Disha Special Story : ఇకపై ప్రతి ప్రాపర్టీకి స్పెషల్ కోడ్.. సర్కారు ఖజానాకు భారీ ఆదాయం

by Bhoopathi Nagaiah |
Disha Special Story : ఇకపై ప్రతి ప్రాపర్టీకి స్పెషల్ కోడ్.. సర్కారు ఖజానాకు భారీ ఆదాయం
X

కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ, రాష్ట్ర పంచాయతీ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో స్వమిత్వ (సర్వే ఆఫ్ విలేజెస్ ఆబాది అండ్ మ్యాపింగ్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్) సర్వే చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర ఆస్తుల విలువకు పరిష్కారం కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నది. ప్రతి ల్యాండ్ పార్శిల్‌కు డ్రోన్ టెక్నాలజీ, కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్(సీఓఆర్ఎస్) విధానాలతో మ్యాపింగ్ చేస్తారు. 2020 నుంచి దేశవ్యాప్తంగా దశలవారీగా ఈ మ్యాపింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. స్వమిత్వ వల్ల ప్రజల ఆస్తులకు రక్షణ, వాస్తవ విలువల గుర్తింపు సాధ్యమవుతుంది. అలాగే ప్రభుత్వానికి రెవెన్యూ కలెక్షన్ నూటికి నూరుపాళ్లు సమర్థవంతంగా చేయొచ్చు. స్థలాల యజమానులకు హక్కుల గ్యారంటీ లభిస్తుంది. మ్యాపులతో గ్రామ పంచాయత్ డెవలప్‌మెంట్ ప్లాన్స్(జీపీడీపీ)ని అమలు చేయడానికి వీలవుతుంది. ఇప్పటికే హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పథకాన్ని అమలు చేస్తున్నారు. దశల వారీగా మిగతా రాష్ట్రాల్లోనూ నిర్వహించనున్నారు. ఇదే అంశానికి మరింత చట్టబద్ధత కల్పిస్తూ ఆబాదీలకు ప్రత్యేక రికార్డులను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది.

ఈ క్రమంలోనే ఆర్వోఆర్ 2024 లో సెక్షన్ 4(2)లో ఆబాది లేదా వ్యవసాయేతర భూములకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తేదీ నుంచి పూర్తి వివరాలతో ఒక ప్రత్యేక హక్కుల రికార్డును తయారు చేయడం, నవీకరించడం, నిర్వహించడం వంటి అంశాన్ని చేర్చారు. ఈ నిర్దేశించిన హక్కుల రికార్డులను ఎలక్ట్రానిక్ రూపంలో ఉంచుతారు. అలాగే హక్కుల రికార్డుల పోర్టల్‌లోనూ అందరికీ అందుబాటులో ఉంచుతారు. అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను అందుకోవడానికి వీలుగా ఈ అంశాన్ని ముందుచూపుతో చేర్చడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దేశవ్యాప్తంగా ఉన్న 7లక్షల గ్రామాల్లో ఇప్పటివరకు లక్ష రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తయ్యింది. ఆస్తులను మ్యాపింగ్ చేసి ప్రత్యేక గుర్తింపు నంబర్‌తో యజమానికి స్వమిత్వ కార్డులను అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తామంటే కేంద్రం నిధులను కూడా మంజూరు చేసింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం మొదట్లో సరిగ్గా స్పందించలేదు. కానీ గత ప్రభుత్వం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలంలోని రెండు గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా చేపడుతున్నట్లు కేంద్రానికి ప్రతిపాదనలు పంపంపింది. - శిరందాస్ ప్రవీణ్​కుమార్

ప్రాపర్టీ కార్డులో ఏం ఉంటుంది?

