ఆరు నెలల్లో షాకింగ్ సేల్ డీడ్స్.. రియల్ ఎస్టేట్ డోంట్ ఫియర్!

by Rajesh |
ఆరు నెలల్లో షాకింగ్ సేల్ డీడ్స్.. రియల్ ఎస్టేట్ డోంట్ ఫియర్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏపీలో టీడీపీ ఘన విజయం సాధించింది. దీంతో అక్కడ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని.. ఆ ప్రభావం తెలంగాణపై పడుతుందని ఓ వర్గం ప్రచారం మొదలుపెట్టింది. రియల్టర్లంతా అక్కడికి వెళ్లిపోతారని, దీంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ దివాళా తీస్తుందంటూ దుష్ప్రచారం చేస్తున్నది. అయితే ఈ రంగంలో ఏపీకి, తెలంగాణకు మధ్య ఎలాంటి పోటీ లేదని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఇలాగే దుష్ప్రచారం చేసినా రియల్ ఎస్టేట్ రంగంపై ఎలాంటి ప్రభావం పడలేదని, ప్రస్తుతం మార్కెట్ నాలుగింతలు పెరిగిందని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఇన్వెస్టర్లు ఆంధ్రాకు వెళ్లే చాన్సే లేదని, భయపడాల్సిన అవసరమే లేదని నొక్కి చెప్తున్నారు. ఇక్కడి వాతావరణం, అభివృద్ధి, పర్యావరణ పరిస్థితుల దృష్ట్యా జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఇన్వెస్టర్లు హైదరాబాద్ కే వస్తారని, అందుకే ఎప్పటికీ ఢోకా ఉండదని డెవలపర్స్, రియల్టర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో కొంతకాలంగా డౌన్

మూడు రాజధానులతో ఏపీలో రియల్ ఎస్టేట్ దివాళా తీసిందన్న ప్రచారం ఉన్నది. అలాగే అమరావతిలోనూ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. రూ.కోట్ల విలువైన స్థలాలు రూ.లక్షలకు పడిపోయాయి. ఓ సామాజిక వర్గం చేతుల్లోనే భూములన్నీ ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో ఐదేండ్లుగా ఎటూ తేల్చుకోలేని దుస్థితి ఉన్నది. అయితే ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రావడంతో తిరిగి పుంజుకుంటుందంటూ హైదరాబాద్‌లోని ఓ వర్గం ప్రచారం మొదలుపెట్టింది. అమరావతిలో కార్యకలాపాలు, అభివృద్ధి కార్యక్రమాలేమైనా పుంజుకుంటే.. ఆ ఏరియాలో ల్యాండ్స్ కొనుగోలు చేసిన డెవలపర్స్ తప్పా మరెవరూ అటువైపు కన్నెత్తి చూడరని తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు. గతంలో ఏపీలో ఇన్వెస్ట్ చేసిన వారంతా తీవ్ర నష్టాల ఊబిలో చిక్కుకున్నారని గుర్తు చేస్తున్నారు. అయితే అమరావతి పరిసరాల్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఇప్పుడు కాస్త ఉపశమనం మాత్రమే లభించవచ్చని, అప్పటి పెట్టుబడికి మూడింతల లాభమొచ్చినా కోలుకునే పరిస్థితులు మాత్రం ఉండవని పేర్కొంటున్నారు.

