మొదలుకానున్న T-Fiber సేవలు.. రూ.149కే 20 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్

by karthikeya |
మొదలుకానున్న T-Fiber సేవలు.. రూ.149కే 20 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ నెట్ తో ప్రపంచమే కుగ్రామంగా మారుతున్న తరుణంలో ఇంటర్ నెట్ వ్యయం కూడా పెరిగిపోతుంది. ప్రజలు కూడా ఇంటర్ నెట్ లేకుండా ఉండలేని పరిస్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజలకు అతి తక్కువ ధరకే ఇంటర్ నెట్ సౌకర్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో ప్రతి మారుమూల గ్రామానికి, అవాసానికి, గిరిజన తండాలు, బీసీ, ఎస్సీ కాలనీలకు అతి తక్కువ ధరకే ఇంటర్ నెట్ అందించాలనే లక్ష్యంతో ఇంటింటికి ఇంటర్ నెట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా వచ్చే వారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్ నెట్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. దీనిలో భాగంగా నెలకు 20 ఎంబీపీఎస్ తో అన్ లిమిటెడ్ డేటాను రూ.149 లకే అందించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

టీ ఫైబర్ ద్వారా రాష్ట్రంలో 8919 గ్రామాలకు నెట్ వర్క్ ను ఏర్పాటు చేశారు. మరో 3వేల గ్రామాలకు బీఎల్ఎన్ఎల్ సంస్థ ఇంటర్నేట్ కనెక్షన్ అందించనుంది. బీఎస్ఎన్ఎల్ అందించే 3వేల గ్రామాల్లో ప్రధానంగా ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. ములుగు, ఆదిలాబాద్, అసిఫాబాద్ లాంటి అటవీ, గిరిజన, గొండు గూడెలు ఉన్న 799 గ్రామ పంచాయతీలకు ఇంకా నెట్ వర్క్ ను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇక్కడ నెట్ వర్క్ ను ఏర్పాటు చేయడానికి అటవీ శాఖ అనుమతి కావాల్సి రావడంతో అధికారులు ఆదిశగా ప్రయత్నిస్తున్నారు. దీని కోసం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అటవీ శాఖ మంత్రి, అటవీ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడంతో అనుమతులకు లైన్ క్లియర్ అవుతుంది. రెండు వారాల్లో అనుమతులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇందులో భాగస్వాములను చేయాలని చూస్తున్నారు.

టీ ఫైబర్ ద్వారా ప్రయోజనాలు...

టీ ఫైబర్ ద్వారా అందించే ఇంటర్ నెట్ కనెక్షన్ ను త్రీ వే రింగ్ కనెక్టివిటి ద్వారా కనెక్షన్ ఇవ్వనున్నారు. ఈ విధానంలో ఏదైనా అవాంతరాల వల్ల ఇంటర్ నెట్ డిస్ కనెక్ట్ అయితే మరో మార్గం ద్వారా కనెక్షన్ పునరుద్ధరిస్తారు. భారీ వర్షాలు, వరదలు, భారీ గాలులు, రోడ్డు వెడల్పు, కొత్త రోడ్లు వేయడం తదితర కారణాలతో ఇంటర్ నెట్ సరఫరాకు అంతరాయం కలిగితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇది మంచి ఫలితాలు ఇస్తుందని టీ ఫైబర్ అధికారులు అంచనా వేస్తున్నారు. అతి తక్కువ ధరకు ఎక్కువ స్పీడ్, అన్ లిమిటెడ్ డేటా అందుబాటులో ఉండనుంది. ఒక కనెక్షన్ లు ఇవ్వడం ప్రారంభమైతే రాష్ట్ర గ్రామీణ చరిత్రలో ఒక మైలు రాయిగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ముందుగా ప్రభుత్వ కార్యాలయాలకు కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో టీ ఫైబర్ అధికారులు సంప్రదింపులు జరిపారు. పోలీస్ స్టేషన్ లు అన్ని కూడా టీ ఫైబర్ కనెక్షన్ తీసుకోనున్నారు.

త్వరలో బోర్డు మీటింగ్ ...

టీ ఫైబర్ కు సంబంధించి కనెక్షన్లపై కీలక బోర్డు సమావేశం జరగనుందని సమాచారం. ఈ బోర్డు సమావేశంలో ప్రధాన నిర్ణయాలన్నింటికీ ప్రభుత్వం ఆమోదం వేసి జీవో విడుదల చేయనుంది. ప్రారంభానికి తేదీని కూడా ఖరారు చేయనున్నారు. టీ ఫైబర్ కు జిల్లా స్థాయిలో మేనేజర్, జోనల్ మేనేజర్ ను నియమించనున్నారు. వీటిని బోర్డు ఆమోదించాల్సి ఉంది.

డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్..

తెలంగాణ పైబర్ గ్రీడ్ కార్పొరేషన్ ను స్పెషల్ పర్పస్ వెహికిల్ ను 2017 లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసింది. ఒకసారి టీ ఫైబర్ సేవలు ప్రారంభమైతే 83 లక్షల మందికి సేవలు అందించే సామర్థంతో పని చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ శాఖలు, సంస్థల కార్యాలయాలు టీ ఫైబర్ వాడాల్సిందే. టీ ఫైబర్ కనెక్షన్ తీసుకోవడం ద్వారా టీవీ , కంప్యూటర్, టెలిఫోన్, సీసీ టీవీలకు వాడుకోవచ్చు. స్థానిక కేబుల్ ఆపరేటర్లను భాగస్వాములను చేసి టీవీ ప్రసారాలు డీటీహెచ్ సర్వీసులు వచ్చే విధంగా చేయనున్నారు. టీ ఫైబర్ ద్వారా స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు రానున్నాయి.

Advertisement

Next Story

Most Viewed