కేంద్రప్రభుత్వం ఆధీనంలో గత నెల ఐదో తేదీన పుణెలో జరిగిన ల్యాండ్ గవర్నెన్స్‌పై అంతర్జాతీయ సదస్సు జరిగింది. అందులో ట్రాన్స్ ఫార్మింగ్ ల్యాండ్ గవర్నెన్స్ త్రూ స్వమిత్వ స్కీం గురించి చర్చ జరిగింది. అందులో స్వమిత్వ లక్ష్యాలను వివరించారు. గ్రామాల్లోని ఇంటి యజమానులకు కూడా రూరల్ ఆబాది రికార్డ్ ఆఫ్ రైట్స్‌ని కల్పించడమే స్వమిత్వ లక్ష్యంగా కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 3.15 లక్షల గ్రామాల్లో డ్రోన్ల ద్వారా సర్వే చేపడుతున్నారు. అలాగే 2.10 కోట్ల ప్రాపర్టీ కార్డులను పంపిణీ చేశారు. డీజీ లాకర్‌ని వినియోగించి ప్రాపర్టీ కార్డులను రూపొందిస్తున్నారు. ప్రతి ఇల్లు, ఇంటి స్థలం, ఖాళీ జాగ, వ్యవసాయేతర స్థలాలను గుర్తిస్తారు. ఆ యజమానికి ఆబాది కార్డులు(స్వమిత్వ) జారీ చేస్తారు. ప్రాపర్టీ కార్డుగానూ పిలవచ్చు. ఇందులో ఆ ఆస్తి యజమానుల పూర్తి వివరాలు ఉంటాయి. ఆస్తి ఎంత విస్తీర్ణం? దాని విలువ ఎంత? ఆ ఆస్తికి చెల్లిస్తున్న ట్యాక్స్ ఎంత? సర్వే నంబర్లు.. సరిహద్దులు వంటి వివరాలన్నీ ఉంటాయి. దానివల్ల పూర్తి హక్కుల కార్డుగా పని చేస్తుంది. స్థలం మ్యాప్ కూడా ఉంటుంది. అది కూడా అక్షాంశాలు, రేఖాంశాలతో కూడి ఉంటుంది. ఆ ప్రాపర్టీ విలువను పేర్కొంటారు.

రెవెన్యూలోనే రికార్డుల నిర్వహణ

ఆర్వోఆర్ 2024 చట్టంలో ఆబాదీలకు ప్రత్యేకంగా రికార్డులను రూపొందించే అంశంపైనా విమర్శలొచ్చాయి. కొందరు ఇంటి స్థలాలు, ఇండ్ల అంశం పంచాయతీ రాజ్, పురపాలక శాఖలకు సంబంధించినదైతే రెవెన్యూ చట్టంలో పేర్కొనడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. నిజానికి కేంద్రం రూపొందించిన స్వమిత్వ స్కీంలోనూ అమలుచేస్తున్న 14 రాష్ట్రాలకు గాను 12 రాష్ట్రాల్లో రెవెన్యూ శాఖనే ప్రాపర్టీ కార్డులను రూపొందించడం.. రికార్డ్ ఆఫ్ రైట్స్‌ని నిర్వహిస్తున్నది. పైగా ల్యాండ్ హిస్టరీ ఈ శాఖ దగ్గరే ఉంటుంది. అందుకే ఆబాదీల రికార్డుల తయారీ అంశం ఆర్వోఆర్ చట్టంలో పెట్టడమే మేలైందిగా నిపుణులు సూచిస్తున్నారు. కేంద్రం ప్రత్యేక కార్యక్రమంగా చేపడుతుంది. కానీ తెలంగాణలో ఒక అడుగు ముందుకేసి చట్టంలోనే ప్రత్యేకాంశంగా పెట్టుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయన్న అభిప్రాయం నెలకొన్నది. పైగా వ్యవసాయేతర భూములకు సంక్షేమ పథకాలు తీసుకునే అక్రమార్కులకు చెక్ పడుతుంది. కొన్ని లక్షల ఎకరాల భూమి లే అవుట్లుగా మారింది. అంటే ఆబాదీగా మారినా రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూమిగానే పేర్కొని పాసు పుస్తకాలు జారీ చేశారు. దాంతో రూ.వేల కోట్లు రైతుబంధు పథకం కింద అందుకుంటున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పుడలాంటి దోపిడీకి చెక్ పడనున్నది. ఒకే శాఖలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు ఉండడం ద్వారా లబ్దిదారుల ఎంపికలోనే జాగ్రత్తలు తీసుకుంటే నిధుల దుర్వినియోగాన్ని ముందుగానే నియంత్రించే వీలవుతుంది.