6 నెలల్లోనూ ఆగని క్రయవిక్రయాలు

తెలంగాణకు ఈ ఆర్నెళ్లు ఎన్నికల కాలమే. సాధారణంగా ఎలక్షన్ టైమ్‌లో క్రయవిక్రయాలు మందగిస్తాయి. కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి కనిపించలేదు. రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా తెలంగాణలో ల్యాండ్స్ సేల్ డీడ్స్‌లో పెద్దగా మార్పులేం లేవు. 2024–25లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలోనే 1,96,015 సేల్ డీడ్స్ అయ్యాయి. వాటి నుంచి రూ.1,898 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది ఇంటి స్థలాలు, ఇండ్ల లెక్క మాత్రమే. ఇక వ్యవసాయ భూములైతే గతేడాది డిసెంబరు ఒకటి నుంచి ఈ నెల 5వ తేదీ వరకు 2,73,624 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయితే ఎలక్షన్ టైమ్ కావడంతో కొత్త పెట్టుబడులు ఆశించిన స్థాయిలో రాలేదు. కానీ ఇక్కడి పొటెన్షియాలిటీకి బడా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయని రియల్టర్లు చెబుతున్నారు. దీంతో కేంద్రంలో ఎన్డీఏ వచ్చినా, ఏపీలో టీడీపీ వచ్చినా ఇక్కడి రంగానికి వచ్చిన నష్టమేమి లేదని పేర్కొంటున్నారు.

ప్రస్తుతానికి పెంపు తగదు

భూముల మార్కెట్ విలువను పెంచేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించ‌డంతో రియ‌ల్ ఎస్టేట్ రంగం ఆశ్చర్యానికి గురైంది. మార్కెట్ విలువకు, వాస్తవ విలువలకు మధ్య అంతులేని తేడా ఉంది. అది ఎప్పటి నుంచో వస్తున్నదే. అయితే ‘రియల్’ రంగాన్ని ప్రోత్సహించకుండా మార్కెట్ విలువ‌ల్ని పెంచడంపై దృష్టి సారించ‌డం ప్రస్తుతానికి సరైన నిర్ణయం కాదనే అభిప్రాయం వినిపిస్తున్నది. నిబంధనల ప్రకారం ఏడాదికోసారి భూముల విలువలను సవరించాలి. ఏ ప్రాంతంలో ఎంతమేరకు భూముల విలువలు పెంచాలో, తగ్గించాలో శాస్త్రీయంగా నిర్ధారించాలి. అదే క్రమంలో ఇతర రాష్ట్రాల్లోని రిజిస్ట్రేషన్ చార్జీలు ఎలా ఉన్నాయి? రియల్ రంగాన్ని ప్రోత్సహించేందుకు మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ఏం చేశాయో కూడా స్టడీ చేస్తే బాగుంటుందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ విలువ పెంపును నిర్మాణ రంగం ఆహ్వానిస్తుందని, కానీ ఈ ప్రక్రియ‌ను చేప‌ట్టేందుకు ఇది సరైన సమయం కాదంటున్నారు. డిసెంబ‌రులో నుంచి ఇప్పటి ఎలక్షన్ టైమ్ కావడంతో రియ‌ల్ మార్కెట్లో అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవంటున్నారు. ప్రస్తుతం స్టాంపు డ్యూటీ, బ‌దిలీ సుంకం, రిజిస్ట్రేష‌న్ చార్జీలను క‌లిపితే 7.5 శాతం ఉంది. ఈ చార్జీలను 4.5 శాతానికి తగ్గించాలని రియల్ ఎస్టేట్ సంఘాలు కోరుతున్నాయి.

ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్.. నిబంధనలు మారుతాయా?

కోకాపేటలో ఎస్ఏఎస్ క్రౌన్ పేరిట 4.5 ఎకరాల్లో 228 మీటర్ల ఎత్తులో 57 అంతస్తులు, తెల్లాపూర్‌లో ‘మై హోం సయూక్’ ప్రాజెక్టు పేరిట 25.37 ఎకరాల్లో 12 టవర్లు, 39 అంతస్తులు ఇలా స్కై స్క్రేపర్స్ 50 దాకా ఉన్నాయి. తక్కువ విస్తీర్ణం, అధికంగా ఫ్లాట్లు. అయితే దేశంలోని మెట్రో నగరాల్లో అమల్లో ఉన్న ఎఫ్ఎస్ఐ (ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్) నిబంధనలను ఇక్కడెందుకు లేవన్న సందేహం కలుగుతున్నది. ఎఫ్ఎస్ఐ ఎంత ఉండాలన్న దానిపై సీఎం రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని డెవలపర్స్ ఎదురుచూస్తున్నారు. ఎఫ్ఎస్ఐ కండీషన్లు ఏవీ లేకపోవడం వల్లే జాతీయ, అంతర్జాతీయ స్థాయి, ఇతర రాష్ట్రాల రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ కంపెనీలు హైదరాబాద్‌కు వస్తున్నాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. అలాగే చిన్న, మధ్య తరహా స్థానిక బిల్డర్లకు స్థలాలే దొరక్కుండా చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ పదేండ్ల నుంచి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు మాత్రం ఎఫ్ఎస్ఐ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలోనే హైరైజ్ బిల్డింగులకు అనుమతులు సునాయసంగా లభిస్తున్నాయి.

