శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్‌కు ముహూర్తం ఫిక్స్.. ఇవాళ సరిగ్గా ఆ సమయానికి..

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-07-29 09:18:30.0  )
శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్‌కు ముహూర్తం ఫిక్స్.. ఇవాళ సరిగ్గా ఆ సమయానికి..
X

దిశ, అచ్చంపేట : ఎగువ నుంచి వస్తున్న భారీ వరద జలాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. గంటగంటకు నీటి సామర్థ్యం పెరుగుతున్న తరుణంలో ముందుగా అనుకున్నట్టు అధికారులు మంగళవారం ఉదయం ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు సమాయత్తమయ్యారు. కానీ ఎగువ నుంచి వరద జలాలు మరింత ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే నేటి సాయంత్రం 4. 30 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తి దిగున ఉన్న నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేసేందుకు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టారు. గేట్లను ఎత్తే ముందు అధికారులు ముందుగా గంగమ్మకు హారతి ఇచ్చే కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎగువన ఉన్న ఆల్మట్టి డ్యాం పూర్తిస్థాయిలో నిండుకుండలా తొనికీలాడుతున్నది. దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టు 46 గేట్లను ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు స్పిల్ వే ద్వారా 3 లక్ష 73 వేల 932 క్యూసెక్కులు, అలాగే విద్యుత్ ఉత్పత్తి ద్వారా 19,668 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మొత్తం 4 లక్ష 41 వేల 402 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా శ్రీశైలం ప్రాజెక్టుకు 3 లక్షల 73వేల 942 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు సామర్థ్యం 885 అడుగులు కాగా 215.87 టీఎంసీల సామర్థ్యం నీటి నిలువ ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో సోమవారం ఉదయం నాటికి 876. 70 అడుగులు చేరుకోగా 171.8625 టీఎంసీల సామర్థ్యం చేరుకుంది.

ఏపీ, టీజీ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి

శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఉన్న ఏపీ, తెలంగాణ రైట్, లెఫ్ట్ విద్యుత్ కేంద్రం లో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. ఏపీ విద్యుత్ కేంద్రం నుండి 25, 927 క్యూసెక్కుల నీటిని, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుండి 31, 373 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వదులుతున్నారు. ఏపీ పంప్ హౌస్ నుండి 6.908 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా తెలంగాణ పంప్ హౌస్ నుండి 18.087 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గత ఆరు రోజుల నుండి తెలంగాణ శ్రీశైలం సొరంగ విద్యుత్ కేంద్రం నుండి 95 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని చేసినట్లు ఎస్ ఈ సత్యనారాయణ దిశకు ఫోను ద్వారా తెలిపారు

Advertisement

Next Story