అక్రమాలకు చెక్

ఆబాదికి ప్రత్యేక రికార్డు మెయింటెయిన్ చేయడం ద్వారా అనుమతి లేకుండా లే అవుట్లు చేసి, తిరిగి వ్యవసాయ భూములుగా పాసు పుస్తకాలు పొందిన వారికి చెక్ పడుతుంది. ఉదాహరణకు మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అంకుషాపూర్‌లో సర్వే నం.127లో చాలా భూములు 30 ఏండ్ల క్రితమే లేఅవుట్లు చేసి విక్రయించారు. వాటినే మళ్లీ సాగు భూములుగా విక్రయించినట్లు ఆధారాలు ఉన్నాయి. కొండాపూర్‌లో సర్వే నం.96, 97, 112, 113ల్లో 1990 కాలంలోనే వెంకటేశ్వరకాలనీ 1, 2, 3గా లేఅవుట్లు చేసి విక్రయించారు. పట్టాదారులు చనిపోయిన తర్వాత ఆయన వారసులు పాసు పుస్తకాలు సంపాదించి మరోసారి భూములను విక్రయించారు. దాంతో మళ్లీ లేఅవుట్‌ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే అంకుషాపూర్‌లో తొలుత ఓ లేఅవుట్‌ చేసి ప్లాట్లు అమ్మేశారు. మళ్లీ వ్యవసాయ భూమిగా పట్టాదారులు ఇతరులకు విక్రయించారు. ఇప్పుడు అదే భూమికి హెచ్‌ఎండీఏ అనుమతులు ఇవ్వడం గమనార్హం. సర్వే నం.194, 195లో సాగుతోన్న దందా. తొలుత లేఅవుట్‌ యజమానులు మళ్లీ విక్రయించేందుకు రిజిస్ట్రేషన్‌ శాఖకు వెళ్తే మాత్రం సేల్‌డీడ్‌ చేయడం లేదు. మొదట ప్లాటుగా సేల్‌డీడ్‌ చేసిన అధికారులే తిరిగి రీ సేల్‌ చేసేందుకు అంగీకరించడం లేదు. కానీ వ్యవసాయ భూమిగా మాత్రం రిజిస్ట్రేషన్‌ చేశారు. కొనుగోలు చేసిన వ్యక్తులు హెచ్‌ఎండీఏ అనుమతి తీసుకొని లేఅవుట్‌ చేశారు. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్రి, నల్లగొండ జిల్లాల్లో అనేక గ్రామాల్లో ఒక్కటే భూమిని రెండు, మూడేసి సార్లు లేఅవుట్ చేసి విక్రయించిన ఉదంతాలు ఉన్నాయి. నాలా కన్వర్షన్ చేయకపోయినా ఆ లేఅవుట్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారు. దాంతో లక్షలాది సేల్ డీడ్లు హక్కుదార్ల దగ్గర ఉన్నాయి. 30, 40 ఏండ్ల క్రితం నాలా కన్వర్షన్ చేయకుండానే ప్లాట్లు చేసి అమ్మేసిన భూములకు భూ రికార్డుల ప్రక్షాళన పేరిట తిరిగి వ్యవసాయ భూములుగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందారు. అవే భూములను వ్యవసాయ భూములుగా ధరణి పోర్టల్ ని అడ్డం పెట్టుకొని పెద్దలు కొనుగోలు చేశారు. ఇలాంటి వాటికి ఆబాది రికార్డు ద్వారా 100 శాతం చెక్ పడుతుంది.

ఆబాది రికార్డు.. ఆర్థిక స్థిరత్వం

1. స్వమిత్వ/ఆబాది ఆస్తి కార్డులకు బ్యాంకు లావాదేవీల్లో ఆర్థిక స్థిరత్వం కల్పిస్తారు. అంటే దాని ద్వారా రుణాలు పొందొచ్చు.

2. గ్రామీణ ఆబాది ప్రాంతాల్లో ప్రజలకు ఆ ఆస్తి ద్వారా ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. ఇతర ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు వీలవుతుంది.

3. ఆబాది కార్డులను చూపిస్తే లోన్లు ఇచ్చేందుకు కూడా ఆర్బీఐ ఒప్పుకుంది. ఆస్తి కార్డులను హక్కు పత్రాలుగా పరిగణిస్తారు.

4. ఆబాది రికార్డుల నిర్వహణ ద్వారా రెవెన్యూ కలెక్షన్ నూటికి నూరు పాళ్లు సమర్థవంతంగా చేపట్టొచ్చు. హక్కుదారులకు హక్కులకు గ్యారంటీ దక్కుతుంది.

5. మ్యాపులతో గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్స్(జీపీడీపీ) ను పక్కాగా అమలు చేయొచ్చు.

6. ఆస్తి వివాదాలకు చెక్ పడుతుంది.

7. నిర్దిష్టమైన ల్యాండ్ రికార్డులు తయారవుతాయి.

Advertisement

Next Story

Most Viewed