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కోసం పనిచేస్తున్న లీడర్ల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుండాలి. స్టేట్ పీసీసీ నుంచి వచ్చిన ఆదేశాలను జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్షుల సమన్వయంతో ఇంప్లిమెంట్ చేయాలి. నేతల మధ్య విభేదాలు లేకుండా చర్యలు తీసుకోవాలి. వీటన్నింటినీ డెడికేటెడ్‌గా పనిచేసే వారిని డీసీసీ ప్రెసిడెంట్‌లుగా ఎంపిక చేయాలని పీసీసీ చీఫ్‌ మహేశ్​‌ కుమార్ గౌడ్ భావిస్తున్నారు.

ఎమ్మెల్యేలకు ఇస్తే ఎలా ఉంటుంది..?

పార్టీ పదవుల్లోనూ ప్రభుత్వంలోని కొందరిని భాగస్వామ్యం చేస్తే బెటర్ అంటూ పార్టీలోని వివిధ నేతల ద్వారా ఫీడ్‌బ్యాక్ వచ్చింది. దీంతో డీసీసీ పోస్టులలో కొందరు ఎమ్మెల్యేలను భర్తీ చేస్తే ఎలా ఉంటుంది? అనే ప్రతిపాదనపై కూడా పార్టీలో స్టడీ జరుగుతున్నది. ఎమ్మెల్యేలకు ఆ పదవి ఇవ్వడం వల్ల పోస్టు ప్రయారిటీ మరింత పెరుగుతుందనేది కొందరి నేతల వాదన. ఈ విధానం ఫాలో అయితే ఇప్పటికే ఆ పోస్టు కోసం ఆశలు పెట్టుకున్న పార్టీకి చెందిన కీలక లీడర్లు అసంతృప్తికి గురయ్యే ప్రమాదం ఉన్నదని కూడా పార్టీలో డిస్కషన్ జరుగుతున్నది. ఈ అంశంపై సీఎం ఒపీనియన్ తీసుకోవాలని పీసీసీ ఆలోచిస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed