రాష్ట్ర బడ్జెట్.. రంగారెడ్డి జిల్లాకు నిరాశే!

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-07 06:24:38.0  )
రాష్ట్ర బడ్జెట్.. రంగారెడ్డి జిల్లాకు నిరాశే!
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 2023–24 బడ్జెట్‌ను అసెంబ్లీ ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఆర్థిక నిపుణులు, మేధావులు, వివిధ రాజకీయ విశ్లేషకులకు సైతం అర్థంకాని రీతిలో బడ్జెట్​ ఉందనే ఆవేదన వ్యక్తమవుతుంది. గతేడాది బడ్జెట్ ​కంటే రూ.40వేల కోట్లు పెంచుతూ.. రూ.2లక్షల 90వేల 393 లక్షల కోట్ల బడ్జెట్‌ను సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు ప్రవేశ పెట్టారు.

ఈ బడ్జెట్​లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఆశించిన స్ధాయిలో నిధుల కేటాయింపు దక్కలేదని స్పష్టమవుతోంది. తెలంగాణ రాష్ట్ర అవిర్భావం తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగు జలాలు అందుతాయని ఆశించిన ప్రజల కండ్లల్లో కన్నీళ్లు మిగులుతున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ రెండు ధపాలుగా ప్రభుత్వాన్ని పాలిస్తున్నప్పటికీ రంగారెడ్డి జిల్లా ప్రజల కల నెరవేరడం లేదని ప్రతిపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కానీ అదే అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మాత్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సంతృప్తికరంగా ఉందని తెలుపుతున్నారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు ఏమీ లేక పోవడంతో జిల్లా ప్రజలకు నిరాశే మిగిలింది. సాగు నీటి ప్రాజక్టులకు ఊహించిన విధంగా నిధులు కేటాయింపు లేకపోవడంతో రైతుల కలలు ఆవిరయ్యాయి. ఇండస్ట్రియల్‌ ఏరియా అయిన రంగారెడ్డి జిల్లాలో కార్మికులు అధికంగా ఉంటారు. కార్మికుల సంక్షేమానికి పెద్దగా ప్రాధాన్యం లేక పోవడం కార్మికులను నిరాశ పర్చింది. ఇలా చేతి వృత్తులు, కుల వృత్తులకు సైతం పెద్దగా నిధులు కేటాయింపు లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ అంకెలు పెంచి వారి పబ్బం గడుపుకోవడానికే అని స్పష్టమైతుంది.

సొంతింటి కల.. కలగానే మిగిలింది...

పేదల సొంతింటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు ఇవ్వాలని ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నో ఏండ్లుగా డిమాండ్‌ చేస్తుంటే ఆసెంబ్లీలో ఆ ప్రస్తావన లేకపోవడంతో పేదల సొంతింటి కల.. కలగానే మిగులుతోంది. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాల కోసం కేటాయించిన నిధులు అత్తెసరుగానే ఉన్నాయి.

– పాలమాకుల జంగయ్య, సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి

అంకెల గారడీ...

రాష్ట్ర బడ్జెట్‌ అంకెల గారడీగా ఉంది. ప్రజా సంక్షేమాకి ఉపయోగపడేలా ఏమీ లేదు. గత బడ్జెట్‌ను మార్చి అసెంబ్లీలో చదివారు తప్ప పెద్దగా మార్పులు ఏమీ లేవు. బడ్జెట్‌‌ను సవరించాలి.

–చల్లా నర్సింహారెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఉంది. అన్ని రంగాలను అభివృద్ధి పరిచేందుకు ఈ బడ్జెట్‌ కేటాయింపులు ఉన్నాయి. రైతుబంధు, రైతు బీమా పెంపుతో రైతు సంక్షేమానికి ఊతం ఇచ్చింది.

–మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే

బడ్జెట్‌ హర్షణీయం

రాష్ట్ర బడ్జెట్‌లో చేవెళ్ల పార్లమెంట్‌కు రూ. 13,645 కోట్లు కేటాయించడం హర్షణీయం. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని బడ్జెట్‌ సమావేశాలలో ప్రస్తావించడం గర్వించదగ్గ విషయం. రాయదుర్గ్‌ నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో రైల్‌ సేవల పనులకు రూ. 6,250 కోట్లు కేటాయించడం చాలా సంతోషంగా ఉంది.

–రంజిత్​ రెడ్డి, చేవెళ్ల ఎంపీ

ప్రజా బడ్జెట్‌

అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ భవిష్యత్ తెలంగాణకు బంగారు బాటలు వేస్తుంది. పేద, మధ్యతరగతి ప్రజల బడ్జెట్‌గా, ముఖ్యంగా రైతు బడ్జెట్‌గా ఉంది. గ్రామాల, పట్టణాల గతినే మార్చుతున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు రూ. 5609 కోట్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లకు రూ. 3210 కోట్ల కేటాయింపు గొప్ప విషయం. ఈ బడ్జెట్‌లో తాను నిర్వహిస్తున్న విద్యా శాఖకు రూ. 19,093 కోట్ల కేటాయించడం గొప్ప విషయం.

–సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

గందరగోళ బడ్జెట్..

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ సహా అన్ని వర్గాలను పూర్తిగా వంచించేలా బడ్జెట్‌ను రూపొందించారు. నియోజకవర్గానికి 2000 మందికి కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి రూ. 5లక్షలు ఇల్లు కట్టుకోడానికి ఇవ్వాలి. గతంలో కూడా రుణమాఫీ గురించి బడ్జెట్‌లో చెప్పారు కానీ ఎటువంటి కార్యరూపం దాల్చలేదు. పన్నుల రూపంలో అత్యధికంగా ఆదాయం వచ్చే రంగారెడ్డి జిల్లాను బడ్జెట్ కేటాయింపుల్లో పూర్తిగా విస్మరించారు.

–బొక్క నర్సింహారెడ్డి, బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు

Also Read..

'బడ్జెట్‌లో బీసీలకు ముష్టి రూ.6 వేల కోట్లా?'

Advertisement

Next Story