పోలీసులకు ఏఐలో ప్రత్యేక శిక్షణ అనివార్యం : కేంద్ర మంత్రి బండి సంజయ్

by M.Rajitha |   ( Updated:2025-01-04 16:21:00.0  )
పోలీసులకు ఏఐలో ప్రత్యేక శిక్షణ అనివార్యం : కేంద్ర మంత్రి బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : సమాచార వ్యవస్థను బలోపేతం చేయడంలో డైరెక్టరేట్ ఆఫ్ కోఆర్డినేషన్ పోలీస్ వైర్‌లెస్(డీసీపీడబ్ల్యూ) విభాగం అందిస్తున్న సేవలు అభినందనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇకపై ప్రాంతీయ పోలీస్ వైర్ లెస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చెయిన్, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను అందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కర్నాటకలోని బెంగళూరులో డీసీపీడబ్ల్యూ సెంటర్ లోని ప్రాంతీయ పోలీస్ వైర్‌లెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్(ఆర్‌పీడబ్ల్యూటీఐ) కు సంబంధించిన కొత్త హాస్టల్ బ్లాక్ నిర్మాణానికి బండి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంజయ్ మాట్లాడుతూ.. 1964లో నెలకొల్పిన డైరెక్టరేట్ ఆఫ్ కోఆర్డినేషన్ పోలీస్ వైర్ లెస్ విభాగం హోంశాఖలో ముఖ్యమైనదని పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ సంబంధిత అత్యవసర సందేశాలను ఢిల్లీతోపాటు 33 రాష్ట్రాల రాజధానుల మధ్య అంత:రాష్ట్ర పోలీస్ వైర్ లెస్ కేంద్రాల సాయంతో 24 గంటలు సమాచారాన్ని పంపుతూ పోలీస్ కమ్యూనికేషన్ వ్యవస్థను సక్రమంగా, సమన్వయంతో ఆధునిక పద్ధతుల్లో నిర్వహిస్తుండటం అభినందనీయమని కొనియాడారు.

విజ్ఞానం, సాంకేతికత రంగం అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు కేంద్ర భద్రతా బలగాలకు, పోలీసు బలగాలకు ప్రత్యేకంగా శిక్షణ అందించడం కూడా అవసరమని సంజయ్ చెప్పుకొచ్చారు. గతంలో కేంద్ర, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వివిధ ర్యాంకుల పోలీస్ దూర సంచార సిబ్బందికి శిక్షణ అందించేందుకు న్యూఢిల్లీలోని సెంట్రల్ పోలీస్ రేడియో ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ మాత్రమే ఉండేదని, కానీ ప్రస్తుతం చండీగఢ్, బెంగళూరు, గాంధీనగర్, కలకత్తా ప్రాంతాల్లో ప్రాంతీయ పోలీస్ రేడియో శిక్షణ సంస్థలను స్థాపించగలిగామన్నారు. ఈ క్రమంలో కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా, పుదుచ్చేరి, లక్షద్వీప్ లో పనిచేసే వివిధ ర్యాంకుల పోలీస్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ బెంగళూర్ ఎంపీ తేజస్వి సూర్య, డీసీపీఎం అదనపు డైరెక్టర్ ఆర్కే వర్మ, హోంశాఖ ఉన్నాధికారులు, కేంద్ర భద్రతా దళాల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story