జీవో 111 ఎత్తివేసినట్టేనా?

గత ప్రభుత్వం జీవో 111ని ఎత్తేసింది. 84 గ్రామాల్లో నిబంధనలను సడలిస్తూ జీవో 69ని జారీ చేసింది. దీంతో సాధారణ షరతులతోనే లే అవుట్లు, భవన నిర్మాణాలు లభించే అవకాశం ఏర్పడింది. జీవో 111 ఎత్తేస్తూ తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. పురపాలక, ఆర్థిక శాఖ, ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, వాటర్ బోర్డు ఎండీ, కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ, హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్లతో కమిటీ వేశారు. ఈ కమిటీ ఇప్పటి దాకా ఎలాంటి నివేదిక సమర్పించలేదు. దాంతో ఈ ప్రాంతంలో అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అక్రమ నిర్మాణాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అన్ని రకాల అనుమతులతో ప్రాజెక్టులు చేపట్టాలనుకునే వారికి మాత్రం ఆటంకాలు ఎదురవుతున్నాయి. రాష్ట్రప్రభుత్వం దీనిపై నిర్ణయాన్ని త్వరగా ప్రకటించడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకోనున్నది.

రియల్ ఎస్టేట్ రంగానికి ఢోకా లేదు

-లింగస్వామి మోటే, ఫౌండర్ డైరెక్టర్, శ్రీ ఇండియా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్

ఏపీలో చంద్రబాబు సీఎం అయితే తెలంగాణలో రియల్ ఎస్టేట్ డౌన్ ఫాల్ అవుతుందనడం పచ్చి అబద్ధం. తెలంగాణ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలు ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఐటీ, ఏఐ, ఇంకా అనేక రంగాల్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్‌గా ఎవరెస్ట్ ఎత్తుకు ఎదిగింది. ఈ లెవెల్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అమరావతిలో డెవలప్‌మెంట్ కావడం ఇప్పట్లో అసాధ్యం. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌తో పాటు బీజేపీకీ ఓటర్లు సమ ప్రాధాన్యతనిచ్చారు. దీంతో ఇక్కడి ఎంపీలు కొందరు కేంద్రమంతులయ్యే చాన్స్ ఉన్నది. దీంతో ఎక్కువ ఫండ్స్ వచ్చి హైదరాబాద్ మరింత డెవలప్ అవుతుంది. ఏ విధంగా చూసినా హైదరాబాద్ అభివృద్ధికి, రియల్ ఎస్టేట్ రంగానికి ఎలాంటి ఢోకా లేదు.

ఇది అభివృద్ధి చెందిన నగరం

-సురేష్, ప్రెస్టేజ్ డెవలపర్స్ మార్కెటింగ్ హెడ్

హైదరాబాద్ అభివృద్ధి చెందిన మహానగరం. ఇక్కడున్న పొటెన్షియల్ మరెక్కడా ఉండదు. ఐటీ, ఫార్మా కంపెనీలు విస్తారంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఒక ప్రాజెక్టు చేపట్టాలంటే మూడు, నాలుగేండ్లు పడుతుంది. అంటే ఇప్పుడు చేపట్టే ప్రాజెక్టులను అమ్మేందుకు చాలా కాలం పడుతుంది. అప్పుడు ఏపీలో పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయలేం. అందుకే పెద్ద ప్రాజెక్టులు చేపట్టడం కష్టం. ఏపీలో మార్కెట్ కొంత పుంజుకోవచ్చు. కానీ తెలంగాణ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు.

Advertisement

Next Story

Most Viewed